ఒకనికి పెట్టని బతుకూ ఒక బతుకేనా ;-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకసారి ఒకూరిలో పెద్ద కరువు వచ్చింది. ఒక్క వాన గూడా రాలేదు. దాంతో పశువులకు గడ్డి లేదు. జనాలకు తిండి లేదు. పక్షులకు గింజలు లేవు. అందరూ ఆకలికి తట్టుకోలేక అల్లాడి పోసాగినారు. నెమ్మదిగా ఒకొక్కరే చచ్చి పోసాగినారు. ఆ వూరిలో ఒక జమీందారు వున్నాడు. వాని దగ్గర లెక్క లేనంత డబ్బుంది. దానికి తోడు సంచుల సంచుల గింజలు వున్నాయి. కానీ వాడు పెద్ద పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించని రకం. పొట్ట చేత బట్టుకోని కళ్ళనీళ్ళతో బంధువులొచ్చినా సరే 'నా దగ్గర ఏముంది. ఏమీలేదు' అని తిరిగి వుత్త చేతులతో పంపించేటోడు. తన దగ్గర వున్నవి ఎవరికీ తెలియకుండా బాగా చీకటి పన్నాక, వూరంతా పండుకున్నాక వంట చేసుకోని తినేటోడు.
ఆ వూరిలో ఒక పక్షి వుంది. దానికి రెండు చిన్న చిన్న పిల్లలు వున్నాయి. ఆ పక్షి వాటికి గింజల కోసం వూరంతా కిందా మీదా పడి వెదికింది. కానీ ఒక్క గింజా దొరకలేదు. దాంతో తిండి లేక ఆ చిన్నపిల్లలు దాని కళ్ళ ముందే చచ్చిపోయినాయి. పాపం... ఆ పక్షి చానా బాధపడింది. ''అయ్యో... దేవుడా... ఎంత కానికాలం వచ్చింది. కళ్ళ ముందు పిల్లలూ, పశువులూ, మనుషులూ రాలిపోతా వున్నారు. ఎక్కడయినా ఎవరి దగ్గరయినా ఏమయినా వున్నాయేమో చూద్దాం'' అంటా ఇల్లిల్లూ వెదకసాగింది.
అలా వెదుకుతా వెదుకుతా పోతా వుంటే అందరూ పండుకున్నాక ఈ జమీందారు ఇంటి పొగగొట్టంలోంచి పొగ బైటికి రావడం గమనించింది. కిటికీలోంచి లోపలికి దూరి గదీ గదీ వెదికింది. ఇంకేముంది సంచుల సంచుల గింజలు కనబడినాయి. ''అమ్మ దొంగల్లారా... ఎవరికీ తెలియగూడదని చీకటి పడినాక వండుకుంటున్నారా'' అనుకోనింది. 
లోపల పొయ్యి దగ్గర కూచోని జమీందారు పెళ్ళాం బియ్యం కడుగుతా వుంది. వెంటనే అది పైనుంచి
''చూశాలే చూశాలే పైనుంచి
దాగదులే దాగదులే నిజమింక
ఎంత వుండీ ఏం లాభం
దొంగబతుకు మీదంట
సిగ్గులేని ఈ బతుకు కన్నా
చావడమే మీకు నయమంట'' అంటా పాట పాడింది. ఆ పాట విని ఆమె అదిరిపడింది. వురుక్కుంటా పోయి మొగునికి చెప్పింది. ఇద్దరూ కలసి ఇళ్ళంతా కిందికీ, మీదికీ వెదికినారు. ఎక్కడా ఎవ్వరూ కనబళ్ళేదు.
''సరే.... తొందరగా అన్నం ఎక్కించు. ఆకలైతా వుంది'' అంటే ఆమె సరేనని అన్నం పప్పు చేసింది. మొగునికి పళ్ళెంలో వేడి వేడి అన్నం వడ్డించింది. కలిపి నోటిలో ముద్ద పెట్టుకుంటా వుంటే పైనుంచి
కరువురోజుల్లోనన్నా
కనికరం చూపించు
కాసిని గంజినీళ్ళన్నా
కరుణతో విదిలించు
నీవు చేసిన సేవ
చిరకాలం వుంటుంది
భూమిపై నీ పేరు
కలకాలం వుంటుంది'' అంటా మళ్ళీ పాట వినబడింది.
జమీందారు ఎక్కడ నుంచి వినబడుతుందబ్బా ఈ పాట అని వెదుకుతే పైన పక్షి కనబడింది. కోపంగా రాయి తీసుకోని దాని మీదకు విసరబోతోంటే ''ఆగాగు... ఎందుకలా తొందరపడతావు. నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోయినా రేపయినా విషయం వూరంతా తెలిసిపోతాది. ఆకలితో వున్న జనాలు తప్పు ఒప్పు అని చూడరు. మీ ఇంటిమీద పడి అన్నీ ఎత్తుకోని పోతారు. దానికన్నా ముందే నీవే వాళ్ళకి అన్నం పెడితే కనీసం మంచి పేరన్నా కలకాలం నిలబడుతుంది'' అనింది.
దానికి జమీందారు వంకరగా నవ్వుతా ''ఈ విషయం బైట ఎవరికీ ఎప్పటికీ తెలీదు. నిన్ను కూడా ఇక్కడే ఇప్పుడే చంపి పాతిపెడతా'' అన్నాడు.
దానికి ఆ పక్షి చిరునవ్వు నవ్వుతా ''నువ్వు నన్ను చంపినా చంపకపోయినా ఈరోజో రేపో ఎలాగూ ఆకలితో చచ్చిపోతాను. కానీ ఈ ఊరిలో నీతో పాటు కలసి బతుకుతా వున్న సాటి మనుషులు, పశువులూ, పక్షులూ కళ్ళముందే తినడానికి తిండి లేక చచ్చిపోతా వుంటే ఇలా ఒక్కనివే తినడానికి సిగ్గుగా అనిపించడం లేదా... మనిషి పుట్టుక పుట్టినాక కొంచమన్నా జాలీ, దయా లేకుంటే ఎలా.... ఏం పోయేటప్పుడు ఒక్క పైసన్నా మూట గట్టుకుపోతావా... ఆకలితో వున్న వాళ్ళని ఆదుకుంటే ఆ శిబి, దధీచిలాంటి మహాపురుషుల మాదిరి నీ గురించి గూడా ఎంత గొప్పగా చెప్పుకుంటారు రేప్పొద్దున'' అనింది.
దానికి ఆ జమీందారు ''నీకేం ఎన్నయినా చెబుతావు. మరి నువ్వు గూడా జనం కోసం ఆ దధీచి లెక్క మంటల్లో దుంకమంటే దుంకుతావా... చూద్దాం'' అన్నాడు ఎగతాళిగా.
దానికా చిన్న పక్షి ''నువ్వు నిజంగా మాట మీద నిలబడతానంటే చెప్పు. ఇదిగో ఇప్పుడే ఇక్కడే పదిమంది కోసం చావడానికి నేనెప్పుడూ సిద్ధమే'' అంటా వాళ్ళ కళ్ళ ముందే సర్రున పోయి వంట వండిన పొయ్యిలో దుంకింది. అంతే... నిమిషాల్లో దాని వళ్ళంతా కాలిపోయి కళ్ళ ముందే గిలగిలలాడుతా చచ్చిపోయింది.
అది చూసి మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ చలించిపోయినారు. కరిగి నీరయిపోయినారు. ''ఛ... ఛ... ఛ... ఆ పక్షికి వున్న తెలివి కూడా మనకు లేకపాయెనే. ఇంక ఈ వూరిలో మనమున్నంత వరకూ ఏ జీవి గూడా చచ్చిపోగూడదు. ఇదే ఆఖరు'' అనుకున్నారు. అంతే.... తరువాత రోజు నుంచి వూరందరినీ ఒకచోట గుంపు చేసి కరువు పోయి వానలు పడేదాకా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టినారు.
***********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం