నేనడిగినప్రశ్నలు నేపొందినసమాధానాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఊహనడిగా
నీ ఉద్దేశ్యమేమిటని
తలలోదూరి ప్రవహించి 
మెదడుకి పనిపెట్టేదానినన్నది

శ్వాసనడిగా
నీ సంగతేమిటని
గాలిని గుండెలోకితీసుకొని
దేహములో ప్రాణాన్నినిలిపేదానినన్నది

చూపునడిగా
నీ పనేమిటని
దృశ్యాలను చూపించి
మనసును మురిపించేదానినన్నది

మాటనడిగా
నీ పొగరేమిటని
మదిలోని భావాలను
తెలియపరచే సాధనాన్నన్నది

చేతినడిగా
నీ కార్యమేమిటని
ఉల్లాన్ని ఉత్సాహపరచి
కాయానికి సుఖాలనందించేదానినన్నది

పాదాన్నడిగా
నీ పాత్రేమిటని
దారిన నడిపించి
గమ్యాలను చేర్పించేదానినన్నది

వినికిడినడిగా
నీ సాయమేమిటని
శబ్దాలు వినిపించి
హెచ్చరికలు జారీచేసేదానినన్నది

స్పర్శనడిగా
నీ బాధ్యతేమిటని
అనుభూతులు కలిగించి
ఆనందడోలికల్లో తేల్చేదానినన్నది

రక్తాన్నడిగా
నీ ఘనతేమిటని
మేనుకి శక్తినిచ్చి
అంగాలను పనిచేయించేదానినన్నది

మనసునడిగా
నీ సంబరమేమిటని
శరీరానికి పాలకుడనని
జీవాన్ని కాపాడేదానినన్నది

స్పందించి
మీరూ అడుగుతారా
సమాధానాలను
మీరూ రాబడతారా


కామెంట్‌లు