సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -671
రథ్యా దీప న్యాయము
****
రథ్యా అంటే రథ మార్గము, రాచబాట,రథ సమూహము,పలు మార్గములు కలియు చోటు అనే అర్థాలు ఉన్నాయి. దీప అంటే దీపము, ప్రకాశము,మయూర శిఖి అనే అర్థాలు ఉన్నాయి.
రథ్యా దీపం అంటే దారి దీపమై తాను వెనుకగా ఉండి తనకంటే ముందుకు వెలుగును ప్రసరింప చేస్తుంది అని అర్థం.
దారిలో దీపము పట్టుకొని నడిచేటప్పుడు దీపము యొక్క వెలుతురు దీపమున్న చోటుకంటే ముందు పడుతుంది. ఆ తర్వాత దీపము వస్తుంది. అలా దీపపు వెలుతురు  దీపం కంటే ముందే చైతన్య స్వరూపిణియై ప్రవహిస్తుంది.
అదే దీపం యొక్క ఉన్నతత్వం.తన ఉనికికంటే ముందుగా తానేంటో అస్థిత్వాన్ని చాటుకునే దీపం వంటి వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి ఈ "రథ్యా దీప న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ముందుగా మనం దీపాన్ని ఎందుకు వెలిగించాలి.ఒక్క దారి చూడటం కోసమేనా మరింకేమైనా విశేషాలు ఉన్నాయా? కార్తీక మాసం అంటేనే దీపాల మాసం అని జనులు అంటుంటారు.అలా దీపాలు లేదా దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.
 కార్తీక మాసం అనగానే  మనందరికీ రకరకాలుగా వెలిగించే  దీపాలు గుర్తొస్తాయి. అలా దీపాలు వెలిగించడమనేది భారతీయ సంప్రదాయంలో ఎంతో పవిత్రతను సంతరించుకున్నది.ఈ మాసం శివకేశవులకు ప్రీతి పాత్రమైనదని భక్తులు దీపావళి నుండి కార్తీక మాసము మొత్తంగా దీపాలు వెలిగిస్తారు.ఆ వెలుగులతో కాంతులు విరజిమ్ముతూ మనోల్లాసం, భక్తి తత్వం పెంచుతుంది.
అందుకే దీపం యొక్క విశిష్టతను, దైవత్వాన్ని తెలుపుతూ కింది శ్లోకాన్ని చదువుతూ వుంటారు.
'దీపం జ్యోతి పరబ్రహ్మ/ దీపం సర్వ తోమోపహః/ దీపేన సాధ్యతే సర్వం/ సంధ్యా దీపం నమోస్తుతే( దీపలక్ష్మీర్నమోస్తుతే )'"అనే శ్లోకానికి  "దీపం జ్యోతి స్వరూపమైనదని అదే పరబ్రహ్మతో  సమానమని, చీకటిని పారద్రోలుతుందని చెబుతూ ఈ దీపం వల్లే సర్వ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతున్నాయని నమ్ముతూ"...ఓ సంధ్యా దీపమా! నీకు నమస్కారము అని అర్థం.అలా పఠిస్తూ నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు.
దీపంలోని భాగాలైన ప్రమిదను మన శరీరంగానూ, అందులో వేసిన వత్తిని మన మనసుగానూ, అందులోని నూనె లేదా నెయ్యి  మనలోని భక్తి లేదా ప్రేమకు ప్రతీకగానూ భావిస్తారు. మరలా వెలిగించిన దీపం యొక్క జ్వాల/ దీప శిఖ సర్వకాలాల యందు పైకే వెలుగుతూ ఉంటుంది. ఇలా  వెలిగించడంలో  మరో పరమార్థం కూడా ఉంది దీపం యొక్క కాంతి, వెలుగు జ్ఞానానికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే దీపం యొక్క ఆదర్శం.అందుకే దీపాన్ని వెలిగిస్తారు.
 ఈ విధంగా  మనలోని జ్ఞానమనే  వత్తిని వెలిగించి చీకటి నుండి వెలుగులోకి దారి చూపుతుంది.అంతే కాదు మనలోనూ,మన గృహాలలోనూ  సానుకూల శక్తిని పెంచుతుంది. ప్రతికూల శక్తులను తొలగిపోయేలా చేస్తుంది.అందుకే మన పెద్దలు  నిత్యం దీపాన్ని వెలిగించాలని చెబుతుంటారు.
అలా దీపం అజ్ఞానమనే అర్థం కాని చీకట్లో మనం ప్రయాణం చేసేటప్పుడు జ్ఞానమనే వెలుగై ప్రసరిస్తూ అంధకారంపై దాడి చేసి సరైన దారి చూపుతూ ఎలా ,ఎటు వైపు వెళ్ళాలో దిశానిర్దేశం చేస్తుంది.
మరి అలాంటి దీపం రథ్యా దీపమై పయనిస్తూ   తాను  ముందుండాలని ఎప్పుడూ కోరుకోదు.తాను వెలుగై  జ్వలిస్తూ దారి చూపాలని కోరుకుంటుంది కానీ తన రూపాన్ని చూపించాలని అనుకోదు.వెలుగుతున్న దీపాన్ని చూసినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా గమనించ వచ్చు.అదే దీపంలోని గొప్ప తనం.
 మరి అలాంటి "రథ్యా దీపం న్యాయాన్ని" మన పెద్దలు ఎందుకు చెప్పి వుంటారు అనేది మరొక సారి లోతుగా అధ్యయనం చేద్దాము.
 మన పెద్దలు మహనీయులను,సహృదయులను రథ్యా దీపంతో పోల్చారు.వారు  తాము కనిపించాలనీ, తమకు పేరు ప్రతిష్టలు రావాలని ఎప్పుడూ కోరుకోరు.తాము ప్రసరింప జేసే విజ్ఞానపు వెలుగులు మును ముందుకు  సాగిపోవాలని ఆశిస్తారు.ఆ వెలుగులో  తర్వాతి తరం పయనిస్తూ తమలోని అజ్ఞానాన్ని తొలగించుకొని విజ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలని అప్పుడే తాము ప్రసరింప జేసే  విజ్ఞానపు కాంతికి సార్థకత చేకూరుతుందని భావిస్తారు.
ఇలాంటి రథ్యా దీపం వంటి మనసు  ఎవరికి వుంటుందంటే ముఖ్యంగా మన తల్లిదండ్రులకు, గురువులకు, మహోన్నత హృదయ సంస్కారం కలగి సమాజ హితం కోసం పరితపించే వారికి మాత్రమే వుంటుంది.అందుకే  వారిని భవిష్యత్తు దిశగా అడుగులు వేయించే దీపధారులు అంటారు.
అలా  మనమూ ఆ తరానికి వారధులమై ఆశయమనే దీపాలుగా వెలుగుదాం.మన  ముందు తరాలకు "రథ్యా దీపమై"  వారిని మనలా జ్ఞాన బాటలో నడిచేలా చూద్దాం .చేద్దాం.

కామెంట్‌లు