న్యాయాలు -579
నిషాద స్థపతి న్యాయము
*****
నిషాద అనగా ఒక స్వరము( ఏనుగు ఘీంకారము)బోయవాడు.స్థపతి అనగా శిల్పి అని అర్థము.
సామాన్య భావంలో నిషాదుడు రాజు అనీ, అతడి యొక్క సంస్కారమే అతన్నొక మానవీయ శిల్పంగా మార్చాయని అర్థము.మరి అలాంటి నిషాదుడైన రాజు ఎవరు? అనగానే మనకు వెంటనే రామాయణంలో గుహుడు గుర్తుకు వస్తాడు.
మరి గుహుడి గురించి వివరాలు విశేషాలు తెలుసుకుందామా...
రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు .అంటే బోయరాజు. అతడు శృంగభేరి పురానికి పాలకుడు. ఇతని యొక్క ప్రస్తావన అయోధ్య కాండలో ఉంది.50వ సర్గలో గుహుడి గురించిన శ్లోకాలు ఉన్నాయి.అందులో ఇది ఒకటి.
తత్ర రాజా గుహో నామ రామ స్యా. త్మ సమః సఖా! నిషాద జాత్యో బలవాన్ స్థపతి శ్చేతి విశ్రుతః!!"
వృత్తి రీత్యా వేటగాడు అయిన గుహుడు సరయు నది పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు.అధికారం, పరపతి,ప్రతిష్ట కలవాడైన గుహుడికి రాముడంటే ఎనలేని గౌరవం.అరణ్యవాసానికి వెళ్తున్న సీతారామలక్ష్మణులు తమ రాజ్యంలోకి అడుగు పెట్టారని తెలియగానే ఎంతో ఆనందపడతాడు. రాముడు సీతా లక్ష్మణులతో వనవాసానికి బయలుదేరినప్పుడు కోసల దేశపు సరిహద్దులు దాటి గంగానది తీరాన్ని చేరుకుంటారు.అక్కడ లక్ష్మణుడికి గుహుడిని తన మిత్రుడుగా,నిషాద రాజ్యానికి రాజుగా పరిచయం చేస్తాడు.
గుహుడు పరుగు పరుగున వచ్చి రాముని గట్టిగా ఆలింగనం చేసుకుని "రామా!ఇది కూడా నీ రాజ్యమే.నీ అయోధ్య అనుకో. నీకోసం రకరకాల పదార్ధాలతో ఆహారం తీసుకుని వచ్చాను స్వీకరించు"అంటే చిరునవ్వుతో తాను తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తినకూడదని చెప్పి జటల కోసం మర్రిపాలు తెప్పించుకుంటాడు. ఆ విధంగా సీతారామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తాడు.పడవలో గంగానదిని దాటిస్తాడు.రాముడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన భరతుడికీ ఆతిధ్యం ఇస్తాడు.అతన్ని సైన్యంతో సహా వివిధ పడవల్లో గంగానదిని దాటిస్తాడు.
ఈ విధంగా రామాయణంలో గుహుడి పాత్ర గురించి అయోధ్య కాండలోనే కాకుండా రావణ వధ అనంతరం యుద్ధ కాండ చివర్లో 128 వ సర్గలో కూడా కనిపిస్తుంది.తన క్షేమ సమాచారాన్ని గుహునికి తెలుపమని శ్రీరాముడు హనుమంతుడికి చెబుతాడు.అందుకే తాను అయోధ్య తిరిగి వెళ్తున్నప్పుడు భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమంతునితో తన యొక్క క్షేమ సమాచారాన్ని చెప్పించాడు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే గుహుడు ఆటవికుడు, నిషాదుడే కావచ్చు.అయితే గుహుడిలో మంచి హృదయం వుంది.విలువలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఆతిథ్యం ఎలా చేయాలో తెలుసు.ఉపకారం చేసే ఉత్తమమైన మనస్తత్వం వుంది. అతడు శ్రీరాముడికి ఎంతో ఆర్థ్రతతో,భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇస్తాడు.శ్రీరామునికి తనవంతు ఉపకారం ఎలా చేయాలా అని తపిస్తూ చేస్తాడు.అందుకే గుహుడు నిషాదుడైనా, రాముడు అయోధ్యకు రాజైనా వారిద్దరి అనుబంధం గొప్పది. అందుకే రాముడు తన జీవితంలో గుహుని ఆతిథ్యాన్ని మరువలేదు.
"నిషాద స్థపతి న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే కులాలు, తెగలు, జాతులు అనేవి ముఖ్యం కాదు.వాటన్నింటికీ అతీతంగా మనిషిగా ఉండాల్సిన లక్షణాలు. గుహుడు ఆటవికుడు అయినా అతనిలో మానవీయ విలువలు, లక్షణాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.అతన్నొక మనీషిగా తీర్చిదిద్దాయి. మరిచిపోని సజీవ శిల్పంగా మనముందు నిలిపాయి.వాటిని తెలుసుకొని, ఆచరిస్తే సజ్జనుల స్నేహానికి, ప్రేమకు, అభిమానానికి, ఆత్మీయతకు పాత్రులం అవుతాం.మానవీయ శిల్పాలుగా సమాజంలో చిరకాలం నిలుస్తాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి