సుప్రభాత కవిత: -బృంద
అలుపు లేక ఆగమించి 
అతిశయముగా అవని గాచి 
అవిరళముగ వరములిచ్చి 
అనుగ్రహించు అంతర్యామివి!

ఆ దూరపు కొండల మధ్య 
ఆ బంగరు రంగుల మెరుపుల
ఆ వింతను చూడగనే 
ఆహ్లాదమే మనసు నిండా!

ఇలలో వెలుతురు నింపి 
ఇరుగడల  రక్షగా నిలిచి 
ఇక్కట్లు పొద్రోలి 
ఇడుములు బాపే తండ్రివి నీవే!

ఈ నేలను బ్రతికించి 
ఈప్సితార్థములు ఇచ్చి 
ఈడేరగా మా బ్రతుకులు 
ఈ తీరుగ బ్రోచే వేరు దైవము కలదె!

ఉరుకుల పరుగుల సాగుతూ 
ఉదయపు వెలుగులు నింపుతూ 
ఉత్సాహపు చైతన్యము పంచుతూ 
ఉర్విని మేలుకొలుపు తల్లివి నీవే!

ఊపిరులూదుతూ లోకానికి 
ఊహల పల్లకి పంపిస్తూ 
ఊయలలూపి జనులను
ఊతంగా నేనుంటాననే అన్నవు నీవే!

ఎల్లలు మదిలో ఉంచక 
ఎవ్వరినీ కాదనక 
ఎప్పుడు ఒకటే తీరుగా 
ఎల్లర కాచే దొరవే నీవు!

ఏ వైపు చూస్తున్నా 
ఏ చోట మనసున్నా 
ఏ మాయ చేస్తావో 
ఏలుకుంటానంటూ మేలుకొలిపే 

అంతర్యామికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు