టాయిలెట్స్ ఫొటోస్ తప్పించడం హర్షణీయం

 రోజూ పాఠశాలలో గల టాయిలెట్స్ ఫోటోలను తీసి పంపించాలనే విధానాన్ని రద్దుపరచిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మిక్కిలి హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజాం మండల శాఖ అధ్యక్షులు మువ్వల రమేష్, ప్రధాన కార్యదర్శి బలివాడ నాగేశ్వరరావులు అన్నారు. ఈ ప్రక్రియ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉందని గత ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా వినకుండా మొండి వైఖరి అవలంబించిందని వారు దుయ్యబట్టారు. 
బోధనేతర పనులు వద్దు అని ఉపాధ్యాయలోకం ఎంతగా మొత్తుకున్నా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని గుర్తుచేసారు. 
పాఠశాలలో ఉన్న మరుగుదొడ్ల, హేండ్ వాష్, ఫ్లోర్ ఫొటోస్ తీయాలని అనడం, అవి ఏ రకమైనవో,  వాటి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో పేర్కొనమనడం, బాలురకూ బాలికలకూ వేర్వేరు యూనిట్స్ అంటూ నిర్దేశించి ఫోటోలు పంపాలంటూ వేధించడంతో బోధనాసమయం ఎంతగానో హరించిపోయేదని వారన్నారు. యాప్ ల ద్వారా పంపాలనే ఈ చెత్త విధానాన్ని అమలుపర్చే తరుణంలో నెట్, సిగ్నల్స్, టవర్ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తే సందర్భాలు చాలా ఎదుర్కొన్నామని రమేష్, నాగేశ్వరరావులు తెలిపారు. సరిగా పనిచేయని యాప్ లతో కుస్తీ పాట్లు పడడంతో పాటు, అవి అప్లోడ్ కాకపోతే మెమోస్ పంపేవారని, ఉపాధ్యాయులంతా చేయని తప్పుకు శిక్ష అనుభవించారని వారు మండిపడ్డారు.
పాఠశాలలో మరుగుదొడ్ల ఫొటోస్ తీసి యాప్ లో అప్లోడ్ చేసే హింస నుండి ఉపాధ్యాయ వర్గానికి విముక్తి కలిగిస్తూ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజాం మండలశాఖ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. ఇంకనూ మిగిలియున్న మరికొన్ని యాప్ లు, ఫోటోలు తీసి పంపించాలంటూ ఉన్న విధానాలు కూడా రద్దు చేసి, బోధనకే పూర్తి సమయం వెచ్చించేలా చేయాలని రమేష్, నాగేశ్వరరావులు కోరారు.
కామెంట్‌లు