చిత్తవృత్తులు;- సి.హెచ్.ప్రతాప్
 యోగః శ్చిత్త వృత్తి నిరోధః” అన్నారు పతంజలి మహర్షి. దివ్యచక్షువు ఉత్తేజితానికి ముందు చిత్తవృత్తుల నిరోధం అవసరం. చిత్తవృత్తి నిరోధం అయిన వెంటనే కుండలినీ మేలుకొనడం మొదలవుతుంది. “చిత్తవృత్తి నిరోధం” అంటే మనస్సునూ, బుద్ధినీ శూన్యం చేసుకోవడం.మనస్సులో వున్న పనికిరాని ఆలోచనా పరంపరల గందరగోళం నుంచీ రణగొణ ధ్వనుల నుంచీ ప్రశాంతమైన స్థితికి చిత్తాన్ని మళ్ళించడమే చిత్తవృత్తి నిరోధం. మానవులకు చిత్తవృత్తి నిరోధము అసాధ్యమని భావించి అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణు నిట్లు ప్రశ్నించచాడు.
శ్లో|| చంచలంహి మనః కృష్ణ! ప్రమాధి బలవ ద్దృఢమ్‌
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌ గీత (6-34)
మనస్సు చంచలము, కలత పెట్టునది, బలవంతము, స్వాధీన మునకు రానిది, దానిని వశము చేసికొనుట గాలిని మూటగట్టుటవలె కష్టసాధ్యము. ఈ ప్రశ్నకు అభ్యాస వైరాగ్యములచేత మనస్సును నిగ్రహింప వచ్చు'' నని శ్రీకృష్ణుడు సమాధానము తెలిపాడు.
శ్లో|| అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేనతు కౌంతేయ! వైరాగ్యేణచ గృహ్యతే
(భగవద్గీత 6-35)
మనస్సును నిగ్రహించుట కష్టము. అది చంచలము. అయినను దానిని వైరాగ్యముచేతను అభ్యాసముచేతను నిగ్రహింపవచ్చును. చిత్తవృత్తులు నిరోధించి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే యోగం. దానికి అష్టాంగ యోగం ఆధారం. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి ఇందులోని అంశాలు. అది ఆహార విహార నియమాలతో, ఇంద్రియ నిగ్రహాలతో సాగించాల్సిన సాధన.వీరోచిత కార్యం, తొణికిసలాడే జీవకళ, ఆశావహ దృక్పథం, ఆరోగ్యలక్షణాలు, సద్గుణ ప్రకాశం ఇవన్నీ శక్తికి సంకేతాలు. అందుకే ఎంతకాలం శరీరం నిలిచి ఉంటుందో అంతకాలం దేహం, మనసు దృఢంగా ఉండాలి” అంటారు స్వామి వివేకానంద. అలాంటి శరీరం, మనసు యోగసాధన వల్ల సుసాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. 

కామెంట్‌లు