సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా
 న్యాయాలు -594
పారిషద న్యాయము
    *****
పారిషద అంటే సభా సంబంధమైన సభ్యుడు అని అర్థము.
సభలో పని చేయించే వ్యక్తి ఒక్కడే అయినప్పటికీ  ఆ పనిని అందులో ఉన్న వారంతా చేసినట్లు భావించడాన్ని "పారిషద న్యాయము" అంటారు.
అయితే ఇది కేవలం సభకే పరిమితం కాలేదు  ఒక దేశానికి సంబంధించి కావచ్చు. సంస్థ లేదా సమూహానికి సంబంధించి కావచ్చు. ఇలా వాటికి అధ్యక్షత వహించిన వ్యక్తిని అధ్యక్షుడు ,సభాపతి లేదా సభాధ్యక్షుడని అంటారు.
 అయితే సభ మొత్తానికి అధిపతిగా ఉన్న వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే సభలోని ఇతర సభ్యుల అధికారాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడటం, వారి హక్కులను సంరక్షించడం, అభ్యంతరకరమైన విషయాలను ఖండించడం,సభ పనితీరుకు సంబంధించిన నిబంధనలకు లోబడి మధ్యవర్తిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించడం లాంటి వన్నీ సభాధ్యక్షుడి  విధులు.
 ఏ సభలోనైనా అధ్యక్ష పదవి చాలా కీలకమైనది.సమయపాలన సభా నిర్వహణ తీరు అంతా సభాధ్యక్షుడి సామర్థ్యం , సమయస్ఫూర్తి మీదనే ఆధారపడి ఉంటుంది.
 అయితే దీనిని కేవలం ఒక సభకో సమావేశానికో అన్వయించ కూడదని అంటారు పెద్దలు. సంస్థను నడిపే అధికారి కావచ్చు,పాఠశాల సక్రమంగా నడిచేలా చేసే ప్రధానోపాధ్యాయుడు కావచ్చు. ఇంకా చెప్పాలంటే కుటుంబాన్ని నడిపించే ఇంటి యజమాని కూడా కావచ్చు.వారందరికిది వర్తిస్తుంది.
వీరి నిర్వహణా తీరు,దక్షత బాగుంటేనే సంస్థ, పాఠశాల,కుటుంబం ఏదైనా సరే మొత్తానికి పేరు వస్తుంది.లేదంటే భాస్కర శతక కర్త రాసిన పద్యంలా వుంటుంది.అదేంటో మరి చూద్దామా....
"దక్షుడు లేని ఇంటికి బదార్థము వేఱొక చోటు నుండి వే/ లక్షలు వచ్చుచుండిన బలాయనమై చనుగల్లగాదు ప్ర/త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే/యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!"
అనగా "గండి పడిన చెరువులోనికి కొండ వాగులు,జల ప్రవాహములు ఎన్ని వచ్చి చేరినా అక్కడ  నీరు నిలువ వుండదు. ఆ విధంగా కుటుంబ బాధ్యత వహించునట్టి యజమాని లేని ఇంటికి ధనము లక్షలు వచ్చినా నిలువ వుండదు" అని అర్థము. అయితే ఇది కేవలం ఇంటి యజమాని లేకుంటే మాత్రమే కాదు.ఆ యజమాని ఉండి కూడా సమర్థుడు కాకుంటే,కుటుంబ సభ్యులందరూ సరిగా సహకరించకపోతే కూడా అలాగే ఉంటుంది.
ఇక మంచి లేదా చెడు పేరు ఏది వచ్చినా అది  సమన్వయం చేసే వ్యక్తితో పాటు ఫలితం మాత్రం అందరి అనుభవంలోకి వస్తుంది.
అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. పని చేయించే వాడు ఒక్కడే ఉన్నా అందరిలో కొందరు బాధ్యతగా చేయక పోయినా  బాధ్యత వహించిన వ్యక్తి దక్షత వల్ల పేరు మాత్రం అందరికీ వస్తుంది.పని చేయని వారి విషయం  బయటి ప్రపంచానికి తెలియదు.వచ్చిన మంచి పేరు పోతుందేమోనని  దాని బాధ్యుడు ఎవరికీ తెలియకుండా గుట్టుగా నిర్వహించే సందర్భాలు ఉంటాయి.
కుటంబాలైతే పరువు కోసం,సంస్థలైతే ప్రతిష్ట కోసం "పారిషద న్యాయము" ను అనుసరిస్తూ వుంటాయి.
మరి ఇది చదివిన మనకు తెలిసిపోయింది కదా ఎలా ఉండాలో? ఎలా ఉండకూడదో? కాబట్టి మనం పనులను అంకిత భావంతో చేద్దాం.నిర్వహణా బాధ్యత మనదైతే హక్కులకు భంగం కలగకుండా అందరూ చేసేలా చూద్దాం.మరి మీరేమంటారు?

కామెంట్‌లు