సుప్రభాత కవిత : -బృంద
అనుకున్నవి జరగనపుడు 
ఎదురు చూసింది రానపుడు 
మనసు పొందే అలజడి 
గుండె పెట్టె కేకలు....
వినిపించవు ఎవరికీ......

కోటి ప్రశ్నలు వేసే మదికి 
మౌనం సమాధానం అయితే 
ఆ మౌన నిశ్శబ్ద విస్ఫోటనపు 
నిప్పు రవ్వలు దహిస్తుంటే 
మంటలు కనపడవు
ఎవరికీ!

గాజు ముక్కలైతే వచ్చే శబ్దం 
చక్కగా తెలిసిపోతుంది 
తిరస్కారపు అవమానంతో 
నిందలు పడ్డ మనసు ముక్కలైతే 
చప్పుడు తెలియదు
ఎవరికీ!

పగిలిన గుండె పంపే నెత్తురు 
నర నరాల పరుగుతీస్తూ 
దేహమంతా బాధని 
నింపేస్తూ చేసే వీరంగం 
అగుపడదు 
ఎవరికీ!

కొండలకావలి నుండి 
నిండుగ వెలుగుతూ 
పండుగలా సంతోషమిచ్చే 
బంగరు బంతి తెచ్చే బహుమతి 
ఏదో తెలియదు 
ఎవరికీ!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు