రేషెవ్‌స్కీ అద్భుతం;- - యామిజాల జగదీశ్
 ఎనిమిదేళ్ళ కుర్రాడు 1920లో ఫ్రాన్స్‌లో  అద్భుతం సృష్టించాడు.  అతని పేరు శామ్యూల్ రెషెవ్‌స్కీ Samuel Reshevsky.  ఈ చదరంగ క్రీడ బాలమేధావి ఏకకాలంలో పలువురు చెస్ మాస్టర్‌లను ఓడించి ఔరా అనిపించుకున్నాడు. తొమ్మిదేళ్ళకల్లా అతను 1,500  మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో కేవలం 8 పోటీలలో మాత్రమే ఓడిపోయాడు.  అతను యుక్తవయస్సు వచ్చేసరికి గొప్ప చెస్ ఆటగాడిగా మన్ననలు అందుకున్నాడు.
అతను అమెరికా చెస్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ ని ఎనిమిది సార్లు గెలుచుకున్నప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌గా మాత్రం నిలవలేదు. అయితే ప్రపంచ చదరంగ క్రీడలో దిగ్గజమనిపించుకున్న బాబీ ఫిషర్‌తో అతను సమానంగా నిలవడం విశేషం.  
కానీ కాలం కలసిరాక అతను ప్రొఫెషనల్ క్రీడాకారుడు కాలేకపోయాడు. జీవితావసరాలు తీర్చుకోవడానికి అతను అకౌంటెంటుగా పని చేయాల్సి వచ్చింది.
అతని చెస్ కెరీర్‌లో, రేషెవ్‌స్కీ 12 మంది ప్రపంచ ఛాంపియన్‌లలో 11 మందితో పోటీపడ్డాడు. చదరంగ మేటి గ్యారీ కాస్పరోవ్‌ను మినహాయిస్తే అతను పలువురు ఉత్తమ ప్లేయర్లతో ఆడాడు. తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గారీ కాస్పరోవ్ ను  కలుసుకున్న సందర్భాలున్నాయి కానీ అతనితో ఎప్పుడూ ఆడలేదు.  
రేషెవ్‌స్కీ తన కెరీర్లో ఏడుగురు ప్రపంచ ఛాంపియన్‌లను ఓడించాడు. వారిలో లాస్కర్, జోస్ రౌల్ కాపాబ్లాంకా, అలెగ్జాండర్ అలెఖైన్, మాక్స్ యూవే, మిఖాయిల్ బోట్విన్నిక్, వాసిలీ స్మిస్లోవ్, బాబీ ఫిషర్ ఉన్నారు.
రేషెవ్‌స్కీ పోలాండ్‌లోని లాడ్‌జు సమీపంలో గల ఓజోర్కోవ్‌లో ఒక యూదు కుటుంబంలో 1911 నవంబర్ 26న జన్మించారు. ఆయన నాలుగు సంవత్సరాల వయస్సులో చదరంగం ఆడటం నేర్చుకున్నారు. అనతికాలంలోనే ఈ క్రీడలో ప్రశంసలు అందుకున్నారు. 
నవంబర్ 1920లో, ఆయన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభ నలుగురికీ తెలియాలని అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అమెరికా అంతటా ఎగ్జిబిషన్‌ మ్యాచ్ లలో రెషెవ్‌స్కీ ఆడారు. ఆయన 1922 న్యూయార్క్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆడారు. ఈ క్రమంలో అతి పిన్న వయస్కుడైన  ఆటగాడిగా చరిత్ర పుటలకెక్కారు. ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, చికాగోలోని సియర్స్, రోబక్ సంస్థ సంపన్న యజమాని జూలియస్ రోసెన్‌వాల్డ్ అన్ని విధాల తోడ్పడ్డారు. 1934లో చికాగో విశ్వవిద్యాలయం నుండి అకౌంటింగ్‌లో పట్టభద్రులైన ఈయన అకౌంటెంటుగా పని చేడానికి న్యూయార్కు నగరానికి వెళ్ళారు. జీవితాంతం ఆయన అక్కడే నివసించారు. ఆయన భార్య, నార్మా మిండిక్. వీరికి ముగ్గురు పిల్లలు. యూదుల ప్రధాన పండుగలప్పుడు ఆడేవారు కాదు.
రేషెవ్‌స్కీ 1992 ఏప్రిల్ 4న న్యూయార్క్‌లో గుండెపోటుతో మరణించారు.
రెషెవ్‌స్కీ శక్తిమంతుడైన ఆటగాడు.
అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేవారు. ఆయన తరచుగా ఓపెనింగ్‌లో ఎక్కువ సమయాన్ని తీసుకునేవారు. ఇది కొన్నిసార్లు ప్రత్యర్థులను కలవరపెట్టేది, నల్లపావులతో ఆడటానికి ఎక్కువ ఇష్టపడేవారు.
రేషెవ్‌స్కీ పుస్తకాలలో రేషెవ్‌స్కీ ఆన్ చదరంగం (1948), హౌ చెస్ గేమ్స్ ఆర్ వాన్ (1962), గ్రేట్ చెస్ అప్‌సెట్స్ (1976), ది ఆర్ట్ ఆఫ్ పొజిషనల్ ప్లే (1978), అలాగే 1972 ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో అతని గొప్ప ఆటల కథనం ఉన్నాయి. అమెరికన్ చెస్ బులెటిన్, చెస్ లైఫ్, చెస్ రివ్యూ మ్యాగజైన్‌లకు తరచూ చదరంగంపై వ్యాసాలు కూడా రాస్తుండేవారు.

కామెంట్‌లు