'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
=========================================
క్రొత్త వృత్తములు.
=============

86.
అమందపాదః - భ, స, జ, గ, గ.
యతి -7.
వారిజనయనా!పరాత్పరా!నే
జేరితి బగితిన్ జిదాత్మ!నిన్నున్
కోరిక తెలుపన్ గృపాకరా!రా
వా!గజగమనా!భజింతు కృష్ణా!//
87.
బంధక - భ, న, మ, గ.
యతి - 6.
శాంతముగను చరింతున్ నిన్నున్
సంతసముగ సదా కీర్తింతున్
జింతలుడుగ చిదాత్మా గొల్తున్
భ్రాంతి విడుతు పరేశా!కృష్ణా!//
88.
ఉపధాయా - భ, న, స, గ.
యతి - 7.
పాదముల కడ పడుతున్ స్వామీ!
నీ దయ తెలిసి నిలుతున్ నీకై
వేదవినుత!దివిజ వంద్యా!నిన్
వేదన తొలగ పిలుతున్ కృష్ణా!//
89.
కోమలము - భ, భ, మ, గ.
యతి - 7.
లోకము లేలెడి లోకేశా!నే
వేకువ జామున ప్రీతిన్ గొల్తున్
దేకువ నీయుము దేవా!దల్తున్
శ్రీకర!సల్పెద సేవల్ కృష్ణా!//

90.
చంపకమాల /రుక్మవతి - భ, మ, స, గ.
యతి - 7.
దారుణమాయెన్ బాధలు తొల్గన్ 
జేరితి నీ చెంతన్ సిరిరాయా!
భారము నీదే శ్రీవర!శ్రీశా!
తారకరామా!శ్రీధర!కృష్ణా!//

కామెంట్‌లు