సుప్రభాత కవిత ; -బృంద
ముద్దుగారే మోము
హద్దు మీరిన అల్లరి
పొద్దంతా చూసినా విన్నా
వద్దనిపించని లీలలు..

అవతారపురుషునీ
జగద్గురువునీ ..
జగానికందించడానికి
దేవకీదేవి ఏ నోము చేసెనో?

నీ సుందర బాల్యం
కనులారా దర్శించి
సంబరపడే భాగ్యం పొందిన
యశోద దెంత పుణ్యమో?!

నీ అల్లరి చేతలనూ
నీ బాల లీలలనూ
చూసి తరించిన
రేపల్లె వాసులదెంత భాగ్యమో!?

నీ పెదవుల పైన నిలిచి
నీ ఊపిరి తనలో నిలిపి
తీయని రాగాలు పలికించు
వేణువుగ మారిన వెదురుదెంత 
వరమో!?

నీవు పుట్టిన మధుర
నీవు నడయాడిన బృందావనము
నీవు పాలించిన ద్వారక
నీవు గీత పలికిన కురుక్షేత్రము
కల నా దేశమెంత గొప్పదో!?

నీవు ఆదరించిన స్నేహము
నీవు చేసిన సాయము
నీవు చూపిన ధర్మము
నీవు చెప్పిన మార్గము
జనులకెంత దిశానిర్దేశనమో!?

కన్నయ్యవై...మనసుదోచి
అన్నయ్యవై మానముకాచి
అందరి లెక్కల అంతు తేల్చి
మనసున్నయ్యవై ఎల్లవేళల
మమ్ముగాచు

చిన్నికృష్ణా  నిన్ను చేరి కొలుతు🙏

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు