సుప్రభాత కవిత ; -బృంద
కలవరాన కలయవెదికిన
కలల జాడల దారులేవీ??
మమకారం మదిని నింపిన
కనుల నీడల వెలుగులేవీ?

శిశిరానికి సెలవంటూ
వసంతపు రాక ఏదీ??
మౌనమైన  వేదనలో 
ఎదురుచూసే వేకువేదీ?

కలత కరిగి నీరైతే
కురిసి తడిసిన చెక్కిలిని
తాకి మెత్తగ ఓదార్చే
చల్లగాలి  స్పర్శ ఏదీ?

గుండెలో బండలా
కదలక కూర్చున్న
దిగులు మూటను విప్పి
బయటకు తరిమేసే మాటలేవీ?

చిన్ని మనసు ఎదుర్కొన్న
అన్ని రకాల వేదనలు..
మరపించే మధురమైన
మనసైన నేస్తమేదీ??

తరుముకొచ్చిన కాలాన్ని
ఆపలేక సతమతమైన
కరుణ నిండిన మనసు పడే
తపన తీర్చే సాయమేదీ?

ఒంటరైన హృదయానికి
ఓర్పు తప్ప దారిలేదని
మార్పు కోసం నిరీక్షిస్తూ
తూర్పు వెలిగే తరుణం కోసం

వేచిన మనసుకు 

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు