మంగళ గౌరీ వ్రతం; సి.హెచ్.ప్రతాప్
 హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీ దేవిని మంగళ గౌరీ రూపంగా కొలుస్తారు. వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల, ఆ తల్లి కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు. అంతేకాదు తమకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. శ్రావణమాసంలోని నాలుగు మంగళవారాలు.. మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం.. కొత్తగా పెళ్లైయిన మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం చేస్తారు. భక్తి, శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ.. తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా.. దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు.పెళ్లికాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అమ్మాయిల వివాహంలో ఆటంకాలు ఎదురవుతు ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆటంకాలు దూరం అవుతాయి.దంపతుల మధ్య సమస్యలు న్నా,  సంతానం కావాలనుకున్నా ఈ మంగళగౌరి వ్రతం, ఉపవాసం ముఖ్యమైనది. అంతేకాకుండా, జాతకంలో కుజ దోషం ఉన్నట్లయితే ఆ యువతులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.తెలుగు పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి. ముందుగా శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్టించాలి. మంగళ గౌరీ దేవిని స్మరించుకంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి.   

కామెంట్‌లు