పశ్చాత్తాపంతో మార్పు;- - యామిజాల జగదీశ్
 ఒక వృద్ధుడు ఒక యువకుడిని కలిసాడు.
అతను "మీకు నేను గుర్తున్నావా?" అని వృద్ధుడ్ని అడిగాడు.
వృద్ధుడు గుర్తు లేదన్నాడు.  
అప్పుడు యువకుడు"మీ విద్యార్థినండి"  అని చెప్పాడు. 
అంతట ఆ పెద్దాయన అడుగుతాడు :
"నువ్వేం చేస్తున్నావిప్పుడు?" అని.
యువకుడు "నేనిప్పుడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నానండి..." అనిజవాబిచ్చాడు.
"ఆహా, నాలాగా ఉపాధ్యాయుడివయ్యేవా. వినడానికెంతో బాగుంది?"  అన్నాడు పెద్దాయన. 
"నాకూ ఆనందంగా ఉందండి. మీ ప్రేరణతోనే నేనీ రోజు ఉపాధ్యాయుడినయ్యానండి" అన్నాడు యువకుడు.
వృద్ధుడు ఎంతో ఆసక్తితో
" ఏ సమయంలో ఉపాధ్యాయుడు కావాలని నిర్ణయించుకున్నావు" అని అడుగుతాడు. 
అంతట యువకుడు ఆ పెద్దాయనకు ఒక కథను చెప్తాడు...
"ఒకరోజు, ఓ స్నేహితుడు ఒక మంచి నా దగ్గరకు వచ్చాడు. అలాంటి వాచీ నా వద్దా ఉండాలనుకున్నాను. ఎలాగైనా ఆ వాచీ కొట్టెయ్యాలనుకున్నాను.  అనుకున్నునట్టే అతని జేబులో నుంచి తీసుకున్నాను.  కొద్దిసేపటికి, ఆ స్నేహితుడు తన వాచీ  పోయిందని గ్రహించి వెంటనే మా టీచర్‌కి ఫిర్యాదు చేశాడు. ఆ టీచర్ మరెవరో కాదండి...మీరేనండి.
అప్పుడు మీరు తరగతిని ఉద్దేశించి ఇలా అన్నారు, 'ఈ కుర్రాడి వాచీ పోయింది. ఎవరో దొంగిలించారు. దానిని ఎవరు దొంగిలించారో, దయచేసి తిరిగి ఇవ్వండి..." అని.
కానీ నాకు ఆ వాచీ అంటే ఇష్టం కావడంతో  నేను దానిని తిరిగి ఇవ్వలేదు. అపప్పుడు మీరు తలుపు మూసేసి, మా అందరినీ లేచి నిలబడి ఒక వృత్తాకారంలో నిలబడమన్నారు. మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నారు. మేమందరం కళ్ళు మూసుకున్నాం. మా జేబులను ఒక్కొక్కటిగా వెతకడం మొదలుపెట్టారు. మీరు నా జేబులోంచి వాచీ తీసుకున్నారు. అయినప్పటికీ మీరు అందరి జేబులూ వెతికారు. వెతకడం అయిన తర్వాత మమ్మల్నందరినీ కళ్ళు తెరవమన్నారు. నా జేబులో మీకు వాచీ దొరికినా మీరు నా గురించి ఒక్క మాటా చెప్పలేదు. మీరు ఈ సుఘటన గురించి మరెప్పుడూ క్లాసురూములో ప్రస్తావించలేదు. వాచీ దొంగను నేనేనని మీరు ఎప్పుడూ చెప్పలేదు. ఆ రోజు మీరు నా పరువు కాపాడారు. అది నా జీవితంలో అత్యంత అవమానకరమైన రోజు.  కానీ ఆరోజు  నాకొక పాఠం నేర్పింది. జీవితంలో ఇంకెప్పుడూ దొంగతనం చేయకూడదని నిర్ణయానికి వచ్చాను. మీరెప్పుడూ నన్ను ఏమీ అనలేదు.
నన్ను తిట్టలేదు. నన్ను దొంగతనం చేయవద్దని చెప్పడానికి మీరు నన్ను  పక్కకు తీసుకెళ్లలేదు. మీరు చెప్పక చెప్పిన పాఠం నాకొక గొప్ప సందేశాన్నిచ్చింది. 
మీకు కృతజ్ఞతలు. నిజమైన విద్యావేత్త ఏమి చేయాలో ఎలా ఉండాలో అని మీవల్ల తెలిసొచ్చింది. ఈ సంఘటన మీకు గుర్తుందా అని మాష్టారునడిగాడు.
అప్పుడు ఆ పెద్దాయన ‘అవును... నాకిప్పుడు గుర్తుకొచ్చింది. అయినా పెద్దరికంతో  నేను నిన్ను గుర్తుపట్టలేదు" అని అన్నాడు.
ఈ ఉదంతం చెప్పే పాఠం...
ఒకరిని సరిదిద్దాలంటే వారిని అవమానించాల్సిన అవసరం లేదు. పెరిగే కొద్దీ మనస్సు పశ్చాత్తాపం చెంది మనలో మంచి మార్పు తెస్తుంది. ఆ అనుభవం పాఠం సామాన్యమైనది కాదు. 

కామెంట్‌లు