ఆచార్యదేవోభవ....;- ఉండ్రాళ్ళ రాజేశం సిద్దిపేట 9966946084
 ఒక్కసారిగా ఉన్నది ఉన్నట్లుగా కూలబడిపోయిండు రాఘవయ్య మాస్టర్. ఇంట్లో వాళ్ళు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఇరుగుపొరుగులు, చుట్టాలందరూ వచ్చి రాఘవయ్య మాస్టారును చూసి వెళ్తూ అమ్మా! జానకమ్మా! మాస్టారు ఉద్యోగం చేసినన్నాళ్లు ఆఊరు, ఈఊరు తిరిగి చదువులు చెప్పే, ఎందరినో ప్రయోజకులను చేసే, మీకు కూసోనికి ఇల్లు మాత్రమే ఉండే ఆస్తిపాస్తులు ఏమీ లేపాయే నీబిడ్డలకు కష్టమొచ్చే అంటూ వెళ్ళసాగిండ్రు. మరికొందరేమో రాఘవయ్య మాస్టారు మంచోడు ఊర్లో పోరగాండ్లనందరిని వాయిలి బర్గెలతో దంచో లేదా కోదండమేసో భయపెట్టి చదువు చెప్పిండు. ఇప్పుడు వాళ్లంతా పెద్ద పెద్ద కొలువులలో ఉండిరి. మాస్టర్ బిడ్డలకు మాత్రం పాపం చదువు అబ్బలేదు అనిరి.
             మాస్టారు అనారోగ్యంతో ఉన్నా తన చూపంత క్యాలండర్ వైపే ఉండసాగింది. ఇన్నాళ్లు చదువు చెప్పి సంపాదించింది ఏముంది. ఎప్పుడు ఎవరెవరో పోరగాండ్ల గురించి ఆలోచించావు కానీ నీ బిడ్డల గురించి ఎప్పుడైనా ఆలోచించావా. ఇప్పుదేమో కాలండర్ వంక చూస్తున్నావు అంటూ రుసరుసలాడుతూ జానకమ్మ మాస్టర్ కు జావా తాగిపించసాగింది. జావ తాగి మాస్టర్ పడుకున్నాడు. 
            తెల్లవారగానే మాస్టర్ తెల్లని ధోతి, అంగీతో ముస్తాబై అరుగుపై కుర్చీలో కూర్చున్నాడు. జానకమ్మకు ఎంత కోపం వచ్చినా దిగమింగుకొని, మాస్టర్ మోములో సంతోషం చూసి చాయకప్పు అందించింది. కాసేపట్లోనే ఊరంతా వాహనాల మోత వినబడగానే జనమంతా బయటకు వచ్చి ఆశ్చర్యపోయారు. ఎక్కడెక్కడి నుంచో పెద్దపెద్ద ఆఫీసర్లు, ఇరుగుపొరుగు గ్రామాల యువకులంతా వచ్చి, మామాస్టర్ బాగున్నాడా, సుస్తి చేసిందంటా అంటూ రాఘవయ్య మాస్టర్ ఇంటికి పరుగు తీశారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మాస్టర్ ఆచార్య దేవోభవ అంటూ తలవంచి పువ్వొ, ఫలమో అందచేస్తూ తమ చిన్ననాటి గుర్తులు మాస్టారు చేతి దెబ్బలు గుర్తు చేయసాగారు. బడిలో చిన్నపిల్లలుగా ఉన్నట్లు భావించి వారితో ఎగురుతూ, దుంకుతూ మాస్టర్ ఆనందించసాగాడు. రాఘవయ్య మాస్టర్ ని చూసిన జనమంతా ప్రపంచంలో గొప్పవారు ఎవరంటే చదువు చెప్పి, జీవితాలను మార్చిన మాస్టర్లు. వారు ఎల్లప్పుడూ జనం గుండెల్లో మాస్టార్ లే అంటూ నమస్కరించి వెళ్లిపోయారు.

కామెంట్‌లు