(హాస్య వ్యంగ్య వచన కవిత )
=====================
గణపతి నవరాత్రుల
ఉత్సవాల పేరిట....
భాద్రపద శుద్ధ చవితి నాడు
మండపాలు నిర్మించి.....
నీ మూర్తిని అందులో ఉంచి ఆర్చిస్తున్నారు..
ఆరాధిస్తున్నారు
నవరాత్రుల పేరిట
తొమ్మిది రోజులు నిన్ను
వైభవంగా పూజిస్తున్నారు.
తొలి పూజల తొలి వేల్పువని
ఉండ్రాళ్ళు,భక్షాలు
కుడుములు సమర్పిస్తే
ఇడుములు తీరుస్తావని
రకరకాల నిత్య నైవేద్యాలు
నీకు సమర్పిస్తున్నారు.
ఆటపాటలతో అలరించి
ఆనందం పొందుతున్నారు.
సకల సంపదల
సమకూరుస్తావని
సకల ఐశ్వర్యాన్ని
ప్రసాదిస్తావని
అజ్ఞానాన్ని తొలగించి
విజ్ఞానాన్ని
నోసుగుతావని
నిత్యం నీ ఆరాధనలో....
తరిస్తున్నారు, వరిస్తున్నారు
ఓ చిన్న చిక్కు వచ్చి పడింది
అది తీరుస్తావో ?
ప్రజలను మారుస్తావో ?
వినాయకా నీదే నిర్ణయం !!
తొమ్మిది రోజులు
ఆరాధన నందిన
నీ శేష వస్త్రాలను
వేలం వేస్తున్నారు.
కండువలు, పంచలు
కలుశాన్ని కూడా
వేలం వేస్తున్నారు.
ఇక పెద్ద లడ్డు అంటావా..
చెప్పవలసిందే కాదు..
లక్షల్లో పలుకుతుంది వేలం
మానవుడు.....
ఎంత తెలివైనవాడో...!
నీకు తెలియడం లేదు.
వినాయక ఉత్సవాల పేరిట
నిన్ను నమ్ముకుంటున్నారు
నిన్ను అమ్ముకుంటున్నారు
చివరి రోజున నిమజ్జనం పేరిట
నిన్ను నీళ్లలో తోస్తున్నారు.
చెరువులో.... బావుళ్లల్లో
.......ముంచుతున్నాడు
నీవు ఇట్లాగే వెర్రి పప్పా వైతే !
తెలివైన మానవుడు
మున్ముందు నీ విగ్రహాన్ని
కూడా వేలం వేస్తాడు.
తస్మాత్ జాగ్రత్త వినాయకా !
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
" సాహితీ శిరోమణి "
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి