నాదస్వర చక్రవర్తి రాజరత్తినం పిళ్ళై;- - యామిజాల జగదీశ్
 నాదస్వర చక్రవర్తి తిరువాడుదురై రాజరత్తినం పిళ్ళై వాయించిన నాదస్వరం స్వాతంత్ర్య దినోత్సవం (1947 ఆగస్టు 15) నాడు ప్రప్రథమ కచేరీగా దేశమంతటా ఆకాశవాణి ద్వారా ప్రసారమవడం విశేషం. 
రాజరత్తినం పిళ్ళై తమిళనాడులోని తిరుమరుగల్ అనే ఊళ్ళో 1898 ఆగస్ట్ 27న జన్మించారు. కుప్పుసామి పిళ్ళై - గోవిందమ్మాళ్ దంపతులకు జన్మించారు. అయితే తిరుమరుగల్ నటేశపిళ్ళై దత్తపుత్రుడిగా పెరిగిన ఈయన టి. ఎన్. రాజరత్తినం పిళ్ళైగా ప్రసిద్ధికెక్కారు.
పదిహేడో తిరువాడుదురై ఆధీనం తిరుమరుగల్ వచ్చినప్పుడు నటేశపిళ్ళై నాదస్వరం విని ఆయనను తన ఆధీన మఠానికి ఆస్థాన విద్వాంసుడిగా ప్రకటించి గౌరవించారు.
రాజరత్తినం అయిదో ఏట నటేశ పిళ్ళై కన్నుమూశారు. వయోలిన్ విద్వాంసుడు తిరుక్కోడికావల్ ఫిడిల్ కృష్ణయ్యర్ వద్ద రాజరత్తినం సంగీతం అభ్యసించారు. అనంతరం ఎనిమిదో ఏట కోనేరిరాజాపురం శ్రీ వైద్యనాథ అయ్యర్ వద్ద శిష్యరికం చేశారు. మరో ఏడాదికి నన్నిలంలో ఆయన కచేరీ శ్రీకారం చుట్టుకుంది. అయితే పాడుతున్నప్పుడు ఆయన గొంతు దెబ్బతినడంతో సన్నిధానం ఆయనను గాత్రం మానేసి నాదస్వరం నేర్చుకోమని ప్రోత్సహించారు.
ఆ మేరకు ఆయన మొదటగా మార్కండేయంపిళ్ళై వద్ద నాదస్వరం వాయించడం నేర్చుకున్నారు. అనంతరం అమ్మాసత్తిరం కన్నుస్వామి పిళ్ళై, కీరనూర్ ముత్తుస్వామి పిళ్ళై వద్ద నాదస్వరంలో మరింత శిక్షణ పొందారు. రాజరత్తినం పిళ్ళైకి కీర్తనలు వాయించడం నేర్పించిన వారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరూణానిధి తండ్రి ముత్తువేలర్ అనేది గమనించాల్సిన అంశం. తొలి రోజుల్లో మఠంలో ఉదయంపూట పూజాసమయంలో రత్తినం పిళ్ళై నాదస్వరం వాయించడానికి అవకాశమిచ్చినవారు సన్నిధానం. రత్తినం పిళ్ళై ఎవరి బాణీని అనుకరించక భూపాళ రాగాన్ని వాయించేవారు. 
ఈయనకు అయిదుగురూ భార్యలు. కానీ పిల్లలు లేరు. దాంతో ఈయన శివాజీ అనే అతనని పెంచుకున్నారు. 1956 డిసెంబర్ 12వ తేదీన రాజరత్తినం పిళ్ళైగుండెపోటుతో మరణించినప్పుడు ప్రముఖ నటులు ఎన్. ఎస్. కృష్ణన్, ఎం ఆర్. రాధా తదితరులు ఆయన పక్కనే ఉన్నారు. 
తమిళ కవి కణ్ణదాసన్ సంతాప సందేశం రాసి నివాళులర్పించారు.
 ఎ. వి. ఎం. చెట్టియార్ రాజరత్తినం పిళ్ళై వాయించిన ప్రముఖ తోడి రాగాన్ని రికార్డు చేసి ఆరున్నర నిముషాల రికార్డు ప్లేటుని విడుదల చేశారు. ఇది ప్రపంచ దేశాలలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి చరిత్రపుటలకెక్కింది
1955 జనవరి ఇరవై ఒకటో తేదీన ఆవడిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మహానాడు ప్రారంభంలో నేతలకు స్వాగతం పలుకుతూ సాగిన ఊరేగింపులో ఈయన నాదస్వరం వాయించి అందరి ప్రశంసలు పొందారు.
నాదస్వరానికి తంబూరా శృతి చేసుకుని మృదంగం, వీణ, కంజీరా వంటి పక్కవాయిద్యాలతో కచేరీ చేసి అందరినీ తన్మయపరిచారు రాజరత్తినం పిళ్ళై.
పదహారో శతాబ్దపు తమిళ కవి కాలమేఘం పేరిట తీసిన సినిమాలో రాజరత్తినం పిళ్ళై ప్రధాన పాత్ర పోషించారు. అలాగే తిరునీలకంఠర్ (1939) అనే టైటిల్ తో వచ్చిన సినిమాలో నాదస్వర విద్వాంసుడిగా కాస్సేపు కనిపిస్తారు.
నాదస్వర విద్వాంసుడిగా అనేక అవార్డులు రివార్డులు పొందిన రాజరత్తినం పిళ్ళై తవిల్ వాయించే వారినిసైతం సంగీత కళాకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌లు