మనసు మమతలు మృగ్యమై
మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలదే అగ్రపీఠమై
డబ్బుతో ఏదైనా కొనవచ్చు అన్న
అహంభావంతో విర్రవీగే నేటితరం
తల్లిదండ్రులు సంపాదించిన స్థిరాస్తుల మీద
వారసత్వ సంపద మీద పడి
కష్టంతెలియకుండా తినమరిగి
శ్రమజీవనానికి దూరం దూరంగుండే ఈ బద్ధకస్తులకు
మనస్సెక్కడుంటుంది
మమతెక్కడుంటుంది
అంతా మనీ యావతప్పా
ఉమ్మడి కుటుంబబంధాల్నీ
విచ్ఛిన్నం చేసి
నేను నా భర్త
నా పిల్లలు
అనే వ్యక్తి స్వార్థం
పెరిగినప్పుడు ఏడుంది?
మనసు మమత
నిరాదరణకు గురౌతున్న
వయోవృద్ధులు
తమసుఖం తాము చూసుకొని
తల్లిదండ్రుల పట్ల కనీసం నెనరులేకుండా వదిలివెళ్ళిన
నిర్దయలైన పుత్రరత్నాలు
వీరికి రాదా!
రేపు వార్థక్యం
అనునిత్యం పెరుగుతున్నాయి
వృద్ధాశ్రమాలు
ఇవి కాదా కఠోర వాస్తవాలు
మనుషులు సృష్టించిన డబ్బే
మంచి మమతను చంపేస్తుందని
డబ్బుకై ఏ గడ్డైనా కరుస్తారని
ఇంతకన్నా ఏం చూపగలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి