వర్షరహిత గ్రామం;- - యామిజాల జగదీశ్
ప్రపంచంలో ఎప్పుడూ వర్షం కురవని గ్రామం ఒకటుంది. వర్షాభావంతో ఆ గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా పలు ఇబ్బందులు పడుతున్నారు. 
నైరుతి రుతుపవనాలు మొదలవడంతోనే నెలల తరబడి ఉడికించేసే ఎండల నుంచి బయటపడి ఓ అనుభూతిని, ఓ చల్లదనాన్ని అనుభవిస్తాం. అప్పుడు మనసుకి ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం. ఎండ వేడిమితో ఎండిపోయిన ప్రాంతాలన్నీ వర్షాలు కురువడంతోనే మళ్లీ తడిసి యథాస్థితికొస్తాయి.
భూమి నుండి నీరు ఆవిరైపోయి భూ వాతావరణంలో చల్లబడి మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు తగినంత భారీగా ఉన్నప్పుడు, గాలి ద్వారా చల్లబడినప్పుడు వర్షం రూపంలో భూమిపైకి వస్తాయి. 
ప్రపంచంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఎక్కువగానో లేదా తక్కువగానో వర్షం పడుతుంది.  అయితే ప్రపంచంలో అస్సలు వర్షాలు లేని ప్రదేశం ఉందని చెబితే నమ్మరేమో కానీ అది నిజం.
అయినా అదెలా అనే ప్రశ్న తలెత్తకపోదు. ప్రతిచోటా భారీగా కాకపోయినా కనీసం తేలికపాటి వర్షం కురుస్తుందని మీరనుకోవచ్చు. కానీ ఇది నిజం.  
ప్రపంచంలో వర్షాలే లేని గ్రామం ఒకటుంది.  వర్షాభావంతో ఈ గ్రామస్తులు ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. 
అయితే ఇప్పుడు ఆ గ్రామం విషయానికొస్తాను.
ఆ గ్రామం పేరు అల్-హుతైబ్. ఈ గ్రామం యెమెన్ రాజధాని సనా పరిధిలో ఉంది. ఈ గ్రామం భూ మట్టానికి సుమారు 3200 మీటర్ల ఎత్తులో ఎర్ర ఇసుకరాయి కొండపైన ఉంది. ఇతర ప్రాంతాల కంటే ఎత్తుగా ఉన్నప్పటికీ, ఈ ప్రదేశం కరువుతో తల్లడిల్లుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరంలో ఏదో ఒక సమయంలో వర్షాలు కురవటం సహజం. కానీ అల్ హుతైబ్ గ్రామం మాత్రం ఎప్పుడూ పొడిగా ఉంటుంది.  ఈ గ్రామంలో వర్షం పడకపోవటంతో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. పగటిపూట విపరీతమైన వేడి, రాత్రిపూట గడ్డకట్టే చలితో ఈ గ్రామం విచిత్రంగా అనిపిస్తుంది.మరుసటి రోజు  ఉదయం సూర్యుడు ఉదయించడంతోనే వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. ఇదంతా బాగానే ఉంది. 
కానీ ఈ గ్రామంలో వర్షాలు ఎందుకు పడడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే యెమెన్‌లోని ఈ ప్రాంతంలో నీటి వనరులు అతి తక్కువ. మేఘాలు సాగని ఎత్తులో ఉందీ గ్రామం.
అల్-హుతైబ్ గ్రామంలో అనేక పురాతన, ఆధునిక నిర్మాణాలు ఉన్నాయి. ఈ గ్రామంలోని చాలా మంది ప్రజలు అల్-బోహ్రా లేదా అల్-ముకర్మ తెగకు చెందినవారు. వారిని యెమెన్ కమ్యూనిటీ అంటారు. మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ముస్లిం సమాజానికి చెందినవారు. ఈ తెగకు చెందిన చాలా మంది ముంబైలో నివసిస్తున్నారు కూడా.
భూమి ఉపరితలం నుండి 2,000 మీటర్ల ఎత్తులో కనీసం ఐదు రకాలైన మేఘాలు వివిధ ఎత్తులలో ఏర్పడతాయని నాసా పేర్కొంది. అయితే 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న అల్-హుతైబ్ గ్రామాన వర్షం కురిసే అవకాశమే లేకుండా పోయింది. ఉరుములు, భారీ వర్షాలకు కారణమైన క్యుములో నింబస్ మేఘాలు నేల మట్టానికి 20,000 మీటర్ల ఎత్తులో ఏర్పడతాయని నేషనల్ జియోగ్రాఫిక్ పేర్కొంది. వెదర్ అట్లాస్. కామ్ Weatheratlas.com అల్-హుతైబ్ లో వర్షం పడే వీలు లేదని స్పష్టం చేసింది. 
చిలీ ఓడరేవు నగరమైన అరికా ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప వార్షిక వర్షపాతానికి రికార్డును కలిగి ఉంది. ఇక్కడి వర్షపాతం కేవలం 0.6 మి.మీ. 
 

కామెంట్‌లు