సుప్రభాత కవిత ; - బృంద
చెప్పకనే తెలుసుకునే మనసు
ఒప్పకున్నా ఓర్చుకునే మనసు
ఎప్పటికీ తోడుండే మనసు
తప్పక  ప్రియ నేస్తానిదే ఆ మనసు!

తెరలు లేని బంధం
పొరలు ఎరుగని బంధం
అరమరికలు లేని బంధం
మరపు రాని స్నేహబంధం!

షరతులేవీ ఉండని
కలుషితం కడవరకూ కాని
జన్మకు ఒక్కరైనా సరే
కమ్మనైన నేస్తం ఉండాలి.

ముందుకు వెడుతూ
వెనుతిరిగి చూస్తే చిరునవ్వుతో
గెలుపునీదే అనే స్నేహం
ఒక్కటైనా ఉండాలి!

అలసిపోయిన బ్రతుకులో
అన్నీ మరిపించి....
అలరించే స్నేహం
ఒక్కటైనా ఉండాలి!

గుర్తు రాగానే మనసంతా
వెన్నెల పరచినట్టయే
మధురమైన స్నేహం
ఒక్కటైనా ఉండాలి!

కలతలెన్ని వచ్చినా
కలుములెన్ని కరిగినా
వెల్లువై వచ్చే వేకువలా
అల్లుకునే స్నేహం ఉండాలి!

లోకానికంతా మిత్రుడై
శుభం చేకూర్చే నియమంతో
క్రమం తప్పక కరుణించే
ఆదిత్యునికి అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు