సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-683
వాక్యర్థ ప్రతిపత్తి న్యాయము
******
వాక్య అనగా వాక్యము.అర్థ అనగా ప్రయోజనం,లక్ష్యం ,సగము. ప్రతిపత్తి అనగా పరిపాలన అని అర్థము.వాక్యము యొక్క అర్థము స్పష్టమై ఉన్నట్లు.
 ముందు వాక్యము అనగా ఏమిటో తెలుసుకుందాం. వాక్యం అనగా అర్థవంతమైన పదాల సమూహము. అలా వుంటేనే స్పష్టమైన అర్థముతో భావాన్ని వ్యక్తీకరించగలదు. అనగా విషయము అర్థవంతంగా, సంపూర్ణంగా, స్పష్టంగా భావ ప్రకటన కలిగించే విధంగా పదముల సమూహము ఉండాలి.
 పదముల వలెన కాకుండా పదార్థముల వలన వాక్యము పుట్టుచున్నదని కుమారిల భట్టు చెప్పారు. పద సమూహము నుండి పుట్టిన అర్థము వాక్యము అని బృహద్ధేవత అనడం జరిగింది. మీమాంస సూత్రంలో ఆకాంక్ష కలిగి ఏకార్థమును బోధించునది వాక్యము అని మీమాంస సూత్రము చెబితే నిరాకాంక్షమని కాత్యాయన శ్రౌత సూత్రము అంటున్నది.
 మొత్తం మీద చూసినట్లయితే  వెలుపలి పదములను ఆశించక స్వయంగా అనగా స్వయం సమగ్రంగా ఉన్న దానిని వాక్యమని అనవచ్చు. అలాగే  వక్త చేసిన అర్థయుక్తమైన శబ్ద సముదాయమును కూడా వాక్యం అనవచ్చు.
 వాక్యంలో మూడు అంశాలు ఉండాలని ప్రాచీనులు అనే వారు.అవి ఒకటి యోగ్యత, రెండు ఆకాంక్ష.‌మూడు ఆసత్తి అనే మూడు అంశాలు ఉంటాయి.
ఇందులో యోగ్యత గురించి ప్రాచీనులు సంబంధార్హత్వం అన్నారు.ఇది వాక్యములోని మాత్రల పరము.అర్థ అబాధ అర్థపరము.మరి కొందరు బోధా నిశ్చయ అభావమని అంటారు.ఇక ఆకాంక్ష అనగా నిలుపుదల లేకుండా వెంట వెంటనే వచ్చే పదాల అర్థముల మీద ఉన్న ఆదరము. అదెలా అంటే వినే వారికి తెలుసుకోవాలనే ఆకాంక్ష, కోరిక ఉండాలి.
ఇక ఆసత్తి అంటే పదాల మధ్య దూరం అనగా ఒక పదానికి మరో పదానికి మధ్య దూరం ఉంటే ఉచ్ఛరించునపుడు అర్థము బోధ పడదు. వ్యవధానం లేకుండా పదాల మధ్య సాన్నిహిత్యం ఉండాలి.
 వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటాయని మనకు తెలుసు. అయితే ఈ వాక్యాల్లో సంపూర్ణ వాక్యం, అసంపూర్ణ వాక్యం,అవాంతర వాక్యం,సంశ్లిష్ట వాక్యము, సంయుక్త,కర్తరి,కర్మణి, ప్రశ్నార్థకం అనే వాక్యాలు ఉంటాయి.
 అలా  చెప్పదలచుకున్న లేదా మాట్లాడ దలచుకున్న వాక్యం స్పష్టంగా ఉండాలి. సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటేనే అది అసలైన వాక్యం అనిపించుకుంటుంది.
 మరి మన పెద్దవాళ్ళు ఈ "వాక్యార్థ ప్రతిపత్తి న్యాయము"ను ఉదాహరణగా చెప్పడానికి గల కారణము ఏమిటంటే  మన మాట్లాడే మాట కూడా స్పష్టంగా డొంకతిరుగుడు లేకుండా ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యేలా ఉండాలి.  మనసులో భావ స్పష్టత ఉన్నప్పుడు మాట్లాడే మాటలోనూ స్పష్టత, సరైన వ్యక్తీకరణ వుంటుందనే అర్థం ఈ న్యాయములో ఇమిడి ఉంది.సంపూర్ణ వాక్యంలా మొదట చెప్పిన మూడు లక్షణాలు యోగ్యత , ఆకాంక్ష,ఆసత్తి ఉండేలా మనమూ వుందాం.

కామెంట్‌లు