ప్రముఖ కవి, పలు సైన్స్ రచనలు చేసిన రచయిత, పరిశోధకులు, వ్యాసకర్త, వక్త, విశ్రాంత రసాయన శాస్త్ర ఉపన్యాసకులు, డా.ఎ.పి.జే. అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ప్రతాప్ రెడ్డి కౌటిళ్యా గారి గురించి నావైన పదాలలో..
🍇జీవిత విశేషాలు🍇
ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, ఖిల్లా ఘన్ పూర్ మండలం, ఉప్పరపల్లి గ్రామస్తులైన డాక్టర్ రాఘవరెడ్డి - రాములమ్మ దంపతుల సంతానంగా 1966, ఏప్రిల్ 7న జన్మించారు.. తండ్రి ఆయుర్వేదిక్ డాక్టర్, తల్లి గృహిణి..
🍇విద్యాభ్యాసం🍇
ప్రతాప్ రెడ్డి గారు కర్నూలులోని సిల్వర్ జూబ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి,హైదారాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఎస్.సీ చదివారు.. తరువాత పి.హెచ్.డీ చేస్తూ, హైదారాబాద్ జే.ఎన్.టీ.యూ లో ఎం.టెక్ (బయోటెక్నాలజీ) చేసారు..
🍇వృత్తి వివరాలు🍇
ప్రతాప్ రెడ్డి గారు చదువు పూర్తయ్యాక మొదటగా భువనగిరి ఎస్.ఎల్.ఎన్.ఎస్ డిగ్రీ కాలేజీ లో బయో కెమిస్ట్రీ లెక్చరర్ గా ఐదు సంవత్సరాలు పని చేశారు. ఆ తర్వాత ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐదు సంవత్సరాలు రసాయన శాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ లెక్చరర్ గా, కొంతకాలం మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్ గా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగంలో పనిచేశారు.. తరువాత పారా మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు.. ప్రస్తుతం పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిపిడిసి మెంబర్ గా ఉంటూ గెస్ట్ ప్యాకెల్టీగా కొనసాగుతున్నారు..
🍇కుటుంబ నేపథ్యం🍇
ప్రతాప్ రెడ్డి గారి జీవిత సహచరి పేరు శ్రీమతి సునీత గారు.. సునీత గారు నాగర్ కర్నూల్ జిల్లా
బిజినపల్లి మండలంలోని నంది వడ్డెమాన్ జిపిఎస్ లో ఎస్జిటి టీచరుగా పని చేసి, ప్రస్తుతం ఖానాపూర్ UPS లో ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది.. ప్రతాప్ రెడ్డి గారు ప్రస్తుతం కుటుంబంతో నాగర్ కర్నూల్ జిల్లా, పాలెం లో స్థిరపడ్డారు..
🍇సాహితీ ప్రస్థానం🍇
ప్రతాప్ రెడ్డి గారు మొదటిసారి వ్రాసిన సైన్స్ వ్యాసాలు 1986లో ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యాయి.. ఆ తర్వాత ఆయన వ్రాసిన సైన్స్ వ్యాసాలు విశాలాంధ్ర, ఉదయం మొదలగు పత్రికలో ప్రచురితమయ్యాయి, ఆయన వ్రాసిన చాలా వ్యాసాలు యజ్ఞం లోకల్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి..
ప్రతాప్ రెడ్డి గారు తను వ్రాసిన వ్యాసాలతో తన మొదటి సైన్స్ రచన పుస్తకం ఈనాడు జర్నలిస్టు ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులైన డాక్టర్ మోడల చంద్రశేఖర్ సంపాదకత్వంలో ప్రచురించబడింది.. అప్పటినుండి ప్రతాప్ రెడ్డి గారికి సైన్సులో పుస్తకాలు రాయాలన్న ఆకాంక్షను కలిగించింది.. అలా మొదలైన ఆయన సాహితీ ప్రయాణంలో ఇప్పటివరకు సైన్స్ డాట్ కామ్, సైన్స్ రచన, సైన్స్ నేచర్ అనే సైన్స్ పుస్తకాలు మరియు సంతకం అనే కవితా సంపుటి ప్రచురించారు..
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి మరియు గాత్రధారిణి శ్రీమతి రచన శృంగవరపు గారు డా. ప్రతాప్ గారి రచనలు సైన్స్ రహస్య శోధనలు, కవిత సంకలనం సంతకం మరియు కవితలు ప్రేమ మరియు మరణపత్రం మొదలగు వాటిని ఆవిర్భావ కవితా వేదికపై తన గాత్రంతో పాఠకులకు వినిపించారు..
🍇పాల్గొన్న సదస్సులు🍇
ప్రతాప్ రెడ్డి గారు పాపులర్ సైన్స్ రచయితగా, కవిగా, వక్తగా చాలా సెమినార్లలో సమావేశాల్లో పాల్గొన్నారు.. సైన్స్ పట్ల ఆసక్తితో పాపులర్ సైన్సే ధ్యేయంగా హైదరాబాదులో చాలా సైన్స్ సెమినార్లు నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియోలో దాదాపు 100కు పైగా సైన్స్ టాక్స్ ఇచ్చారు. అదేవిధంగా దూరదర్శన్ లో కూడా కొన్ని సైన్స్ కార్యక్రమాలు రూపొందించారు.. ప్రముఖులు డాక్టర్ మహీధర నళిని మోహన్ రావు, డాక్టర్ దేవరాజు మహారాజు, డాక్టర్ కేబి గోపాలం, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, డాక్టర్ సర్వేశ్వర శర్మ, డాక్టర్ ఓలేటి పార్వతీశం వంటి దిగ్గజాలతో కలిసి 90 దశకం లోనే చాలా సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. సీసీఎంబీ డైరెక్టర్స్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ మోహన్ రావు గార్లతో పాటు జన విజ్ఞాన వేదికలో కలిసి పనిచేసారు..
🍇పురస్కారాలు🍇
ప్రతాప్ రెడ్డి గారు సైన్స్ తో పాటు సాహిత్యంలో చాలా అవార్డులు రివార్డులు పొందారు. రెండు రాష్ట్రీయ అవార్డులు,జిల్లాస్థాయిలో కలెక్టర్ గారితో ప్రశంసా పత్రాలు మరియు వివిధ సాహితీ సంస్థల నుండి పలు సన్మానాలు, సత్కారాలు పొందారు.. వాటిలో కొన్ని ముఖ్యమైన పురస్కారాలు.
👉2024లో సైన్స్ మరియు సాహిత్య సేవలకు గాను తెలంగాణ బి.సి. కమీషన్ చైర్మన్ శ్రీ బి.ఎస్.రాములు గారి 70వ జన్మదిన సందర్భంగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
👉2024లో డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ ఫౌండేషన్ వారిచే ప్రతిష్టాత్మక డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం జాతీయ అవార్డు..
👉2024లో సైన్సులో చేసిన కృషికి గాను చెన్నై విద్యా భవన్లో గౌరవ డాక్టరేట్ పురస్కారం.
🍇చివరగా🍇
డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు రసాయన శాస్త్ర ఉపన్యాసకులుగా, శాస్త్రవేత్తగా పనిచేసినారు.. ఆయనకు సైన్స్ అంటే ఎంతో ఇష్టం, సాహిత్యం అంటే ప్రాణం.. సైన్స్ పై వున్న మక్కువతో సైన్స్ రచన, సైన్స్ డాట్ కామ్, సైన్స్ నేచర్ అనే సైన్స్ పుస్తకాలు మరియు కవిత్వం వ్రాసి, సంతకం అనే కవితాసంపుటి వెలువరించారు.. అంతే కాదు, సైన్స్ పై ప్రజలకు ఉపయుక్తకరమైన వ్యాసాలు ఎన్నో వ్రాసారు..
ప్రతాప్ రెడ్డి గారు పి.హెచ్.డి చేసినా, కొన్ని కారణాల వల్ల డాక్టరేట్ పట్టా అందుకోలేక పోయారు.. కానీ, సైన్స్ పై ప్రతాప్ రెడ్డి గారు చేస్తున్న కృషికి గాను గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటి, చెన్నై వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసారు..
డాక్టర్ ప్రతాప్ రెడ్డి కౌటిళ్యా గారు సైన్స్ పై మరియు సాహిత్యంలో ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలియచేస్తూ, ఆయన కలం నుండి మరెన్నో సైన్స్ పై మరియు సాహిత్య రచనలు రావాలని ఆశిస్తూ.. మరో విశిష్ట రచయిత పరిచయంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి