సుప్రభాత కవిత ; - బృంద
తనువంత పులకలుగ
కనులింత చేసుకుని
మనసులో నిలిపిన రూపు
కదిలి వచ్చు సమయాన....

కరుణ నిండిన చూపు
తనపై పడగానే పరవశాన
తలయూచి ..నయనాలు
నీట నిండి మసకబారి....

మంగళకరమైన  రూపు
మనసంత నిండేలా
మరిమరీ చూచు ఆశ
తరుముతూ వుండగా...

నిలిచి చూచెను అవని
నిండార ప్రభుని రాక!
పండుగలా వెలుగులు
పంచేటి దొర కనుక!

నీలి గగనపు దారిని
పాల మబ్బుల మాటున...
ఏడు గుఱ్ఱముల తేరు
పరుగు తీసెనదిగో....

పలకరించగ పుడమిని
కిరణాల చేయి చాచి
తలను నిమిరి తండ్రివోలె
నేనున్నా నీకనుచు రక్షగా!

నీమముగ కదిలివచ్చి
సేమముగ ఇలను కాచు
ప్రేమ మిత్రుడు చూపగా
నోమేది చేసెనో ప్రకృతికాంత!!

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు