పిసినారి అవ్వ - టక్కరి పిల్లోళ్ళు -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక అవ్వ వుండేది. ఆమె చానా పిసినారిది. ఆమెకు ఐదుమంది మనవళ్ళు వుండేటోళ్ళు. వాళ్ళు చానా టక్కరోళ్ళు.
ఒకరోజు అవ్వకు బచ్చాలు చేసుకోని తినాలనిపించింది. కానీ పిల్లలందరికీ చేస్తే చానా ఖర్చవుతుంది గదా... దాంతో ఆ పిసినారిది ఎవరికీ తెలీకుండా మట్టసంగా రాత్రి అందరూ పండుకున్నాక చేసుకోవాలనుకోనింది. బచ్చాలకు కావలసిన బెల్లం, బ్యాళ్ళు కొనుక్కోనొచ్చి ఉడకేసి పూర్ణం రుబ్బి మచ్చుపైన పెట్టింది. అలా పెట్టడం పెద్ద పిల్లోడు చూసినాడు. "అవ్వ మాకు తెలియకుండా ఏమో చేసుకొని ఒక్కతే తినాలని అనుకుంటోంది. కనుక్కోవాల" అనుకున్నాడు.
ఆరోజు రాత్రి అందరూ పండుకున్నాక ఆ ముసల్ది లేచి వంటింట్లోకి పోయింది. చప్పుడు గాకుండా మట్టసంగా బచ్చాలు చేయడం మొదలు పెట్టింది.
పెద్దోడు మొదట్నించీ ఇదంతా గమనిస్తా వున్నాడు గదా! దాంతో నెమ్మదిగా లేచి వాకిలి కాన్నించి లోపలికి తొంగి చూసినాడు. అవ్వ లోపల బచ్చాలు చేస్తా కనబడింది.
“ఓహో... ఇదా సంగతి” అనుకోని మట్టసంగా తిరిగి వచ్చి పండుకోని "అవ్వా ... నీళ్ళు దప్పిక అవుతున్నాయే” అని గట్టిగా అరిచినాడు. 
ఆ అరుపులకు ముసల్ది వులిక్కిపడింది. 
“వాని అరుపులకు మిగతా పిల్లలు యాడ లేస్తారో... ఏమో...” అని భయపడతా నీళ్ళు బెరబెరా తీసుకోని పోయి వానికి ఇచ్చింది.
వాడు నీళ్ళు తాగి "అవ్వా... ఏందే బచ్చాల వాసన వస్తావుంది. ఏం చేస్తా వున్నావు” అంటూ వంటింట్లోకి దూరినాడు. పొయ్యి పక్కన బచ్చాలు చూసి "నాకు పెట్టే” అని ఏడవసాగినాడు. 
ఆ ఏడుపుకు మిగతా పిల్లలు
లేస్తారేమోనని భయపడిన ముసల్ది “ఎవరికీ చెప్పొద్దు” అంటూ వానికి రెండు బచ్చాలు పెట్టింది. వాడు అవి తిని పోయి పండుకున్నాడు.
అవ్వ మళ్ళా బచ్చాలు చేయడం మొదలుపెట్టింది. పెద్ద పిల్లోడు కాసేపటికి పక్కనున్నోన్ని నెమ్మదిగా లేపి “రేయ్... అవ్వ ఒక్కతే బచ్చాలు చేసుకుంటా వుంది. రేపు మనకు ఒక్కటి గూడా దొరకవు. పో...పోయి తినిరాపో” అని చెప్పినాడు.
వాడు సరేనని తలూపి "అవ్వా... ఒంటికొస్తుందే” అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టినాడు “ఓరినీ... సచ్చినోడా... నీకూ ఇప్పుడే రావాల్నా?" అనుకుంటా అవ్వ వురుక్కుంటా వచ్చి వాన్ని బైటకు తీసుకోని పోయింది.
వాడు ఒంటికి పోసి పోతాపోతా "అవ్వా... ఏందే బచ్చాల వాసన వస్తావుంది. ఏం చేస్తున్నావు ఈ రాత్రిపూట” అంటూ అమాయకంగా అడుగుతూ వాడు కూడా వంటింట్లోకి దూరినాడు. 
పెనం మీద కాలుతా వున్న బచ్చం చూసి "అవ్వా... నాకూ ఒక రెండు పెట్టే” అని ఏడవడం మొదలు పెట్టినాడు. ఆ ఏడుపుకు మిగతా పిల్లలు లేస్తారేమోనని భయపడిన ముసల్ది “ఎవరికీ చెప్పొద్దు” అంటూ వానికి గూడా రెండు బచ్చాలు పెట్టింది. వాడు అవి హాయిగా తిని పోయి పండుకున్నాడు. 
అవ్వ మరలా బచ్చాలు చేయడంలో మునిగిపోయింది.
కాసేపటికి వాళ్ళు మిగతా ముగ్గురినీ లేపి జరిగిందంతా చెప్పి ఏం చేయాలో చెప్పినారు.
సరే అని కాసేపటికి మూడోవాడు "అవ్వా ... వీడు సూడే! మాటిమాటికీ గిచ్చుతా వున్నాడు.” అంటూ ఏడుస్తా పైకి లేచినాడు. అవ్వ ఉరుక్కుంటా బైటికొచ్చి “లేదులే ... లేదులే ... ఏడవమాకు. నువ్వు ఈ పక్క పండుకుందువురా” అంటూ వాన్ని లేపింది. 
వాడు లేసి పోతాపోతా "నన్ను గిచ్చుతావురా నువ్వు” అంటూ నాలుగోవాన్ని ఈడ్చి ఒకటి తన్నినాడు.
“అంతే... నాలుగోవాడు ఉలిక్కిపడి పైకి లేచి “ఏరా... నిద్ర పోతావుంటే నన్ను కొడ్తావా” అంటూ ఎగిరి వాన్ని దొబ్బినాడు. 
అంతే వాడు పోయి ఐదోవాని మీద పడినాడు. 
అంతే "అవ్వా... చూడే” అంటూ వాడు కూడా లేచి వాళ్ళ మీద కలబన్నాడు. అట్లా ఒకరి మీద ఒకరు పడతా ఐదుమందీ లేచి ఒకరినొకరు తన్నుకోసాగినారు.
అంతలో చిన్నోడు "రేయ్ ... వంటింట్లోంచి బచ్చాల వాసన వస్తావుంది రోయ్” అంటూ గట్టిగా అరిచినాడు.
అంతే ... మిగతా వాళ్ళు కొట్లాట ఆపేసి ముక్కులు ఎగబీలుస్తా “అవున్రోయ్... అవ్వ రేప్పొద్దున లేస్తూనే మనకి పెట్టడం కోసం చేస్తున్నట్లుంది రోయ్” అంటూ గట్టిగా అరిచినారు. అవ్వ అదిరిపడింది.
పిల్లలందరూ ఒక్కసారిగా వంటింట్లోకి జొరబన్నారు. గిన్నె తీసి తలా కొన్ని బచ్చాలు ఏసుకోని నున్నగా అన్నీ తిని హాయిగా నవ్వుకుంటా నిద్రపోయినారు.
ఎవ్వరికీ పెట్టకుండా అన్నీ తానే తినాలకున్న ఆ ముసల్దానికి ఆఖరికి ఒక్క బచ్చం గూడా మిగలలేదు.
***********
కామెంట్‌లు