న్యాయాలు-650
మక్షికా తంతునాభ న్యాయము
******
మక్షికా అనగా ఈగ.తంతునాభ అనగా సాలెపురుగు.
మక్షికా తంతునాభ అనగా సాలెపురుగు వలలో చిక్కిన ఈగ వలె అని అర్థము.
ఈగ, సాలెపురుగు ఈ రెంటిలో ఈగదేమో ప్రాణం దక్కించుకునేందుకు చేసే పోరాటం.సాలెపురుగుదేమో ఆకలి తీర్చుకోవడానికి యుక్తిగా పన్నిన వలగూటి మాయాజాలం.చివరి గెలుపు ఎప్పుడూ యుక్తి కుయుక్తులదే వుంటుందనే అర్థంతో మన పెద్దలు ఈ "మక్షికా తంతునాభ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ముందుగా ఈగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం...ఈగ అనగానే మన ఇళ్ళల్లో ఆహార పదార్థాలపై వాలి, బెల్లం వంటి తీపి పదార్థాల చుట్టూ ముసురుకుని చికాకు చేసే దృశ్యం కళ్లముందు కనిపిస్తుంది. ఈగ అపరిశుభ్రతకు మూలం.అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఇవి బాగా పెరుగుతాయి. వీటి వల్ల కలరా లాంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి.వీటి పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలనేది మనందరికీ తెలిసిందే.
ఎక్కడ పడితే అక్కడ కనబడే ఈగను ఎంత అదిలించినా మళ్ళీ మళ్ళీ వచ్చి వాలుతుంది. దాని బెడద తప్పించుకోవడం కష్టంగానే ఉంటుంది.మరి అలాంటి ఈగ మీద మంచి, చెడుల కథలు జాతీయాలు, సామెతలు చాలానే ఉన్నాయి.
ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈగ సాలెపురుగు గూటిలో చిక్కుకున్నట్లయితే వెంటనే ఆ గూటి దారాలు ఈగ శరీరానికి అతుక్కుపోతాయి. వాటిని విడిపించుకోవడానికి ఈగ ఎంత గింజుకుంటే అంతగా ఆ దారప్పోగులు వంటిని బంధిస్తున్నట్టుగా చుట్టుకుపోతాయి. దాంతో ఈగకు అటూ ఇటూ ఏమాత్రం కదలలేని నిస్సహాయ స్థితి వస్తుంది. అప్పుడు సాలెపురుగు వచ్చేసి భేషుగ్గా ఈగను తినేసి బ్రేవ్ మంటుదన్న మాట.
మరి ఈగను బంకలా లేదా జిగురుగా అతుక్కుని కదలనీయకుండా చేసిన సాలె గూటి దారాలు సాలెపురుగు శరీరానికి కూడా అతుక్కోవాలి కదా? మరి దానికి కూడా తాను అల్లుకున్న గూడు ప్రమాదమే కదా! అనే సందేహాలు ఎవరికైనా వస్తుంటాయి.
మరి సాలెపురుగు, సాలెగూడుకు సంబంధించిన వివరాలు, విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందామా...
సాలెపురుగు తన గూడును వలలా దారాలతో ఎంతో నైపుణ్యంతో అల్లుతుంది.అల్లిన వల జిగురుగా ఉంటుంది. ఈ జిగురు దారం అనేది సాలెపురుగు పొట్ట నుండి పట్టు దారంలా స్రవిస్తుంది. ఆ దారంతోనే గూటిని అల్లుతుంది.అయితే అల్లిన వలలోని జిగురు దారానికి సాలెపురుగు మాత్రం చిక్కుకు పోదు. కారణం సాలెపురుగు యొక్క తెలివితేటలే.ఆ గూటిలో తాను కానీ తన పిల్లలు కానీ చిక్కుకు పోకుండా ఉండే రహస్యాలు దానికి బాగా తెలిసి వుండటం.ఆ చిన్న ప్రాణిలో అంత తెలివి.తలచుకుంటే భలే చిత్రంగా అనిపిస్తుంది.
కీటకాలు, పురుగులు,ఈగల్లాంటి వాటిని పట్టుకోడం కోసం సాలెపురుగు జిగురు దారాలను గూడు అల్లికలో ఉపయోగిస్తుంది.అలాగే గూడు చెదిరి పోకుండా స్థిరంగా ఉండేందుకు జిగురు లేని బలమైన దారాలను కూడా ఉపయోగిస్తుందట.అవి ఇనుప వూచల వలె గట్టిగా తెగిపోకుండా ఉంటాయట.ఈ జిగురు లేని దారాల మీద పాకుతూ ,జిగురు దారాలు తాకకుండా చాలా జాగ్రత్తగా నడుస్తుందట. తాను కట్టుకున్న గూడు మెలకువలు, రహస్యాలు తనకు మాత్రమే తెలుసు కాబట్టి సాలెపురుగుకు ఎలాంటి ప్రమాదమూ కలగదు. మరి ఆ రహస్యం దాని గూడు వలలో చిక్కుకునే వాటికి తెలియదు కదా! అందుకే ఒక్క సారి అందులో చిక్కాయంటే ఇంతే సంగతులు.ఇక ప్రాణాలు పోగుట్టుకున్నట్లే.అవి సాలెపురుగుకు ఆహారం అయినట్లే...
ఈ "మక్షికా తంతునాభ న్యాయము"ను మన పెద్దవాళ్ళు చెప్పడం లోని అంతరార్థము ఏమిటంటే "మన చుట్టూ యుక్తిగా కుయుక్తులు పన్నే దుష్టులు ఉంటారు.అలాంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి . వాళ్ళు తమకు ఏమి కాకుండా జాగ్రత్త పడుతూ అమాయకులను బలి చేస్తుంటారు.అందుకే పరిసరాలు, పరిస్థితులు అపాయకరమా? కాదా? అనేది జాగ్రత్తగా చూసుకోవాలనీ, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఈగ వలె దుష్టుల చేతల్లో, చేతుల్లో బలైపోతామని గ్రహించాలనే ఉద్ధేశ్యంతో ఈ న్యాయమును మనకు పరిచయం చేశారు.కాబట్టి అలాంటి దుష్టుల వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడదాం.
సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి