భగవాన్ రమణ మహర్షి ; - యామిజాల జగదీశ్
 భగవాన్ రమణ మహర్షి నూట ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం సెప్టెంబర్ ఒకటో తేదీన తొలిసారిగా తిరువణ్ణామలైకి వెళ్ళారు (1.9.1896).
ఇంకా పూర్తిగా ఉదయించని ఆ రోజు ఉదయం రైలు తిరువణ్ణామలై స్టేషన్లో ఆగింది.
ఆ రైలు నుంచి వేగంగా స్టేషన్లో దిగారు.
జ్ఞానతపోధనులైన ఆయనను అక్కడి కొండ చూసీ చూడటంతోనే ఆకర్షించింది. 
అన్నామలైని దర్శించిన క్షణంలో ఆయన వేగంగా అడుగులు వేశారు. 
అన్నామలై ఆలయ రాజగోపురం ఆయన కంట పడింది. మనసుని కట్టి పడేసింది. తాదాత్మ్యం చెందారు.
ఆలయంలోకి వెళ్ళారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఆలయం ఆ క్షణం ఏకాంతంలో ఉంది.
అన్నామలై సన్నిధికేసి అడుగులు వేశారు.
ఆశ్చర్యకరమైన విషయమేమీటంటే ఆ రోజు ఆక్కడి గర్భగుడిలో అర్చకులెవరూ లేరు. ఏకాంతంలో ఆయన తనివితీరా స్వామిని దర్శించుకున్నారు.
"వచ్చేవా తండ్రీ" అని స్వామి అడిగినట్లనిపించింది.
"నాన్నా వచ్చేసాను" అంటూ ఆశ తీరా అరుణాచల లింగాన్ని హత్తుకున్నారు.
అంతకుముందు వరకు శరీరంలో ఓ విధమైన ఉన్న మంట ఆ క్షణంలో మటుమాయమైంది.
కళ్ళల్లో ఉప్పొంగిన కన్నీటితో స్వామిని అభిషేకించారు. తనలో తనను చూసిన భగవాన్ ఆరోజు తనలో స్వామినీ, స్వామిలో తననూ చూసుకున్న అనుభూతి చెందారు. స్వామికి తనను ఆర్పించుకుని అక్కడి నుంచి బయటకు వచ్చారు.
స్వామి కొలనుకేసి అడుగులు వేశారు.
అక్కడ ఒకరు "సామీ, క్షవరం చేయాలా?" అని అడిగారు.
"అది స్వామివారి ఆదేశం!" అని అనుకొని అవునన్నట్టుగా తల ఊపారు. మరుక్షణం తలనీలాలర్పించడమైంది.
పుట్టుకను జయించిన తనకు జంధ్యం దేనికి? అంతే మరుక్షణం జంధ్యాన్ని తీసేసి కొలనులోకి విసిరేశారు.
అన్నీ త్యజించిన వానికి ఆహారం అవసరమా ఏమిటి? అనుకుని చేతిలో ఉన్న సంచీని, మిగిలిన డబ్బునీ కొలనులో పడేశారు. మానాన్ని కాపాడుకోవడానికి ఒక వస్త్రం చాలదా అనుకుని పైన కప్పుకున్న వస్త్రాన్నికూడా కొలనులో విసిరేశారు. ధోవతిని చించారు. ఓ చిన్న వస్త్రాన్ని గోచీ గుడ్డగా ధరించారు. మిగిలిన వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి బయలుదేరారు.
ఇంతలో వర్షం పడింది. అందులో తడిసారు. అన్నామలై ఆలయంలోని వేయి కాళ్ళ మంటంలోకి వెళ్ళారు. ఓ మూల కూర్చున్నారు. తనలో తాను నిమగ్నమయ్యారు. 
వేంకటరామన్ అని తల్లిదండ్రులు పెట్టిన పేరున్న భగవాన్ రమణ మహర్షి బాల రమణులయ్యారు.
అన్నామలైలో తొలిసారిగా అడుగుపెట్టిన రోజది. అవును, అది 1896 సెప్టెంబర్ ఒకటో తేదీ. ఆ తర్వాత ఆయన తిరువణ్ణామలై నుంచి మరెక్కడికీ వెళ్ళలేదు.

కామెంట్‌లు