న్యాయాలు -635
భాండానుసారి స్నేహ వన్యాయం
*****
భాండ అనగా పాత్ర,మట్టి పాత్ర, ఏదేని వస్తువు, వాణిజ్య వస్తువు,నిధి.అనుసారి వెంట పోవు, పూనిక ,అనుసరించు. స్నేహ అనగా చెలిమి,సోపతి అనే అర్థాలు ఉన్నాయి.
"కుండకు అంటుకున్న నూనె వలె". నూనె పోసిన కుండను ఎంత తోమినా ఎంతో కొంత నూనె దానికి అంటుకునే వుంటుంది కానీ పూర్తిగా పోదు అని అర్థము.
పూర్వకాలంలో అన్ని అవసరాలకు మట్టి పాత్రలు వాడేవారు. నూనె,నెయ్యి పాలు పెరుగు లాంటి అన్నింటి కోసం సైజుల వారి కుండలను ఉపయోగించే వారు.
ప్రస్తుత కాలంలో కుండలకు బదులుగా స్టీల్,రాగి, ఇత్తడి అల్యూమినియం లాంటి పాత్రలను, రకరకాల వస్తువులు పోసుకోవడానికి ఉపయోగిస్తున్నారు.
కుండ పాత్ర అయినా మరే పాత్ర అయినా వాటిల్లో పోసిన నూనె, నెయ్యి లాంటి వాటి యొక్క జిడ్డు ఒక్క పట్టాన వదలదు. ఎంత తోమినా పోదు. అలాగే స్నేహం కూడా...
ఒకసారి చేసిన స్నేహం కూడా అంతే. కుండకు అంటుకున్న నూనె లేదా నెయ్యి వలె అంత తొందరగా వదలదు .ఒక వేళ వారి మధ్య ఏవైనా పొరపొచ్చాలు వచ్చి విడిపోయినా వారి మధ్య జ్ఞాపకాల అవశేషాలు మిగిలే వుంటాయి అని అర్థము.
అయితే దీనినే ఆధ్యాత్మిక వాదులు తమ దృష్టితో చూస్తూ మనిషి చేసిన పాప పుణ్యాలు మనిషిని అంటిపెట్టుకునే వుంటాయని దానికో ఉదాహరణ చెబుతుంటారు.
ఒక మనిషి తన జీవితంలో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాడు.అయితే మరణం తర్వాత అతడిని స్వర్గానికి తీసుకుని పోతారు. కానీ ఒక సారి అతడిని మళ్ళీ మానవ లోకానికి తీసుకుని వస్తారు.ఎందుకంటే అతడు చేసిన పుణ్యకార్యాలలో కొన్ని మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి అన్నమాట. అలా అతడిని స్వర్గానికి తీసుకుని వెళ్ళినా అతడు చేసిన పాపాలను బట్టీ మళ్ళీ మానవ లోకానికి రావలసి వచ్చింది.
ఈ విధంగా _భాండానుసారి స్నేహ న్యాయము"లో రెండు రకాల కోణాలు ఉన్నాయని మనకు తెలిసిపోయాయి కదా!మరి మనం అలాంటి జ్ఞాపకాలతో కూడిన మంచి స్నేహాన్ని చేద్దాం.ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా చూద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి