సేవజేతు పద్య సేద్యమునకు
విఘ్నములను బాపి విజయముచేకూర్చు
భావి పౌరులార ! బాలలార!
2) తెలుగు భాషనందు వెలుగుల రవళులు
పాట మాటలందు పరవశంబు
నడిచినంత పదము నవరస భరితంబు
భావి పౌరులార ! బాలలార!
3 కులము మతము జాతి కుళ్ళిన ముచ్చటల్
రక్త మొకటి చూడు రాజసమున
సర్వ ప్రాణులందు సర్వేశ్వరుడి రక్ష
భావి పౌరులార!బాలలార!
4) పుస్తకాలు నెపుడు మస్తకమ్ములనుండు
చదువు డనుచు పిలుచు సకలముగను
పూర్ణ విద్యలందు పొత్తమై నిలుచును
భావి పౌరులార!బాలలార!
5) నల్ల పలకనందు తెల్లని గీతలు
బలపముగను కదుల భవిత వెలుగు
నలుపు రంగు కొరకు నల్లారపు సొబగు
భావి పౌరులార!బాలలార!
6) గుండు సున్నయనుచు గుండ్రటి రాతలు
గీసినంత మురియు గీతలందు
రాత మంచిగున్న రంజిల్లుచుండును
భావి పౌరులార!బాలలార!
7) చిరుగెనింత చొక్క చింపురు జుట్టుతో
పరుగు పెట్టుతారు పరవశమున
లాగు రంద్రమైన యేగుదురు బడికి
భావి పౌరులార!బాలలార!
8) చిట్టి చీమ వరుస చిత్రమై సాగెను
దండుగాను చేరి దండయాత్ర
తాము తినగ నిల్వ దండిగా దాచును
భావి పౌరులార!బాలలార!
9) ఈత కమ్మలందు యిల్లిల్లు పంకలు
తిరుగుతున్న తీరు మరుపు రాదు
చొప్ప బెండుతోడ సోపతులాటలు
భావి పౌరులార!బాలలార!
10) నడకలందు దెబ్బ నల్లారపురసము
గాయమునకు పూయ మాయమౌను
దెబ్బమీద దెబ్బ దెబ్బలెన్నొ దగులు
భావి పౌరులార!బాలలార!
11) వరుస చేతులందు వాయిలి బరిగల
మోత మోగుతుంది వాతలుగను
భయము కలిగివుండి బాధ్యతగ చదువు
భావి పౌరులార!బాలలార!
12) కష్టమెంతవున్న కదిలి సాగవలెను
ఇష్టపడిన చోటు పుష్టి మేలు
నడిచినట్టి త్రోవ నలువురు మెచ్చాలి
భావి పౌరులార!బాలలార!
13) అట్టపుట్టలనుచు చుట్టూర తిరుగాడి
వేయువరకు నిలిచి వెంబడించు
కొత్త పుటల కొరకు కొట్లాటలెన్నెన్నొ
భావి పౌరులార!బాలలార!
14) గోలిలాటలందు గురి చూసి కొట్టాలి
సిర్రగోనెచింది చిరుత పరుగు
చారు పత్త యాట సందడి చేసెనే
భావి పౌరులార!బాలలార!
15) మంచి మాటనున్న మహినంత మిత్రులే
కలిసి మెలిసి నడువ కలుగు సుఖము
ధర్మ మార్గమెపుడు దండిగా గెలుచును
భావి పౌరులార!బాలలార!
16) ముద్దు ముద్దు మాట మురిపించు యెదనందు
నవ్వుమోము తోడ నాట్యమాడు
కల్మషంబులేక కదులెడి బాల్యంబు
భావి పౌరులార!బాలలార!
17) పచ్చని యొడిలోన పసిడి పత్రాలనే
ఆడి పాడినంత నందుకొనును
కొమ్మ చిక్కినంత కోటొక్క కాంతులు
భావి పౌరులార!బాలలార!
18) తొర్రి పండ్లనందు జుర్రుచూ తిరుగుచూ
ఇల్లు వాకిలంత చల్లుచుండు
కోపగించినంత కొంగొత్త యేడ్పులు
భావి పౌరులార!బాలలార!
19) సందులన్ని తిరిగి చిందులు వేయుచు
బురద మట్టినందు పొర్లివచ్చి
ఒళ్ళు మరిచిపోవ నొడలంతహాయినౌ
భావి పౌరులార!బాలలార!
20) గంజి నీళ్లు గలిపి గట్కతో బోనము
అంచు మిర్చినద్ది చుంచుకుంటు
తాగినంతలోన తనువంత మురియదే
భావి పౌరులార!బాలలార!
21) మాడినట్టి బువ్వ తోడవు కడుపున
నూకలన్నమైన నోటదిగును
పబ్బమొచ్చినంత పలుకుల బిర్యాని
భావి పౌరులార!బాలలార!
22) పప్పు కూరలందు పదుగురి బోనంబు
పచ్చి పులుసుసోరు పరవశంబు
అంచుకావకాయ నాకలిరుచియించు
భావి పౌరులార!బాలలార!
23) పచ్చటాకులందు పరమాన్న మెట్టుచూ
కొత్త పండుగంటు కోటి ప్రభలు
సద్దికూడు నందు సకల నైవేద్యంబు
భావి పౌరులార!బాలలార!
24) జాతి కులమనుచును జగతి నందున లొల్లి
రక్తమొకటి కాద రణమునందు
వైరి వర్గమొదులు బ్రతికిన రోజులు
భావి పౌరులార!బాలలార!
25) నలుపు తెలుపు యనుచు నలుసైన మాటలు
రూపుమార్పు కొరకు రొంపులాట
గొప్పలెందుకోయి గుణములుంటే చాలు
భావి పౌరులార!బాలలార!
26) అమ్మ భాషలందు నమృతము చిందును
తెలుగు మాటలాడి వెలుగు నింపు
అమ్మ వొడిన భాష కమ్మని పలుకులు
భావి పౌరులార!బాలలార!
27) అమ్మ భాషతోడ నన్యభాషలు నేర్చి
వేషమంత మార్చ వెర్రితనము
అవసరాల కొరకు నన్యంబు మాట్లాడు
భావి పౌరులార!బాలలార!
28) ఒకటి రెండు ననుచు వొడవని యెక్కాలు
లెక్కలన్ని చేయు పెక్కువిధము
గణిత శాస్త్రమెపుడు ఘనముగా కీర్తించు
భావి పౌరులార!బాలలార!
29) ప్రతిభ నుండవలెను పాఠాలు నేర్వగ
జతన చదవవలెను జడుపులేక
జీవజాల విద్య జీర్ణమై సాగాలి
భావి పౌరులార!బాలలార!
30) సంఘనీతి నందు సమరసభావము
పౌర హక్కులందు సౌరువిరియ
సకల బాటలేయు సాంఘిక భోదనల్
భావి పౌరులార!బాలలార!
31) ఆటలాడవలెను పటిమను జూడంగ
ఓర్పు నుండవలెను వోటమైన
బొమ్మ బొరుసులందు పోరాట ఘట్టము
భావి పౌరులార!బాలలార!
32) కాళ్ళయందుమట్టి గట్టిగా నొత్తుతూ
గుడులు చేయుచుండ్రి గడుసువారు
పైన పందిరేసి బాజాల సందడి
భావి పౌరులార!బాలలార!
33) చినుకు పడిన చాలు చిరునవ్వు సంద్రము
మడులు కట్టి మురిసి మలుపు తిప్పి
తోక పడవ తోటి తొక్కులాట వరుస
భావి పౌరులార!బాలలార!
34) చెరువు నిండినంత శీఘ్రమే దూకుతూ
ఈత కొట్టువారు కూతబెట్టి
గట్టు నుంచి బెట్టు గడియల తానాలు
భావి పౌరులార!బాలలార!
35) చేదబావి నందు చేతాడు పరుగులు
నీళ్లు బొక్కెనందు నిండుగొచ్చు
పట్టుతప్ప పట్టె పాతాళగరిగెను
భావి పౌరులార!బాలలార!
36) చిట్టి గోతినందు పొట్టి మొక్కలు నాటి
చుట్టు కంచె వేసి గట్టుజేసి
నీళ్లు పోసినంత పీడనాల చెట్టవౌ
భావి పౌరులార!బాలలార!
37) పచ్చనైన చెట్లు పలు రకాలుగమేలుఁ
చెట్టు నీడ జీవి సేదదీరు
కాలమందు తరువు కాపాడునేగదా
భావి పౌరులార!బాలలార!
38) పుస్తకంబు నెపుడు హస్తభూషణమౌను
కలము కదులుచుండ కార్యసిద్ధి
రెండు జతగనున్న రెట్టింపు ధైర్యంబు
భావి పౌరులార!బాలలార!
39) బక్క పలుచనైన బలశాలి చదువులో
పొట్టి వాడి మనసు గట్టి తనము
అక్షరమున లేదు నవయవలోపంబు
భావి పౌరులార!బాలలార!
40) కాలినడకనైన గాలి మోటారైన
మనిషి జీవితమున మనుగడకును
నిలుపు నట్టి చోటు నిజమైన విద్యయే
భావి పౌరులార!బాలలార!
41) నీతి న్యాయమందు నిలుచును ధర్మంబు
మంచి మార్గమున్న మరులుగొలుపు
ఒక్కటైన మాట ఒనరుగ బంధమౌ
భావి పౌరులార!బాలలార!
42) పిచ్చి గీతలందు వచ్చిన చిత్రము
మదిన తలుపులన్ని హృదిన దెఱుచు
బొమ్మ వెన్నెలందు బోలేడు రంగులు
భావి పౌరులార!బాలలార!
43) ఇంటి పనుల యందు నింపైన పాఠంబు
పాట పద్యమైన పరవశంబు
వల్లె వేసినంత వడివడి చదువులు
భావి పౌరులార!బాలలార!
44) పద్యమెపుడు నిలుచు పదికాలములపాటు
కంఠమందు సాగు కమ్మదనము
రాగయుక్త మందు రమణీయ పాదాలు
భావి పౌరులార!బాలలార!
45) ప్రాసలందు సాగి పాడగా గేయమై
భావి జీవితాన భవ్యమౌను
శ్రావ్య సుందరంబు సౌధామి సంబ్రంబు
భావి పౌరులార!బాలలార!
46) బడిన బాలలున్న బలము చేకూరును
సకల విద్యలందు శౌర్యమలరు
విద్యసాగరంబు విజ్ఞులనిలయాలు
భావి పౌరులార!బాలలార!
47) గదుల నిండుగున్న గబగబా యరుపులు
తోడుబాలలున్న దూరి పలుకు
సందడైన చోట సరితూగు విద్యలు
భావి పౌరులార!బాలలార!
48) మదిన తప్పులున్న మనసంత గాయాలు
తప్పు మీద తప్పు తాండవంబు
తప్పు తుంచినంత తనువంత సంబ్రము
భావి పౌరులార!బాలలార!
49) గచ్చు మీద నున్న గమ్మత్తు గిల్లుడు
పిన్న వయసులందు పిలుపు మైత్రి
బల్లలేని బాధ బాలలకుండదు
భావి పౌరులార!బాలలార!
50) మాట చురుకుదనము మంత్ర పరిమళము
కఠిన భాషనంబు కన్నులందు
తప్పులేని మాట తడవడదెప్పుడు
భావి పౌరులార!బాలలార!
51) దూప దూపయనుచు తాపతాప పరుగు
నల్లనీళ్లు తడిపి నవ్వులాట
పీక కూతవిన్న బెదురుతూ నిల్చిరి
భావి పౌరులార!బాలలార!
52) దరువు డప్పులందు దండిగా శబ్దంబు
కేకలేసుకుంటు కిటికిలందు
గురువు మాటలిన్న జరుగు నిశ్శబ్దంబు
భావి పౌరులార!బాలలార!
53)కాలినడక నందు గడసరి బాలలు
వాగు వంక దాటి వరుసగాను
దూరమెంతనున్న దోస్తులై సాగిరి
భావి పౌరులార!బాలలార!
54) పాతికూర్ల మంది ఖ్యాతైనబడినందు
విద్య నేర్వకదులువిలువలందు
జ్ఞానమొందినంత జగతంత మెచ్చును
భావి పౌరులార!బాలలార!
55) జీవితాన మలుపు చిత్రమై సాగును
నేర్పు కలిగినంత మార్పులుండు
అక్షరంబులున్న నవకాశమొచ్చును
భావి పౌరులార!బాలలార!
56) ఎండమావులందు యేగిర్త పరుగులు
నడక సాగలేక నాట్యమయము
పాదరక్ష లేక పరిపరివేదనల్
భావి పౌరులార!బాలలార!
57) చినుకుపడిన నేల చిత్తడౌ గుంతతో
ఇల్లు జేరుటేల జల్లులందు
చిల్లులున్న గాని చెదరవుబ్రేకులు
భావి పౌరులార!బాలలార!
58) అంగి లాగులందు లాగిన గుండీలు
పట్టుమనుచు తెగెను పట్టుతప్పి
కదిలి సాగవలెను కాంటలే సాక్షంబు
భావి పౌరులార!బాలలార!
59) పచ్చనాకులందు వెచ్చని స్నేహంబు
చిగురు చూసినంత చెంగునెగిరి
పీకచేసి పరుగు పీపీల శబ్దంబు
భావి పౌరులార!బాలలార!
60) గుండు సున్ననందు బండెడక్షరములు
రాసినంత కుదిరి రయమునొచ్చు
చూసిరాతనందు బాసిల్లు కూర్పులు
భావి పౌరులార!బాలలార!
61) తుమ్మ బంక తెచ్చి కమ్మలన్ దోసిన
అట్ట సందులందు గట్టిగుండు
జిగురు పట్టినేలు తీగలై వీడుగా
భావి పౌరులార!బాలలార!
62) పత్తిపెన్నుపట్టి పదునుగా రాతలు
ఇంకు పారినంత ఇంఫుగుండు
బుడ్డినుంచి పీల్చి బుద్దిగా పోసేరు
భావి పౌరులార!బాలలార!
63) గోడనందు సూక్తి గొప్పైన రాతలు
గుండెనందు నిలుచు గుర్తుగాను
అక్షరాలుకదుపు లక్షమెదళ్ళను
భావి పౌరులార!బాలలార!
64) పటములన్ని వేసి ప్రాంతాలు గుర్తించి
హద్దులన్ని తెలుపు నవని గూర్చి
నింగినేల నందు నిలువెత్తు చిత్రాలు
భావి పౌరులార!బాలలార!
65) చెట్టు నీడనందు చెదరని నవ్వులు
బండ రాయిపైన బదులుకుంటు
అరుపు కేకలందు నల్లరి బుడుతలు
భావి పౌరులార!బాలలార!
66) చింతచిగురుదెంప వింతైన యెగురుడు
వోనగాయతినిన వొగరుగుండు
పుల్లనైన చెట్టు వూగించు నూయాల
భావి పౌరులార!బాలలార!
67) రేగుపండ్లు దెంప బాగుగా పరుగులు
ముండ్లు గుచ్చుకున్న మురియువారు
పండ్లు జేబునిండ పడెనుగా దారినా
భావి పౌరులార!బాలలార!
68) పరికి పండ్ల కొరకు పదుగురి ముచ్చట
బడికి డుమ్మకొట్టి వరుసనడక
అడవినందు బాట వొడవదు రోజంత
భావి పౌరులార!బాలలార!
69) చెరుకుగడల కొరకు చేనులో పనిచేసి
రసము తాగినంత రాజసంబు
బెల్లము తినినంత వుల్లము రంజిల్లు
భావి పౌరులార!బాలలార!
70) తోటలందువెడలి తొండిలాటాలాడి
జామ మామిడంటు జతలు తెంపి
ఉప్పు కారమద్ది జెప్పనా తినవలె
భావి పౌరులార!బాలలార!
71) జేబు నడుములందు చీటీపరీక్షల
భయముతోటి గూడి వణికినంత
తప్పు రాత రాయతనువంత చెమటలే
భావి పౌరులార!బాలలార!
72) చూసి రాసినంత చొప్పించు తప్పులు
ముందు వెనుక జూసి ముచ్చటేల
చీటిలేని రాత దాటిగా ఫలితంబు
భావి పౌరులార!బాలలార!
73) మార్కులిచ్చినపుడు మనసంత గడబిడ
తక్కువెక్కువైన తందనాన
చదివి రాసినంత సకలము శుభమౌను
భావి పౌరులార!బాలలార!
74) సమయమించుకున్న చదవాలి ఘనముగా
గడిచినట్టి వేళ తుడిచిపెట్టి
ముందు చూపుకొరకు ముచ్చటించవలెను
భావి పౌరులార!బాలలార!
75) తేనెటీగలందు తెగని కొట్లాటగా
తుట్ట కదుపుతుండ్రి తుంటరోళ్ళు
ఈగలొచ్చి కరువ యేకంగ బొబ్బలే
భావి పౌరులార!బాలలార!
76) పలకలేని చదువు పలుకులా దూరము
దిద్దనక్షరములు దివిటి లేల
విద్య ట్యాబులందు విలువల చదువులు
భావి పౌరులార! బాలలార!!
ఉండ్రాళ్ళ రాజేశం
77) రంగులన్ని కలిపి రమణీయ చిత్రాలు
వేయవలెను నెపుడు వేగిరమున
రంగు బొమ్మలున్న రంజిల్లు పొత్తముల్
భావి పౌరులార!బాలలార!
78) అచ్చు కమ్మలున్న మెచ్చును రాతలు
కమ్మ కమ్మలందు కదిలి నిలుచు
అచ్చు కాగితాన నందమై పరుగులు
భావి పౌరులార!బాలలార!
79) కత్రెపొరక పండ్లు కరముల తెంపుతూ
ఎరుపురంగు యనుచు వెంటబడుచు
భయము చూపినంత వణికిన ముచ్చట్లు
భావి పౌరులార!బాలలార!
80) వలపు దాపడంటు బండికెడ్లను గట్టి
ముల్లుగర్ర బట్ట ముందుకేగు
సత్వరముగ నిల్లు సంబరంబుగ జేరు
భావి పౌరులార!బాలలార!
81) పసిడి కాంతులున్న బంగారు పురుగులు
రాలె చెట్టునందు వ్రాల,పట్టి
అగ్గిపెట్టెనుంచి నాడించు దారాన
భావి పౌరులార!బాలలార!
82) సంచులందు బట్ట సకలము దాచియు
తాళమేసినంత తనువు తృప్తి
పొంద సూటుకేసు సందుగ నటుకెక్కె
భావి పౌరులార!బాలలార!
83) పుల్ల పుల్ల తెచ్చి పురిలతో పిచ్చుక
అల్లినట్టి గూడు నద్భుతంబు
పక్షి నేర్చె విద్య పడుతు కష్టంబుగా
భావి పౌరులార!బాలలార!
84) జారు బండ నుండి జర్రునా సాగుతూ
వరుస కట్టుతారు భయము లేక
గాయమించుకైన గజగజ వణుకుడు
భావి పౌరులార!బాలలార!
85) కోపమొచ్చినంత కోదండ మేసియు
ముండ్లకంప పెట్టి ముప్పుయనిరి
దండమున్న చదువు దండిగా వచ్చును
భావి పౌరగందు!బాలలార!
86) చెడ్డ మాటలందు చెడుగుడు పోట్లాట
గల్ల పట్టుకొనుచు లొల్లి చేసి
ఘడియ దూరమైన గడువదు నేస్తమూ
భావి పౌరులార!బాలలార!
87) పచ్చనాకులందు పరమాన్న భోనము
బంతిగాను సాగు భక్తి కలిగి
నలుగురున్నచోట నవ్వులే పువ్వులు
భావి పౌరులార!బాలలార!
88) వరసగాను నడక వజ్రంబు బాటయై
నెమ్మదైన మాట నేర్పుగలుగు
కమ్మనైన మాట క్రమశిక్షణను పంచు
భావి పౌరులార!బాలలార!
89) తల్లిదండ్రులెపుడు తనయుల బాగుకై
కష్టపడుదురెపుడు కార్యమందు
దైవమల్లె నిలిచి ధరణిని రక్షించు
భావి పౌరులార!బాలలార!
90) అన్నదమ్ములందు నన్యాయము వలదు
అక్క చెల్లెలనిన నాత్మబంధు
సాధు జనులతోడ సోదరా తత్వంబు
భావి పౌరులార!బాలలార!
91) తొండిలాటలేదు దొంగ పోలీసులై
సీత రాములనుచు చిట్టిలాట
చూపుడేలు చూపి శోధన చేయాలి
భావి పౌరులార!బాలలార!
92) కమ్మ చించినంత గమ్మత్తు చిత్రాలు
కంటినందుదాచి వెంటపరుగు
కొట్టినంత వెలుగు కొంటె పనుల మోత
భావి పౌరులార!బాలలార!
93) గచ్చు మీదనందు కచ్చకాయలనుచు
సుక్క బండితోడ సూర్నిలనుచు
పాలకాయలాట పరవశంబును నింపు
భావి పౌరులార!బాలలార!
94) పావులర్థలున్న పాపుడంబు కొరికి
తీపిదనము కొరకు సాపి చేతు
సావుకారి చెంత సకలము కొనుగోలు
భావి పౌరులార!బాలలార!
95) దీపకాంతులందు దివిటీల వెలుగులై
చదివినట్టి రోజు సకల శుభము
స్తంభమున్నయిల్లు సదుపాయముగ నుండు
భావి పౌరులార!బాలలార!
96) గట్టునందు నిలిచి గాలిపటములాట
మాంజదారమందు మరలి పోటి
ఉత్తరాలు పంపి సత్తువై కేరింత
భావి పౌరులార!బాలలార!
97) వంద మంది యున్న వసుధయందున మిన్న
గురువు పేరువిన్న గుండె దరువు
వృత్తిలెందులున్న చిత్తమో వొజ్జలు
భావి పౌరులార!బాలలార!
98) చదివినట్టి బడులు చెదరని ముద్రలు
జ్ఞాపకాల సుధలు జాగృతంబు
చిన్ననాటి మాట చిత్రమై దోచును
భావి పౌరులార!బాలలార!
99) రెక్కలొచ్చి పక్షి చుక్కలా పైకేగి
విద్యనేర్చినంత విశ్వమేలు
కాలమించుకున్న కలవాలి స్నేహము
భావి పౌరులార!బాలలార!
100) బడులు గుడులు యెపుడు భాగ్యవిధాతలు
రక్షనందు నిలుచు రయమునెపుడు
బుద్ధి జ్ఞానమున్న పుడమంత సంబ్రము
భావి పౌరులార!బాలలార!
101) జెండ వందనంబు పండుగై సాగును
జనగణమన యనుచు జగతియంత
మూడు రంగులున్న మువ్వన్నెలెగురును
భావి పౌరులార!బాలలార!
102) చిత్తు బొత్తులాట చిత్రమై దోచును
పైన తిరిగినంత పైసమారి
మాయవలెను బొమ్మ మత్తులో దించును
భావి పౌరులార!బాలలార!
103) మనమునందు ప్రశ్న మాట్లాడు ధైర్యంబు
ముందు వెనుకగుంజు ముచ్చటగను
మనసు విప్పినంత మదినిండ పులకించు
భావి పౌరులార!బాలలార!
104) ఉచితమైన విద్య ఉన్నత చదువులు
ప్రభుత పంచుచూచు పాలనందు
వసతులందుకొనుచు వసుదైక కీర్తియున్
భావి పౌరులార!బాలలార!
105) కన్నబిడ్డవలెను కంటిపాపవలెను
కాచుచుండు గురువు కన్నులందు
విద్యనొసగినంత విజయమొందురులొజ్జ
భావి పౌరులార!బాలలార!
106) గురువు యెక్కడున్న తరువందు వేరులై
చిగురు పంచుతాడు చిన్ననాట
వృక్ష కాంతులందు లక్షణ పాదులే
భావి పౌరులార!బాలలార!
107) వెనుకబడినవాడు వెన్ను చూపడనియు
తూలనాడవలదు తొలకరిగను
తుదకు నిలిచియైన తుదిపోరు జయమొందు
భావి పౌరులార!బాలలార!
108) సకల విద్యలందు చదువులమ్మ, దయతో
జ్ఞాన మిడునుగాదెగైకొనంగ
వందనాలు తల్లి వసుదైక జగతిన
భావి పౌరులార!బాలలార!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి