సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు -626
భల్లూక కంబళ భ్రాంతి న్యాయము
******
భల్లూకము అనగా ఎలుగు బంటి/ ఎలుగు బంటు,ఎలుగ్గొడ్డు.కంబళ అనగా కంబళి, గొంగళి / గొంగడి, ఉత్తరీయము.భ్రాంతి అనగా తిరుగుట, భ్రమ,లేనిది ఉన్నట్లు తలంచుట అనే అర్థాలు ఉన్నాయి.
 ఎక్కడో అల్లంత దూరంలో ఉన్న ఎలుగుబంటిని చూసి  ఎవరో నల్లగొంగడి  అక్కడ పడేశారే అనుకున్నట్లు.
అనగా అది వెలుతురు ఇంకా విచ్చుకోని వేకువ జాము కావచ్చు.పూర్తిగా సూర్యాస్తమయం కాని సందె పొద్దు కావచ్చు. అస్పష్టమైన కాంతిలో  కొన్నింటిని సరిగా పోల్చుకోలేక వేరేవిగా భావిస్తుంటాం.అలా భావించడాన్నే దృశ్య భ్రాంతి అంటాము.
ఈ భ్రాంతి గురించి చెప్పుకునే ముందు భల్లూకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 భల్లూకము లేదా ఎలుగుబంటి ఒక కౄర మృగం.ఇది ఆర్సిడే జాతికి చెందిన క్షీరదం. ఇవి సామాన్యంగా భారీ శరీరం, బలమైన కాళ్ళు, పొడవైన మూతి,గరుకైన వెంట్రుకలు, పొట్టి తోకను కలిగి ఉంటాయి. వీటి పంజాకు ఐదు పదునైన గోర్లు కలిగి ఉంటాయి.వీటి జాతుల్లో పాండా తప్ప మిగతా అన్ని సర్వభక్షకులు.మొక్కల్ని ఇతర జీవుల్ని తింటాయి.ఇవి ఎక్కువగా ఒంటరిగా జీవిస్తుంటాయి.రాత్రి సమయాల్లో చాలా చురుకుగా తిరుగుతాయి. ఇవి భారీ శరీరం కలిగి వున్నప్పటికి చాలా చురుకుగా పరుగెత్తగలుగుతాయి. అత్యంత తేలికగా చెట్లు ఎక్కగలుగుతాయి. నీటిలో ఈద గలుగుతాయి. ఇవి గుహల్లో లోతుల్లో నివసిస్తాయి.
ఇవి మంచి ఘ్రాణశక్తి కలిగి ఉంటాయి. వీటిలో కొన్ని జాతులకు ముందుచూపు ఎక్కువ.చలికాలం కోసం పండ్లను దాచుకుంటాయి.భల్లూకానికి సంబంధించి ఓ మంచి జాతీయం  ఉంది.అదే 'భల్లూక పట్టు" అటూ ఇటూగా ఉడుం పట్టు లాంటిదే కానీ ఉడుము గోడలను కొండలను పట్టుకుంటే వదలదు కానీ ఈ భల్లూకం పట్టుకునేది మాత్రం తనకు ఆహరమైన శత్రు జంతువులను. దానిపై బడి ఒక్కసారి పట్టుకుంటే అది అరిచి గీ పెట్టినా వదలదు. నిలువుగా లేచి నిలబడి  శత్రు జంతవును గట్టిగా  కౌగలించుకుని చంపడానికి ప్రయత్నిస్తుంది.అలాగే కొందరు ఎవరేం చెప్పినా  ససేమిరా వినరు.పట్టిన పట్టు వదలకుండా అనుకున్నది  చేస్తారు. అదీ భల్లూకం లోని ప్రత్యేకత. పురాణాలలో జాంబవంతుడు భల్లూక  రాజుగా మనందరికీ తెలిసిందే.
ఇక విషయానికి వద్దాం.  భల్లూకం సాధారణంగా నల్లని  వెంట్రుకలతో నల్లగా కనిపిస్తుంది.అయితే ధృవపు ఎలుగు వెంట్రుకలు తెలుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఏది ఏమైనా అది అల్లంత దూరాన కదలక మెదలకుండా  ఉంటే అక్కడ  గొంగళిని కుప్పగా వేసినట్లుగా భ్రాంతి కలుగుతుంది .
 అలాంటివి దృశ్యం,శ్రవణంతో పాటు అనేక భ్రాంతులు  ఉన్నాయి.ఈ భ్రాంతులు  ఏదో ఒకసారి కలుగుతూనే వుంటాయి. కానీ పదే పదే అలాంటి భ్రాంతులకు గురైతే అదొక మానసిక సమస్యగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ భ్రాంతికి సంబంధించి ప్రజాకవి వేమన  రాసిన పద్యాన్ని చూద్దామా.
"పరుల విత్తమందు భ్రాంతి వాసిన  యట్టి/పురుషుడవనిలోన పుణ్య మూర్తి/ పరుల విత్తమరయ పాఫ సంచితమగు/ విశ్వధాభిరామ వినురవేమ! "
అనగా పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషుల్లో ఉత్తముడు.పరుల సొమ్ము తీసుకున్నా అది పాపంతో సంపాదించినదే అవుతుంది.అలా చేసే వాడికి ముక్తి వుండదు అని అర్థము.
 దీనికి"భల్లూక కంబళ న్యాయము"నకు సంబంధమేమిటి?అనే సందేహం తప్పకుండా కలుగుతుంది.అయితే భల్లూకమే కౄరమైనది.దాని జోలికి పోవద్దు. దాని రంగును చూసి వేరేగా భ్రమించి యిబ్బంది పడవద్దు అని చెబుతున్నారు.అంటే పరుల సొమ్ము  పాము వంటిది, దాని జోలికి పోవద్దు  అనే ఉద్దేశంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
మరి పై విషయాలన్నీ ఎప్పుడూ గమనంలో పెట్టుకొని ఎలాంటి భ్రాంతులఠు మనసు ఆకర్షితం కాకుండా చూసుకోవాలి.అలా ఆకర్షితులమైతే ఆ కాటుకు , వేటుకు బలికాక తప్పదు.

కామెంట్‌లు