సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు -681
వ్రీహి బీజ న్యాయము
     *****
వ్రీహి అంటే వడ్లు లేదా ధాన్యము. బీజ అంటే గింజ. వ్రీహి బీజము అంటే "వడ్లగింజలో బియ్యం గింజ".
వడ్ల గింజలోని బియ్యపు గింజ పై భాగము ఊకతోనూ, ఊకకు క్రింద తవుడుతోనూ కప్పబడి ఉంటుంది.
బియ్యపు గింజను  సత్వ గుణ ప్రతీకగానూ గింజపై ఉన్న తవుడును తమోగుణముతోనూ, ఆ పైన ఊకను రజోగుణముతోను  పోల్చి సత్వగుణమైన మనసు తమో,రజో గుణాల చేత  ఆవరించబడి యుంటుందనే అర్థంతో మన పెద్దలు  మరియు ఆధ్యాత్మిక వాదులు ఈ "వ్రీహి బీజ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఆ సత్వగుణం,రజో గుణం తమో గుణాలను గురించి రేఖా మాత్రంగా తడుముకుందాం.
తమో రజో సత్త్వ గుణాలు ప్రతి మనిషిలోనూ వుంటాయి. అయితే ఆ గుణాలు వున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. 
భగవద్గీతా సారం ప్రకారం  తమో, రజో గుణాల కంటే సత్త్వ గుణం చాలా పవిత్రమైనది.ఇది జ్ఞానానికి మూలం.ఈ గుణం కలిగిన వారు స్వార్థ రహితులు వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఈ గుణం కలిగిన వారు భగతత్త్వానికి, మోక్షానికి ఆరాట పడుతూ ఉంటారు. వీరు పరోపకారులు.
రజో గుణం కలిగిన వారికి ఉద్రేకం,ప్రేమ, అభిమానం,ఆశ, మోహావేశం, అహంకారం...ఇలా అన్నీ ఎక్కువగానే ఉంటాయి.ఆశాపాశానికి బంధీలు వీరు.
ఇక తమో గుణం గల వారిలో బద్ధకం, అలసత్వం, మూర్ఖత్వం, సోమరితనం, భ్రమలు మొదలైనవి వుంటాయి.చెప్పుడు మాటలు విని మంచిని చెడుగానూ, చెడుని మంచిగానూ ఊహించుకుని మనసు పాడు చేసుకుంటారు.
ఈ విధంగా బియ్యం గింజ వంటి అసలైన ఆత్మ లేదా మనసు సత్త్వ గుణం కలిగి వున్నప్పటికీ తవుడు అనే తమో గుణం,ఊక అనే రజోగుణముము చేత కప్పబడి వుంటుంది.
కాబట్టి  వ్రీహి అనగా  ధాన్యమును  రోకళ్ళతో బాగా దంచి లోపల గూఢముగా వున్న  బియ్యమును, లేదా బీజములను వెలికి తీస్తారు.
అదే విధంగా బియ్యపు గింజను వెలికితీసినట్లుగా అన్నమయాది కోశము లనెడి తుష  సముదాయమున అంటే పొట్టులో నిగూఢముగా దాగియున్న పరత్త్వమును వేదాంతులు యుక్త్యవ ఘాతములచే అంటే ఉపాయము ,కౌశలముతో మనసును దండించి "వ్రీహి బీజ న్యాయము" వలె మనసును తమో, రజో గుణాల నుండి బయటికి తీస్తారు.
అలా మనసు పరత్త్వమును తెలుసుకునేలా చేయాలంటే  స్కందోపనిషత్తు చదివి, ఆచరణలో పెట్టాలి .
"త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సో హం భావేన పూజయేత్" అని స్కందోపనిషత్తు చెబుతోంది.సః అంటే అతడు.అహమ్ అంటే నేను. సో హం అంటే అతడే నేను. నీలోనే వుండి  నిన్ను ప్రకాశింప చేస్తున్న ఏ చైతన్యమైతే స్వయం ప్రకాశ స్వరూపమై వెలుగుతుందో ఆ మంగళ స్వరూపాన్ని 'సో హమ్'  అనే భావనతో పూజ చేయాలి అని అర్థం.
అలా మనసును ఆవరించిన మూడు పొరల గుణాలకు మనసే ప్రధాన కారణం కాబట్టి, వాటి నుండి బయట పడటానికి పై విధంగా 'సో హం' భావనతో ఆ చైతన్య స్వరూపాన్ని ధ్యానిస్తూ, వాటి నుండి బయట పడేందుకు ప్రయత్నం చేయాలి..
అప్పుడే "వడ్ల గింజలో బియ్యం గింజ వలె "మనం కూడా బయటకు వచ్చి,సమాజంలో స్వయం ప్రకాశ స్వరూపమై వెలుగుతుంటాం అంటారు.ఇదంతా మనకు కొంచెం గందరగోళంగా అనిపించినా ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం మరియు అసలైన అంతరార్థం ఏమిటంటే మనలోని అరిషడ్వర్గాలకు మూలమైన తమో,  రజో గుణాలను వీడినప్పుడే సమాజంలో మనం శాంతి కపోతాలం, స్వయం ప్రకాశ దీపాలమై విలువల వెలుగులు పంచుతూ సాత్వికతతో కూడిన ఆనందంతో జీవించగలం. అదే కదా మానవ జీవన పరమార్థం.
*****

కామెంట్‌లు