విస్తుపోయిన టాల్ స్టాయి;-- యామిజాల జగదీశ్
 ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ రచయిత లియో టాల్ స్టాయి ఒకరోజు పార్కులో ఓ బల్లమీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు. ఇంతలో అక్కడికి  ఓ చిన్నారి బంతి తీసుకొచ్చింది. 
టాల్ స్టాయిని చూసి "నాతో ఆడతారా తాతా" అని అడిగింది. 
టాల్ స్టాయి " సరే" నని ఆ చిన్నారితో కాస్సేపు ఆడారు. దాంతో చిన్నారికి ఆనందం.
 
చీకటి మొదలవడంతో  టాల్ స్టాయితో చిన్నారి "చీకటి పడుతోంది...నేనిక వెళ్ళొస్తాను" అని చెప్పింది.
అప్పుడు టాల్ స్టాయి " మీ అమ్మతో చెప్పు... నేనీ రోజు టాల్ స్టాయితో ఆడుకున్నాను  " అని అన్నారు. ఇలా చెప్పిన టాల్ స్టాయి గొప్పగా ఘనంగా ఫీలయ్యారు మనసులో. 
అయితే చిన్నారి అలాగేనంటూ " మీరూ మీ అమ్మతో చెప్పండి... మేరీతో ఆడుకున్నాను  " అని అంది.
ఈ మాటతో టాల్ స్టాయి విస్తుపోయారు. తనలా అంటుందని ఊహించలేదు.
ఓ ప్రముఖ రచయితనైన తనను తనకు సమానంగా ఆ చిన్నారి భావించడం తలచి టాల్ స్టాయి తన అహానికి లోలోపలి బిడియపడ్డారు. 

కామెంట్‌లు