న్యాయాలు -589
పలితాపలిత కేశ న్యాయము
****
పలిత అనగా చెడ్డ,తెల్లనైన,, తెల్లని వెంట్రుకలు గల ముదుసలి ,తల వెంట్రుకలు నెఱయుట,నెఱసిన వెంట్రుక.అపలిత కేశము అనగా తెలుపు కాని వెంట్రుక అంటే నల్ల వెంట్రుక అని అర్థము.
అనగా తెలుపు నలుపు వెంట్రుకలతో కూడిన తల అని అర్థము
అయితే ఈ న్యాయము పైకి చూడటానికి ఎంతో సరదాగా అనిపిస్తుంది. ఎందుకో చూద్దాం. ఒకనొక వ్యక్తి తల నెరిసీ నెరియనట్లు ఉంటుంది. అంటే అతని తలలో తెలుపు,నలుపు వెంట్రుకలు ఉన్నాయన్న మాట.అయితే అతనికి అతి దగ్గరగా మసిలే ఓ ఇరువురు ఉన్నారు.వారిలో ఒకరు వయసు మల్లిన వ్యక్తి.మరొకరు వయసులో ఉన్న వ్యక్తి.ఇతని తలలో తెల్ల వెంట్రుకలు చూసి అరెరే పెద్దవాడివైనట్టు కనిపిస్తున్నావంటూ తెల్ల వెంట్రుకలను పీకేస్తే, ఇక మరో వ్యక్తి లేదు లేదు వయసుకు తగ్గట్టుగా ఉండాలంటూ నల్లవెంట్రుకలను తొలగించడంతో...అటు తెలుపు,ఇటు నలుపు వెంట్రుకలు మొత్తం కోల్పోయి ఆ వ్యక్తి తల బోడిగుండు అయ్యిందట.అలాంటి వ్యక్తులతో సహజీవనం, స్నేహం చేస్తే,అతి పరిచయం పెంచుకుంటే , అతిగా చనువు ఇస్తే ఇలాగే వుంటుందని చెప్పడానికి మన పెద్దలు ఈ "పలితాపలిత కేశ న్యాయము"ను ఉదాహరణగా పోల్చి చెబుతుంటారు.
అంటే భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ముఖ్యంగా ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను అంగీకరించలేని వారు ఎప్పటికీ మానసికంగా కలవలేరనీ ,ఒకవేళ స్నేహం చేసినా ఒకే ఇంట్లో వివాహ బంధంతో కలిసి కాపురం చేసినా వారి మధ్య ఉండేది కలిసిపోయేతనం కాదు.కయ్యానికి కాలు దువ్వడం,హాని కలిగించడమే వుంటుంది.ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెరిగి నమ్మలేని పరిస్థితి కూడా వుంటుందనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది.
మరి ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో దీనికి దగ్గరగా ఉన్న ఓ కథను చూద్దామా...
పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచి దానితో స్నేహంగా వుండే వాడు.కొంత కాలానికి చిలుకకు ఓ చిలుక జన్మించింది. ఆ చిన్న చిలుక పిల్లతో రాజుగారి కుమారుడు ఆడుకునే వాడు.అందుకే చిలుక కూడా రాజు గారి కుమారుడిని ఎంతో ప్రేమగా చూస్తూ వుండేది.రకరకాల పండ్లు తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చేది.
అలా ఉండగా ఒక రోజు చిలుక బయటికి వెళ్ళిన సమయంలో చిలుక పిల్లను రాజుగారి కుమారుడు చంపేస్తాడు. బయటికి వెళ్ళి వచ్చిన చిలుక తన బిడ్డ చనిపోవడం చూసి ఎంతో దుఃఖిస్తుంది. పసి చిలుకని కూడా చూడకుండా చంపిన రాజ కుమారుడిపై తాను మాత్రం ఎందుకు దయ తలచాలనుకుని ఆ రాజ కుమారుడి కళ్ళను గోళ్ళతో పొడిచి గుడ్డి వాడిని చేస్తుంది. ఆ విషయం రాజుకు చెప్పి "నేను అలా చేసి వుండకూడదు. నేను పాపం చేశాను.ఇక ఇక్కడ ఉండను వెళ్ళిపోతున్నాను." అంటుంది. ఆ మాటలకు రాజు గారు నీవు ఏ పాపం చేయలేదు.నీ పిల్లను నా కొడుకు చంపాడు కాబట్టి నీవు వాడి కళ్ళు పొడిచావు.అంతటితో ఆ విషయం అయిపోయింది.కాబట్టి మునుపటిలా స్నేహంగా వుందాం. నీవంటి మంచి స్నేహాన్ని వదలలేను ." అంటాడా రాజు.
అప్పుడు చిలుక ఒకసారి స్నేహం చెడిపోయిన తర్వాత పగ మరిచి ఎంత మంచిగా ఉండాలని అనుకున్నా చివరికి వస్తూనే ఉంటుంది. ఒకసారి మనసులో పుట్టిన అపనమ్మకం గానీ,పగ కానీ నివురు కప్పిన నిప్పులా అలాగే రగులుతూ వుంటుంది.ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఎవరికి ఎవరూ నమ్మలేరు.నమ్మవద్దు కూడా.కాబట్టి నీతో స్నేహం కొనసాగించలేను " అని చెప్పి చిలుక ఎగిరి పోతుంది.
మన పెద్దవాళ్ళు సరదాగా నలుపు, తెలుపు వెంట్రుకలు ఉన్న వ్యక్తిని,అతనితో కలిసుండే ఇద్దరు వ్యక్తులను ఉదహరిస్తూ వారి చేష్టలను మానవ మనస్తత్వానికి ముడిపెట్టి చెప్పడం జరిగింది.అంతే కాదు అలాంటి భిన్న మనస్తత్వాలు కలిగిన వారి వల్ల చిన్నదో పెద్దదో ఒకసారి హాని జరిగిన తర్వాత వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని చెప్పడం గమనించ వచ్చు.
కాబట్టి ఈ "పలితాపలిత కేశ న్యాయం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఒకసారి మనకు హాని కలిగించిన వ్యక్తులను, భిన్న ధోరణులు కలిగిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు.మన జాగ్రత్తలో మనం ఉండాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి