సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -652
మర్కటానల తాప శాంతి న్యాయము
****
మర్కట అనగా కోతి,కొండముచ్చు.ఆనల అనగా నిప్పు, అగ్ని దేవుడు.తాప అనగా వేడి,బాధ, జ్వరము.శాంతి అనగా విశ్రమము,ప్రసన్నత అనే అర్థాలు ఉన్నాయి.
 "మర్కటానల తాప శాంతి" అనగా  నిప్పు తొక్కిన కోతి బాధ ఎలా ఉపశమిస్తుంది లేదా  ఉపశమించింది అని అర్థము.
 ఈ న్యాయము గురించి తెలుసుకునే ముందు  కోతికి సంబంధించిన కొన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
 కోతులు చాలా తెలివైన,సామాజిక జంతువులని చెప్పవచ్చు.కోతుల లక్షణాలను పరిశీలిస్తే అవి తరచూ చిరునవ్వులు నవ్వుతూ వుండటం,వాటి ప్రవర్తనతో చూపరులను ఆకర్షిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉండటం గమనించవచ్చు.మనుషుల్లాగే కోతులకు  బొటన వేలు వుంటుంది.అలాగే వేలి ముద్రలు కూడా ఉండటం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా 260కి పైగా కోతుల జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కోతులు తమ నాలుగు అవయవాలను అంటే  కాళ్ళు,చేతులను ఉపయోగించి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకడం, నిటారుగా నిలబడటం, కూర్చోవడం చేస్తుంటాయి.కోతుల సమూహాలకు మగ వృద్ధ కోతి నాయకత్వం వహిస్తుంది. అలా ఆ కోతి నాయకత్వంలో వందల కోతులతో కూడిన సమూహాలు ఉంటాయట.వీటి సమూహాలను తెగ లేదా దళం అంటారు.ఈ కోతుల జీవిత కాలం15 నుండి 30 సంవత్సరాల వరకు వుంటుందనీ, అయితే కొన్ని  జాతుల కోతులు 45 సంవత్సరాలకు మించి 70 సంవత్సరాల వరకు జీవిస్తాయని జీవశాస్త్ర వేత్తల పరిశోధనలో తేలింది.
ఇక హిందూ మతములో ప్రముఖమైన దేవుడు హనుమంతుడు.వానర జాతికి చెందిన వాడు.రామాయణంలో ఈ వానరాలు రామునికి ఎంతగా సహాయం చేశాయో మనందరికీ తెలిసిందే.
 ఇక విషయానికి వస్తే మనసును అస్థిరమైన, చంచలమైన స్థితిలో ఉండే కోతితో పోలుస్తుంటారు. కోతి ప్రవర్తనను గమనిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.అది ఒక్క క్షణం కూడా కుదురుగా వుండదు. నిరంతరం కదులుతూనే వుంటుంది. ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మకు దూకుడం,ఎక్కడం, దిగడం,ఊగడంతో పాటు అటూ ఇటూ దిక్కులు చూడటం, గోకడం, ఏదో పరిశీలిస్తున్నట్టు చేయడం....ఇలాంటివి ఎన్నో రకాల లక్షణాలు కోతిలో వుంటాయి. అలాగే మన మనసు కూడా.క్షణం కూడా నిశ్చలంగా  వుండదు. నిరంతరం ఏదో ఒక అంశం నుండి మరో అంశంలోకి దూకుతూ వుంటుంది.
 అందుకే యోగ శాస్త్రంలో  మనసును 'మర్కటా' అంటారు. అంటే కోతిలా  చంచలత్వం, ఎవరినీ పట్టించుకోని పరధ్యానం, స్థిరత్వం లేని ఆలోచనలు అనగా అస్థిరత, ఉల్లాసభరితం అనగా నచ్చిన ఆలోచనలతో ఆనందంగా గడపడం..ఇలా కోతిలోని అన్ని లక్షణాలు మనిషి మనసులో కనిపిస్తాయన్న మాట.
మరి అలాంటి అస్థిరత కలిగిన మనసు కోతికి నిప్పు సెగలాంటి అహమో, ఆవేదనో,ఆవేశమో కలిగితే  దానిని తగ్గించడం లేదా ఉపశమింప జేయడం, శాంతి కలిగించడం ఎలా? అనేదే మన ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. 
 యోగా గురువులు దీనికి ఓ  చక్కని పరిష్కారం సూచించారు.అదేమిటంటే  సాధన. ఈ సాధనలో మొదటగా చేయాల్సింది మనసును మచ్చిక చేసుకోవడం.అంటే మనసులో ఉదయించే ఆలోచనలు మనవి కావు మనసువి అని గ్రహించడం. అలా ఆలోచనలకు అతీతమైన శక్తిని కలిగి వుండి, మనకు మనం స్పృహలో ఉండటం.అలా ఉండగలగడం శక్తికి మించిన పనే అయినప్పటికీ మన మనస్సుపై మనకు అధికారం ఉంది కాబట్టి మనం చెప్పినట్లు మనసును నడిపించడం చేయాలి.
ఆ విధంగా మనసును నియంత్రణ లోకి తీసుకోవడానికి దీర్ఘ శ్వాస తీసుకోవడం, వచ్చిన ఆలోచనలు ఎలాంటివో గమనించడం.అంతే కాదు ఆ ఆలోచనలు పరీక్షించేందుకు మనకు మనంగా ప్రశ్నలు వేసుకోవడం,ఆ ఆలోచనలు చెప్పేవి నిజాలు కావని తెలుసుకుని వాటిని పూర్తిగా వదిలేసే ప్రయత్నం చేయడం... ఇలా మానసికంగా సాధన చేయడం, సమాధానాలు రాబట్టుకోవడం వల్ల అన్ని అవరోధాలు తొలగి పోతాయి. మనసుకు శాంతి చేకూరుతుంది. మనకు మనమే సరికొత్తగా ఆవిష్కరింపబడతాం.
మన పెద్దవాళ్ళు "మర్కటానల తాప శాంతి" న్యాయమును ఉదాహరణగా చెప్పుటలో అంతరార్థం ఇదే. ఆ విధంగా మనసును  అదుపులోకి తీసుకుంటే శాంతి దానంతట అదే వస్తుంది.
అయితే దీనినే మరో కోణంలో కూడా చెప్పడం విశేషం. అదేమిటంటే రామాయణంలో సీత జాడను తెలుసుకోవడానికి వెళ్ళిన హనుమంతుడు సీతమ్మ వారిని చూస్తాడు.ఆ తర్వాత రావణాసురునికి సీతమ్మను అలా తీసుకుని రావడం తప్పని చెబుతాడు. కానీ హనుమంతుని మాటలు పట్టించుకోకుండా రావణుడు అతని తోకకు నిప్పు పెట్టిస్తాడు.అసలే మర్కటరూపం.నిలకడగా వుండలేని స్వభావం.ఇంకేముంది ఆ తోకకు అంటించిన నిప్పుతోనే  లంకా నగరాన్నంతా తగలబెడతాడు.ఆవేశం పూర్తిగా చల్లారిన తర్వాత చేసిన పొరపాటుకు చింతిస్తూ తోకను సముద్రంలో చల్లార్చుకుని శాంతిస్తాడు. అలా కూడా ఈ "మర్కటానల తాప శాంతి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 ఈ న్యాయములో మనసు మర్కటం లాంటిదని తెలుసుకోవడంతో పాటు మర్కటం మనసు ఎలా ఉంటుందో కూడా  తెలుసుకోగలిగాం. అలాగే మనసు కోతిని ఎలా నియంత్రించుకోవాలో కూడా  అర్థం చేసుకోగలిగాం. ఈ విషయాలన్నీ తెలిసిన మనం మనసును అదుపులో పెట్టుకుందాం .అంతులేని ఆత్మానందాన్ని పొందుతాం. మీరా నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు