సజ్జన సాంగత్య ప్రాశస్త్యం;-సి.హెచ్.ప్రతాప్
 సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే  జీవన్ముక్తి:
సాక్షాత్తూ  ఆదిగురువైన శ్రీ శంకర భగవానుని దివ్య అవతారమైన ఆది శంకరాచార్యుల వారు రచించిన భజ గోవిందం లోని పై శ్లోకం సత్సంగం యొక్క ప్రాముఖ్యాన్ని అపూర్వం గా  వివరిస్తుంది. సత్సంగం అంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం బహు అమూల్యమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలనే సత్సంగం సిద్ధిస్తుంది.సజ్జన సాంగత్యం నిస్సంగత్వం అనగా వివేక వైరాగ్యాలను, నిస్సంగత్వం నిర్మొహత్వం అంటే మాయ నుండి విడిపడిన పరిస్థితి, నిర్మోహత్వం నిశ్చలతత్వాన్ని అనగా  మనస్సు చంచలత్వం పొందని స్థితిని  ప్రసాదిస్తాయి.ఆఖరుగా నిశ్చలతత్వం జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సాక్షాత్తు దైవ స్వరూపులైన మానవుల లక్ష్యం జొవన్ముక్తియే కదా!
మనం నిత్య జీవితం లోచేసే సాంగత్యం పై మన జీవితం, మన ఉన్నతి అధారపడి వుంటాయి.అది మన మనస్సులను, భవిష్యత్తును మన ఆత్మను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దుర్జనుల సాంగత్యం లో మనకు దురలవాట్లు అబ్బుతాయి. వారితో కలిసి ఎన్నో పాప కార్యాలను చేస్తాం. తిరిగి వాటిని మనమే అనుభవిస్తూ అంతులేని దూఖాన్ని పోగుచేసుకుంటాము. సజ్జన సాంగత్యం మన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పంధాన నడవక పోతే  పాప కార్యాల పంకిలంలో పడి  చేసిన కర్మల తాలూకూ ఫలితాన్ని అనుభవించదానికి ఎన్ని జన్మలైనా  జనన మరణ చక్రభ్రమణంలో కొట్టు మిట్టాడుతునే వుంటాము. అందుకే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక సద్గురువును ఆశ్రయించడం ఎంతో అవశ్యం. వారు మనకు జీవన్ముక్తిని సాధించే మార్గాన్ని చూపిస్తారు. ఆందువలన ఆత్మ జ్ఞానాన్ని మనకై మనం వెతుక్కోవల్సిన పని లేదు. సద్గురువులకు త్రికరణ శుద్ధిగా సర్వశ్య శరణాగతి చేస్తే చాలు. 

కామెంట్‌లు