అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘటనే ‘ కోరిక ‘ కథ … ! (చిరు స్పందన ): -- డా . కె . ఎల్ . వి . ప్రసాద్

 మనిషి -మనసు ,అన్నాక ఆశలకు  అంతే ఉండదు . కోరికలకు కళ్ళాలు 
వుండవు . అది మనకు సాధ్యమా ? కాదా ? అన్న ఆలోచనలకు కూడా తావివ్వకుండా మనసులో కోరికలు తన్నుకు వస్తాయి . అలా స్త్రీ తనకు మనసులో ఉన్నకోరికను ,అదిసాధ్యం కాదని తెలిసినప్పటికీ ,తన యజమానురాలి దగ్గర విషయం ప్రస్తావించినప్పుడు ,ఊహించని విధంగా 
యజమానురాలు తన కోరికను తీర్చినప్పుడు ఎలా ఉంటుంది ?సరిగ్గా ఈ అంశాన్ని వస్తువుగా తీసుకుని కథ అల్లారు డా . అంజనీదేవి గారు . డా . 
అంజనీదేవిగారు ,నిత్యం బిజీగా వుండే స్త్రీవైద్య నిపుణురాలు మాత్రమే కాదు 
ఆవిడ ,మంచి రచయిత్రి ,చిత్రకారిణి ,సుద్దముక్కల మీద (చాక్ పీస్ లు )
సున్నితమైన బొమ్మలు చెక్కుతారు . డాక్టర్ గారు మంచి వక్త కూడా ! హన్మకొండలో ‘ కల్యాణీ నర్సింగ్ హోమ్ ‘ నడుపుతూన్న డాక్టర్ గారు ఆసుపత్రిలోని చిన్న సంఘటనను వస్తువుగా తీసుకుని చిన్న కథ రాశారు . 
ఇది 2006 లో ఆంద్ర జ్యోతి వీక్లి లో అచ్చయింది . కానీ ఇలాంటి పాతిక 
కథలను పుస్తక రూపంలో తీసుకురావడానికి డా . అంజని గారికి షుమారుగా 
18 సంవత్సరాలు పట్టింది . ఇప్పటికైయినా డాక్టర్ గారి కథలు ‘ కథల అర ‘
పేరుతొ ,మొదటి కథా సంపుటి రావడం అభినందనీయం . 
ఇక అసలు కథలోకి వస్తే ,ఈ రెండు పేజీల కథలో ,రెండే రెండు పాత్రలు . 
ఒక పాత్ర డాక్టర్ గారు అయితే ,రెండవపాత్ర ,డాక్టర్ గారి ఇంట్లో పనిచేసే అమ్మాయి మేఘమాల . కథలో మొదటి కొద్ధి పేరాలలో ఈ పేరు గురించే చెబుతారు రచయిత్రి . నిరక్షరాస్యుల కుటుంబాలలో కూడా ఇంత మంచి పేర్లు ఉంటాయా ?అన్నది ,అందరిలాగే ,ఈ కథా రచయిత్రికి కూడా వచ్చిన అనుమానం కావచ్చు . 
మేఘమాల బాల్య వివాహం చేసుకుని పిల్లల్ని కన్నది . ఈ సంసారబాధ్యలతో 
ఆమె చదువు కొనసాగలేదు . చాలా సంవత్సరాలుగా డాక్టర్ గారి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నది డాక్టర్ గారు ఆమెను ఎప్పుడూ పనిమనిషిగా చూడలేదు . ఇంట్లో ఒక సభ్యురాలిగానే మెలిగింది . డాక్టర్ గారి ఆదరణతో 
ఆమె సంసారం ఆనందంగా గడిచిపోతుంది . 
అంత పెద్ద ఆసుపత్రిలో తాను కేవలం ఒక పనిమనిషి అని అందరూ చెప్పుకోవడం ఆమెకు కాస్త నామోషీ అనిపిస్తుంది . అందుకే యజమానురాలి దగ్గర వున్న చనువు ఆధారంగా డాక్టర్ గారిని ఒకానొక రోజున ఒక వింతకోర్కె 
కోరుతుంది . ఆకోర్కె మొదట యజమానురాలిని ఆశ్చర్య పరుస్తుంది ,కానీ తర్వాత ఆలోచింప జేస్తుంది . మేఘమాల కోరిక అసాధ్యం అయినా ,దానిని 
సుసాధ్యం చేసే ఆలోచనల్లో పడుతుంది డాక్టర్ . ఇంతకీ మేఘమాల కోరిన కోరిక రచయిత్రి మాటల్లో ‘’ అమ్మా !ఒక్కసారి ,ఆ .. తెల్ల చీర కట్టుకోవాలని వుంది . కట్టుకుని డ్యూటీ చేయాలని వుంది . సంతకం చేసి జీతం తీసుకోవాలని వుంది ‘’ అంటుంది . 
మేఘమాల కోరికను మంచి మనసుతో అర్ధం చేసుకుంది యజమానురాలు . 
వెంటనే మేఘమాలను ఆ ఆస్పత్రిలో అటెండర్ పోస్ట్ వరించింది . కథలో చివరి లైన్లు పాఠకుడిని ఆలోచింప జేస్తాయి . 
‘’ ఆనందంగా మేఘమాల మా ఇంటి మెట్లు దిగివెళ్ళింది . చిన్న చిన్నగా నాకు దూరమయింది . తనకు నచ్చిన పనిలోనికి తాను వెళ్ళింది . ఆ పని తనంలో 
మేఘమంత ఎత్తు ఎదిగింది ,నా ఆసుపత్రిలోనే !
ఆ .. ఎత్తు నుంచి నన్ను చూసింది !
ఆ .. మేఘం నా మనసుపై ఆనందాన్ని వర్షించింది ‘’ అని కథా రచయిత్రి డాక్టర్ పాత్రతో ఇలా చెప్పిస్తారు . ఈ కథ చదివిన తర్వాత ఇటువంటి యజమానులు కూడా మన సమాజంలో ఉన్నారా ?అని పిస్తుంది . తప్పక చదవదగ్గ కథ ఇది . 
‘కథల అర’ కధాసంపుటి కావలసినవారు ,నేరుగా రచయిత్రిని సంప్రదించ వచ్చును . 9390101655. 

కామెంట్‌లు