సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -665
యూప రశనా న్యాయము
*****
యూపము అంటే బలి పశువును కట్టి వేయుటకు నాటబడిన యజ్ఞ సంబంధమైన కొయ్య.దీనినే కట్టుకొయ్య అని కూడా అంటారు.రశనా అనగా త్రాడు, మొలత్రాడు అని అర్థము.
 యూప రశనా అనగా కట్టుకొయ్యకు రెండు తాళ్ళు కట్టి యుంచునట్లు అని అర్థము.
యూప లేదా యూప స్తంభ అంటే త్యాగం అని అర్థము.ఇది ప్రాచీన భారతదేశంలో ఉపయోగించిన వేద బలి స్తంభం. జంతుబలికి సంబంధించిన వైదిక ఆచారాలలో ఇది ఒక ముఖ్యమైన అంశము.
వైదిక త్యాగాలలో దాదాపు ముప్పై పశు యాగాలుగా  వర్గీకరించారు.ఇందులో జంతువును కాల్చి వేస్తారు. ఈ సందర్భంగా జంతువును కట్టి వుంచిన స్తంభమును ( చెక్కతో చేసిన స్తంభం)యూప స్తంభము అంటారు.
 కట్టు కొయ్యకు బలి పశువును కట్టడానికి  ఉపయోగించే స్తంభానికి రెండు తాళ్ళు కడతారు. ఆ రెండు తాళ్ళతో  కట్టిన పశువు ఇక ఎటూ కదలకుండా అక్కడే వుండిపోతుంది. అలా దానిని బంధించి యజ్ఞం లేదా యాగంలో బలి ఇస్తారు.
 ఇలా బలి ఇవ్వడం అనేది దైవ ప్రీతి కొరకు ఏదో ఒక జంతువును చంపే ఒకానొక క్రతువు. హిందూ మతంలో జంతు బలి ఆచారం ఎక్కువగా వేద శ్రౌత ఆచారాలు మరియు గిరిజన సంప్రదాయాలలో,జానపద ఆచారాలతో బలంగా ముడిపడి ఉంది. ఈ జంతు బలులు అనేవి పురాతన వైదిక మతంలో భాగంగా ఉన్నాయి.వేదాల్లో, పద్దెనిమిది పురాణాలలో,వాటి ఉప పురాణములలో కూడా వీటి ప్రస్తావన ఉంది.వైదిక శ్రౌత యజ్ఞాలలో  ఏడింటికి జంతు బలి అవసరమని చెప్పబడింది.ఇందులో సోమయాగంలో మేకను, అశ్వమేధ యాగంలో గుర్రాన్ని .. ఏడు రకాల రాగాలలో ఏడు రకాల జంతువులను బలి ఇవ్వాలని రాసి వుంది. ఈ జంతు బలి బాధితుడి ఆత్మ త్యాగాల విముక్తికి మార్గంగా చెప్పబడింది.
 ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రపంచంలో నేటి సమాజానికి ఇలాంటి బలులు చేయడం హింస చేయడం కాబట్టి చేయకూడదు అని కొందరు , చేస్తే తప్పులేదు అది తరతరాలుగా వస్తున్న ఆచారమని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇది వారి వారి మనోభావాలకు సంబంధించిన విషయం.
 మన పెద్దలు ప్రతి న్యాయమును మనుషులకు వర్తింపజేసి చెప్పడం మనం గమనించవచ్చు.ఈ యూప రశనా న్యాయము లో కూడా జంతువు యూప స్తంభానికి రెండు తాళ్ళతో కట్టి వేయబడినట్లు మనిషి కూడా  రెండు రకాల  పాశాలు అనగా తాళ్ళతో బంధింపబడతాడు అంటారు.
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వ్యసనం అనే కట్టుకొయ్యకు మనసు, శరీరాలు బంధింపబడి అందులోంచి బయటకు రాలేక బలై పోవడం. అది మంచి వ్యసనం అయితే సమాజానికి ,తనకూ గణనీయంగా మేలు జరుగుతుంది, గౌరవం కలుగుతుంది.చెడు వ్యసనం అయితే  సమాజానికి  కీడు సంభవిస్తుంది .
ఇక మరో కోణంలో  చూస్తే  రెండు తాళ్ళలో  ఒకటి పేగు బంధం, రెండు ప్రేమ బంధం. ఇవి రెండూ మనిషి  వదిలించుకోలేనంతగా కట్టిపడేస్తాయి. మనం సినిమాల్లో చూస్తూ వుంటాం. విలన్ ఎంత క్రూరుడైనా తన సంతానం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండటం. అలాగే ప్రేమ బంధం... ఇది ఎంత బలమైనదంటే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతుంది. ఇలాంటివి "యూప రశనా లాంటివి. వాటికి కట్టుబడితే ఇక బలి కావడం ఖాయం అంటుంటారు .కాబట్టి "యూప రశనా న్యాయము"లో 'తస్మాత్ జాగ్రత్త'అనే హెచ్చరిక   వుంది.


కామెంట్‌లు