సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా

 న్యాయాలు-592
పాద ప్రసారిక న్యాయము
******
పాద అనగా కాలి అడుగు భాగము,అరికాలు,పాదము,చరణము. ప్రసారిక అంటే ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశానికి వ్యాపించడం అని అర్థము.
పాద ప్రసారిక అంటే  వేసే అడుగులతో ఒక చోటు నుండి మరొక చోటికి వ్యాపించడం, పయనించడం అని అర్థము.
అనగా నడక నేర్చిన మానవుడు తన పాదాలతో కాలినడకన చేసిన ప్రయాణం ఎన్నో ఆవిష్కరణలకు చిరునామాగా మారింది. గుహల్లోంచి గృహాల్లోకి వ్యాపించిన నడక  మానవ జాతిని శాస్త్ర, సాంకేతిక ,సామాజిక రంగాల అభివృద్ధిలో విజేతగా నిలిపింది.
 ఇదంతా మానవ నాగరికతా పరిణామ క్రమంలో భాగం.మరి వ్యక్తిగా వ్యాపించడం అంటే ఏమిటి ?ఎలా వ్యాపించాలి? దానికి కావలసిన వస్తువేమిటీ?  కేవలం పాదాలతో నడుస్తూ పోతే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి  అనుకున్న విధంగా వ్యాప్తి  చెందగలమా? అనే ప్రశ్నలు మనలో ఉదయిస్తూ వుంటాయి.
 వీటిన్నింటికి ఆధ్యాత్మిక వాదులు చెప్పే జవాబు ఒక్కటే. ఎంత దూరమైనా అలవోకగా ప్రయాణించడానికి, అనుకున్నది సాధించడానికి  మనల్ని సృష్టించిన సృష్టి కర్త  "ఆలోచించగలిగే మెదడు"ను  మనకు ఇచ్చాడని, దానితో  వాయు వేగాన్ని మించి వ్యాప్తి చెందవచ్చని అంటారు.
అంటే ఆలోచించే మెదడు చాలు. దానితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. దానిని సరిగా ఉపయోగించుకున్న వారు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికే కాదు విశ్వవ్యాప్తం కావచ్చన్న మాట.
 మరి మనం ఆ దిశగా వెళ్తున్నామా? మరి ఈ కష్టాలు-నష్టాలు, సుఖాలు- దుఃఖాలు, బాధలు,మోదాలు మొదలైన వాటన్నింటికీ బాధ్యత ఎవరిదై వుంటుంది ?అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం   వెతికితే "ఎవరైతే వీటిని మోస్తూ,అనుభవిస్తూ వుంటారో వారే.అంటే ఆయా వ్యక్తులే వాటికి బాధ్యులు.మరి వాటి నుండి బయటపడి వెళ్ళాల్సిన గమ్యం, చేరుకోవాల్సిన లక్ష్యం, ఈ సమాజంలో మనిషిని  మనీషిగా,ఆదర్శంగా నిలబెట్టేది, నిలబెట్ట గలిగేది  కేవలం ఆలోచించే మెదడేనని మరిచిపోవద్దు.
ఆ దిశగా ఆలోచనలను మళ్ళించి స్థిర సంకల్పంతో కూడిన మొదటి అడుగుతో ప్రయాణం మొదలు పెడితే ఎవరికి వారే  ఆశ్చర్యపోయేలా విజయం వినమ్రంగా తోడుగా నడుస్తుంది.ఊహించిన ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది .
 ఈ "పాద ప్రసారిక న్యాయము"లో ఉన్న అంతరార్థం ఇదే. ఈ పాదం లేదా అడుగు వేయకుండా  ఎవరూ వ్యాప్తి చెందలేరు.చరిత్ర పుటల్లో తమ పేరును చేర్చుకోలేరు.
మహనీయుల జీవితాలను చదివితే  ఎవరికైనా ఈ విషయం బాగా అర్థం అవుతుంది. వారెలా ఉన్నత స్థితికి చేరుకున్నారు? వారు అనుకున్న జీవితాన్ని ఎలా ప్రారంభించారు? దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?సమాజ హితానికా?(స్వార్థానికా? స్వార్థానికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు అలా బతికిన మనుషులు చివరికి ఏమయ్యారో చదివాం, కళ్ళముందు చూస్తున్నాం)ఏళ్ళు,తరాలు,యుగాలు గడిచినా కొందరిని  నిత్యం ఎందుకు స్మరిస్తూ ఉంటాం ?వారి బాటలో నడవాలని తపన పడుతూ వుంటాం.ఇలాంటి జీవిత గాథలు, చరిత్ర చదవడం వల్ల చేయాలనుకున్న పనులకు ఓ మంచి నిర్ణయాత్మక సామర్ధ్యం కలుగుతుంది.వెళ్ళాల్సిన గమ్యం స్పష్టంగా కళ్ళముందు కనిపిస్తుంది.
అలా  వారి ఆదర్శంగా తీసుకుని వేసే అడుగుల ముద్రలు శాశ్వత రూపం సంతరించుకుంటాయి. మనల్ని అనుసరించే వారికి దిశానిర్దేశం అవుతాయి.
 మన పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు చెప్పే ప్రతి మాటలో,ఉదహరించే ప్రతి న్యాయములోనూ మనిషిని వ్యక్తిగతంగా, సామాజికంగా ఉన్నతంగా తీర్చి దిద్దాలనే ఆకాంక్ష , ఆరాటం కనిపిస్తుంది.అది గ్రహించి ఆచరిస్తే వారి కోరిక ఫలిస్తుంది. మన జీవితం సరైన దారిలో నడుస్తుంది .ఈ పాద ప్రసారిక విశ్వ ప్రసారికై  అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది.

కామెంట్‌లు