అంతకుముందున్న స్థితి; యామిజాల జగదీశ్....
 ఆయన ఓ గురువు. ఆయన ఓ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ఆశ్రమాన్ని ప్రారంభించడానికి రైల్లో వెళ్తున్నారు. స్టేషనులో ఆయనకు స్వాగతం పలికి తీసుకుపోవడానికి ఓ నిర్వాహకుడు నిరీక్షించాడు. రైలు ఆగింది. గురువు దిగారు. నిర్వాహకుడు ఎదురెళ్ళి ఆయనను స్వాగతించాడు. స్టేషన్ బయట ఆగి ఉన్న తన కారులో నిర్వాహకుడు గురువుగారిని ఎక్కించాడు. కారు బయలుదేరింది. నిర్వాహకుడు మాటలు మొదలుపెట్టాడు.
“మీరిలా ఇక్కడికి వచ్చి మా ఆశ్రమాన్ని ప్రారంభించబోవడం తలచుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది” అన్నాడు నిర్వాహకుడు.
గురువు ఆ మాటకు జవాబు చెప్పే లోపల ఓ ద్విచక్ర వాహనం వేగంగా అడ్డంగా వచ్చింది. దాంతో నిర్వాహకుడు సడన్ బ్రేక్ వేసి కారును ఆపాడు.
నిర్వాహకుడిలో కోపం. అసహనం.
“బండి నడపడం తెలియని వారందరూ రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు...ఇలాంటి వాళ్ళు బండి నడపకపోతే ఎవరేడ్చారట” నిర్వాహకుడు అన్నాడు.
గురువు ఓ నవ్వు నవ్వారు.
“ఇది మీ సోంత కారా” అడిగారు గురువు.
“అవును స్వామీ, ఎందుకలా అడుగుతున్నారు?” అన్నాడు నిర్వాహకుడు.
“అంతకుమందు మీదగ్గర ఏ వాహనముండే”దని ప్రశ్నించారు గురువు.
నిర్వాహకుడు కాస్త ఆలోచించి “ఓ ద్విచక్రవాహనం ఉండేద”న్నాడు.
గురువు మళ్ళీ ఓ నవ్వు నవ్వారు.
“మనిషి మనసు చాలా విచిత్రమైనది కదండీ” అన్నారు గురువు.
“ఏమంటున్నారు, అర్థం కాలేద”న్నాడు నిర్వాహకుడు.
గురువు ఓ కథ చెప్పడం మొదలుపెట్టారు.
“మా ఊళ్ళో ఓ నల్లోడు ఉండేవాడు. వాడికి ఎర్రగా అందంగా మారిపోవాలని ఆశ ఉండేది. ఎవరెవరినో సంప్రదించాడు. ఎవరో చెప్పింది నచ్చి ఓ క్రీము పూసుకుని తిన్నగా భార్య వద్దకు వచ్చాడు. ఇదిగో నువ్వూ ఈ క్రీము పూసుకో, నువ్వూ తెల్లబడిపోతావు....అన్నాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తనకు నల్లగా ఉండడమే ఇష్టం, ఇలాగే ఉండిపోతానంది ఆమె.
అప్పుడా భర్త ఛీ ఛీ వీళ్ళింతే మారరు...మాట వినరు...తాను చెప్పిన దాంట్లో ఉన్న నిజమేంటో కూడా తెలుసుకోరు....అర్థం చేసుకోరు...అరటి పండు తొక్క వొలిచిచ్చి తినమన్నంత తేలిక మాటలతో చెప్పినా వినిపించుకోరని బాధ పడ్డాడు”
గురువు కథ ముగించి నిర్వాహకుడి వంక నవ్వుతూ చూశారు.
“అదే చెప్తున్నాగా, మనిషి మనసు విచిత్రమైనది. ఓ స్థితి నుంచి మరొక స్థితిలోకి మారేసరికి అప్పటి వరకూ ఉన్న స్థితిని అతి తక్కువగా హీనంగా పనికిరానిదిగా భావిస్తారు. తన పూర్వ స్థితిలో ఉన్న వారందరినీ తీసిపారేస్తారు. కించపరుస్తూ మాట్లాడతారు. ఓ అర గంట క్రితం తాము కూడా అక్కడే ఆ స్థితిలోనే ఉన్నామన్న వాస్తవాన్ని మరచిపోయి ప్రవర్తిస్తారు” అని అంటుంటే నిర్వాహకుడి నోటంట మాటలేదు.


కామెంట్‌లు