సుప్రభాత కవిత :- బృంద
ఏటి దాపుల యెగిరి వచ్చి 
నీటి లోపల  తొంగి చూసి 
మేటి సొగసులు సరిచూసుకుని 
సాటి ఎవరూ లేరులెమ్మని...

సాక్షి నీవని  తరువు తోడ 
మేలమాడి  నవ్వుకుని 
తోడురాగా మబ్బుమందలు 
సాగిపోయే దూరదేశము

పెనిమిటికి విన్నవించిన 
ఇల్లాలి  విన్నపాలు 
పల్లెనున్న పెద్దలకు 
పిల్లలంపిన క్షేమాలు

సాగరాల కావలనున్న 
వారసులకు పెద్దలు 
పంపుకున్న ప్రాణప్రదమైన 
ఆకాంక్షల దీవెనలు

చదువు కోసం వలస వెళ్లిన 
చిన్న తండ్రుల  ఈతిబాధలు 
తల్లిదండ్రులకు చేరవేయొద్దని 
చేసుకున్న వేడుకోళ్ళు

అమ్మానాన్నల తలపులతో 
ఒంటరిగా కంట నీరు  
నింపుకొని  మధనపడే 
ఆడకూతురి  వేదనలు

దూరమైన  బంధాలను 
తలచి వగచే  వ్యధలు కార్చే 
కన్నీళ్లు  జాలి గొలపగ 
కరిగి కురిసి ఓదార్చే మొయిళ్ళు 

సందేశాలు మోసుకుని 
సమూహలుగా కదిలి వెళ్లి 
కబురులిచ్చి కుశలమడిగి 
ప్రియమారా కౌగిలించు 

మబ్బుతునకల స్నేహానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸




కామెంట్‌లు