సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -599
పుష్ట లగుడ న్యాయము
*****
పుష్ట లేదా పుష్టి అనగా  పోషణము, పోషింపబడినది, సమృద్ధి,బలియుట,సంపద.లగుడ అనగా కట్టె లేదా దండము అనే అర్థాలు ఉన్నాయి.
'అరుస్తూ కరవడానికి వచ్చిన కుక్కలలో  మొదటి దానిని బలమైన కఱ్ఱతో  కొట్టి, మిగిలిన కుక్కలను కూడా అదే కఱ్ఱ సాయంతో వెంటబడి తరిమి వేసినట్లు " అని సామాన్య అర్థము.
 ఇక్కడ కుక్క పదాన్ని ప్రస్తావించకన్నా పల్లెల్లో  కుక్కలను అదిలించడానికి, మీదికి వస్తుంటే పారిపోయేలా  బెదిరించడానికి కఱ్ఱను ఉపయోగిస్తారు.అందుకే "పుష్ట లగుడ న్యాయమనేది" వాడుకలోకి వచ్చింది.
 దీనికి తెలుగులో సమానమైన సామెత "కరిచే కుక్కకు కఱ్ఱ అడ్డం". దీనితో పాటు కుక్కకు సంబంధించి"కుక్క కాటుకు చెప్పు దెబ్బ " , "మొరిగే కుక్క కరవదు- కరిచే కుక్క మొరగదు" అనే సామెతలు కూడా ఉన్నాయి.
 పుష్ట లగుడ  ఉపయోగాల గురించి చెప్పుకునే ముందు దానికి సంబంధించిన ఓ సామెతను కూడా చెప్పుకుందాం. అదే "దండం దశ గుణం భవేత్" అంటే దండం - కర్ర; దశ గుణం - పది గుణాలను; భవేత్ - కలిగిస్తుంది". అంటే కఱ్ఱ పది రకాలుగా ఉపయోగపడుతుంది అని అర్థము.మరి పూర్తి శ్లోకాన్ని చూద్దామా.
 "విశ్వామిత్రాహి పశుషు కర్థమేషు జలేషు చ!/అంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్!!"
అనగా వి అంటే పక్షి- పక్షుల్ని,శ్వ అంటే కుక్క- కుక్కలను,అమిత్ర అంటే శత్రువు- శత్రువులను,అహి అంటే పాము- పాములను,పశుషు అంటే పశువులను కట్టడి చెయ్యడంలోనూ, కర్థమేషు అనగా బురదలోనూ,జెలేషుచ అనగా నీటిలోనూ,అంధ్వే అనగా గుడ్డితనంలోనూ,తమసి అనగా చీకటిలోనూ,వార్థక్యే అనగా ముసలితనములోనూ దండం - కఱ్ఱ దశ గుణం భవేత్ -ఈ పది విధాలుగా పనికి వస్తుంది.అంటే ఒక మంచి బలమైన కఱ్ఱను చేతితో పట్టుకుంటే చాలు.
ఈ  కఱ్ఱతో  వడియాలు, పప్పులు మొదలైనవి ఎండబెట్టినప్పుడు వాటి మీద వాలకుండా పక్షులను అదిలించవచ్చు. కుక్కలను తరిమేయవచ్చు. శత్రువులను భయపెట్టవచ్చు.పాములను, పశువులను కొట్టవచ్చు. బురదలోంచి  నీటిలోంచి కఱ్ఱ సాయంతో  సురక్షితంగా బయట పడవచ్చు.
ఇలా కఱ్ఱ చేసే సాయం, కఱ్ఱ వల్ల ఉపయోగం అంతా ఇంతా కాదని మనకు తెలిసిపోయింది కదా!
సామాన్యమైన అర్థంతో, సహజ దృష్టితో చూసినప్పుడు" పుష్ట లగుడ న్యాయము"ను ఈ విధంగా చెప్పుకోవచ్చు.కానీ  మన పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు ఈ న్యాయమును మరో కోణంలో చూడమని చెబుతుంటారు.బలమైన కఱ్ఱ అంటే ఇక్కడ తిరుగులేని ధర్మము అన్నమాట.
 ఎటువైపు నుంచి వేలెత్తి చూపడానికి వీలులేకుండా ధర్మం పక్షాన మనం, మనకు తోడుగా ధర్మం అనే దండం వుంటే అదే మనల్ని రక్షిస్తుంది అని అంటారు.
 పది రకాల అవసరాలకు ఆ కఱ్ఱను,పదిమందికి ఆదర్శంగా నిలిచేందుకు ధర్మం అనే దండాన్ని ఉపయోగిద్దాం.
అప్పుడే మనలోని సమయస్ఫూర్తిని, ధర్మం తప్ఫని ఆదర్శవంతమైన జీవితాన్ని చూసి కొందరైనా మన బాటలో నడవడానికి ఇష్టపడుతూ మనల్ని అనుకరించడమో లేదా అనుసరించడమో చేస్తారు.
కుక్కని అదిలించే ఒక కఱ్ఱ వెనుక ఇంత కథ ఉందని మనం ఈ న్యాయమును ఇలా లోతుగా అధ్యయనం చేస్తేనే తెలిసింది కదండీ!

కామెంట్‌లు