సుప్రభాత కవిత ; - బృంద
అలజడి తగ్గేవరకూ
అలసట కూడదు
అంధకారమలముకున్నా
అరుణోదయమాగదు

ఉప్పెనలు ముంచుకొస్తే
తప్పెవరిదని  అంటారా?
ముప్పును పక్కకు తోసే మార్గం
తప్పక తెలుసుకోవాలి...

ప్రమాదం అంచున నిలబడి
ప్రయాణం చేయాల్సొస్తే
పరిస్థితులకు తలయొగ్గే
పరిణితి కలిగి వుండాలి

ప్రకృతికి కోపం వస్తే
పట్టడం మన తరమా?
సుకృతులు అలవాటు చేసుకుని
పుడమిని కాపాడుకోవాలి

సాయానికి వెనుదీయక
కష్టానికి కన్నీరు పెట్టక
చాచిన చేతులకు
చేతనైన సహకారం ఇవ్వాలి

కష్టంలోనూ కుదురుగా
కలతలోనూ బెదరక
కఠినమైనా  తప్పక
కలిసి సాగడం ముఖ్యం

ఏ క్షణమూ నిలవదు
ఏ నష్టమూ తెలియదు
ఏ ఆపదా  ఆగదు
ఏ సాయమో అందకా మానదు

ఆటుపోట్ల జీవితంలో
అనుభవాలే అన్నీ....
అందరినీ సమానంగా
ఆదరించేవీ వెలుగులే!

నిస్సహాయతకు చేయూతనిచ్చే
వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు