సుప్రభాత కవిత : -బృంద
కలవరించే కనుపాపకి 
కనిపించే కమ్మని కలలా 
కనుల ముందు నిలుచున్న 
కనువిందు చేసే కమ్మని సత్యంలా

దాచిన  మమతలన్ని ఏకంగా 
దాపునే రమ్మని పిలిచినట్టుగా 
దారిన దొరికిన పెన్నిధిలా 
దాక్షిణ్యం చూపే దైవానుగ్రహంలా

తలపుల సద్దు మణిగిన మదికి
తనివారగా దయచేసిన నెమ్మదిలా
తెలివెలుగున తళ తళ మెరుస్తూ 
తలిరాకులు చేసే నాట్యంలా

తరలి వచ్చు తొలికిరణపుతేరు
కదిలిసాగు  గగనసీమ దారుల
పరచిన బంగరు కాంతులు 
తెరచిన తూరుపు తలుపులు

ప్రభాత వేళ ఆవిష్కృతమైన 
ప్రభాసమంటి  వెలుతురు 
పయనపు దిక్సూచిగా  తోచి 
హృదయము  ఉప్పొంగే సాగరమై!

వచ్చినదేదో మనదనుకుని 
తెచ్చినదే మహాప్రసాదమనుకుని 
ఇచ్చినదే ఇష్టంగా చేకొని 
ఇంపుగా జీవితం మలచుకొమ్మనే 
వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు