ఒకూర్లో ఒక పండితుడున్నాడు. వానికి రాని విద్యంటూ ఏదీ లేదు. వేద వేదాంగాలూ, సకల శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలూ అన్నీ నేర్చేసుకున్నాడు. విద్య ఎక్కువయితే వినయం పెరగాల కదా. కానీ వీనికి మాత్రం పొగరు బాగా పెరిగిపోయింది.
నా అంత మొనగాడు ఈ ముల్లోకాల్లో ఎక్కడా వుండడని విర్రవీగుతా నెలకొక రాజ్యానికి పోయి "మీ రాజ్యంలో ఏ విద్యలోనైనా సరే నాతో పోటీపడే పండితుడుంటే రమ్మనండి. గెలిస్తే నేను గుండు చేపిచ్చుకుంటా, ఓడిపోతే వాళ్ళు గుండు చేపిచ్చుకోవాల" అని పందెం కట్టేటోడు.
మొదట్లో చానామంది పండితులు వానితో పోటీ పడినారు గానీ ఎవరూ గెలవలేదు. నెమ్మదిగా వాని పేరు అన్ని రాజ్యాలకూ పాకిపోయింది. వాన్తో పోటీ అంటే చాలు ఎవరు చూసినా 'మేం రామంటే మేం రాం' అని పారిపోయేటోళ్ళు. దాంతో వానికి ఇంకా పొగరు పెరిగిపోయింది.
అట్లా వాడు ఒక్కొక్క రాజ్యమే పోతా అక్కడి పండితుల్ని ఓడిస్తా ఒకరోజు కందనవోలుకి చేరుకున్నాడు.
దానికి రాజు విక్రమసింహభూపతి. ఆయన చానా పరాక్రమవంతుడు. యుద్ధంలో గెలవడమే తప్ప ఓడడం తెలీనివాడు. చానా మంచోడు కూడా, అడిగినవాడికల్లా లేదనకుండా దానం చేసేటోడు. అటువంటి ఆ మహారాజు ఆస్థానానికి పోయి ఈ పండితుడు సవాల్ చేసినాడు.
అప్పటికే ఆ పండితుని గొప్పతనం గురించి అన్ని రాజ్యాలలోని వాళ్ళకు బాగా తెలిసిపోయింది. దాంతో పోటీ పడడమెందుకు, గుండు కొట్టిచ్చుకోవడమెందుకు అని ఒక్కరు గూడా ముందుకు రాలేదు.
పోటీలో పాల్గొని ఓడిపోయినా పరవాలేదు గానీ అసలు పోటీలోనే పాల్గొనకుండా చేతులెత్తేస్తే ఏం మర్యాద. దాంతో రాజు పోటీపన్నోనికి అడిగినంత ధనమిస్తా అని ప్రకటించినాడు గానీ ఒక్కరు గూడా ముందుకి రాలేదు.
రాజు బాగా ఆలోచించి ఆఖరికి అంతఃపురంలో వంటలు చేసేటోన్ని పిలిపించినాడు. వానికి వుండేది ఒకే ఒక కన్ను. అంతేగాదు అచ్చరం ముక్క గూడా రాదు.
వాన్తో రాజు “రేయ్... రేపు ఆ పండితునితో పోటీకి నిన్ను పంపుతా వున్నా. నువ్వు మట్టసంగా మాట్లాడకుండా కూచో. సైగల్లో పోటీ అని చెప్తా. నీ ఇష్టమొచ్చినట్లు సైగలు చెయ్. నీకేం భయం లేదు" అన్నాడు. వాడు సరేనన్నాడు.
తరువాత రాజు వంటోనికి గొప్ప పండితుని లెక్క వేషం వేపిచ్చి పోటీకి నిలబెట్టినాడు. వాని డాబూ దర్పం చూసి పండితుడు అబ్బో అనుకున్నాడు.
అంతలో రాజు “మా రాజ్యంలో వున్న పండితులందరి కన్నా ఈయనే గొప్పోడు. కానీ ఇప్పుడు మౌనవ్రతంలో వున్నాడు. కాబట్టి సైగలే తప్ప నోరు విప్పి ఒక్కమాటా మాట్లాడడు. నీవు అన్ని విద్యలలోనూ పండితునివి గదా. చేతనయితే సైగల్లో పోటీ చేయి" అన్నాడు.
పండితుడు “దానిదేముంది. సరే" అన్నాడు.
రాజు పండితున్ని మొదలు పెట్టమన్నాడు. పండితుడు వంటోనికెల్లి చూసి చిరునవ్వు నవ్వి చెయ్యెత్తి ఒక వేలు చూపించినాడు. అది చూస్తానే వంటోనికి చానా కోపమొచ్చేసి రెండు వేళ్ళు ఎత్తి చూపించినాడు.
పండితుడు కాసేపాలోచించి ఈసారి మూడువేళ్ళు ఎత్తి చూపించినాడు. వెంటనే వంటోడు పల్లు పటపటపట కొరుకుతా కోపంగా వూగిపోతా పిడికిలి బిగించి పూపినాడు. దానికి ఆ పండితుడు వురుక్కుంటా వచ్చి వాని కాళ్ళు పట్టుకోని “మహానుభావా ఏమో అనుకుంటి గానీ మీ అంత గొప్ప విద్వాంసుడు యాడా వుండదు. నేను ఓడిపోయాను" అని అందరి ముందూ గుండు కొట్టిచ్చుకోని వెళ్ళిపోయినాడు.
ఇదంతా చూసి ఆ రాజుకు ఏమీ అర్ధం కాలేదు. “ఈ వంటోడేంది, ఆ పండితున్ని ఓడించడమేంది" అనుకుంటా పండితున్ని పక్కకు పిల్చుకోని పోయి 'మహానుభావా! మీరిద్దరు ఏమి సైగలు చేసుకున్నారో, దానికర్థం ఏమిటో నాకు ఒక్క ముక్కా అర్ధం కాలేదు. దయచేసి కొంచం వివరించి చెప్పండి" అన్నాడు.
అప్పుడా పండితుడు "ఏం లేదు మహారాజా! ఈ లోకాన్ని పరిపాలించే దేముడొక్కడే గదా... అందుకే నేను మొదట ఒక వేలు ఎత్తి చూపించినాను. కానీ వాడు దాన్ని ఒప్పుకోకుండా శివకేశవులు ఇద్దరు గదా అని రెండు వేళ్ళు చూపించినాడు.
దానికి సమాధానంగా నేను అట్లాగయితే బ్రహ్మను కూడా కలుపుకోని సృష్టిస్థితిలయకారులైన త్రిమూర్తులకు గుర్తుగా మూడు వేళ్ళు చూపించినాను. కానీ వెంటనే అతను దేవుల్లెంతమంది వున్నా అందరూ కలిసే ఈ ప్రపంచాన్ని నడిపిస్తారు అని పిడికిలి బిగించి చూపించినాడు.
దాంతో ఇంగ ఏమి సమాధానం చెప్పాల్నో అర్ధంగాక నేను ఓటమి ఒప్పుకున్నాను. నిజంగా అంత గొప్ప పండితున్ని నేనింతవరకూ చూల్లేదు" అని వివరించి చెప్పినాడు.
ఆ మాటలకు రాజు ఆచ్చర్యపోయినాడు. వంటోనికి అచ్చరం ముక్క గూడా రాదు గదా... మరి ఇన్ని విషయాలు ఎట్లా తెలిసినాయో కనుక్కోవాలని పండితున్ని పంపిచ్చి వంటోన్ని పిలిపిచ్చి “మీరిద్దరూ ఏమి సైగలు చేసుకున్నారో, దానికర్ధం ఏమిటో నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు. అసలేం జరిగిందో కాస్త వివరించి చెప్పు" అన్నాడు.
అప్పుడా వంటోడు “మహారాజా! ఏమో అనుకుంటిగానీ వానికి తాను పెద్ద పండితున్నని చానా కొవ్వు. అందుకే నన్ను ఎగతాళి చేయడానికని నాకుండేది ఒకటే కన్ను గదా... అందుకని ఎక్కిరిస్తా ఒక వేలు చూపించినాడు.
దాంతో నాకు కోపమొచ్చి నీకు రెండు కండ్లున్నా అవి నా ఒక్క కన్నుతో సమానంగావు అని వానికి రెండేళ్ళు చూపించినాను.
అంతటితో వాడు వూరుకోవచ్చు గదా... నన్ను మరింత ఎగతాళి చేస్తా 'నీ ఒక కన్నూ, నా రెండు కండ్లు కలిపితే మూడవుతాయి గదా' అంటా మూడేళ్ళు చూపిచ్చి నవ్వినాడు.
దాంతో నాకు ఒళ్ళు మండిపోయి 'రేయ్... ఇంకొక్క మాటగానీ మాట్లాన్నావనుకో వంగబెట్టి గుద్దుతా చూడు" అని పిడికిలి బిగించి చూపించినాను.
ఆ దెబ్బకు వాడు బెదపడి నేను యాడ తంతానో ఏమో అని మట్టసంగా ఓడిపోయానని ఒప్పుకున్నాడు" అని చెప్పినాడు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి