భరతమాత చరణము:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 భరతమాత చరణము అదే మనకు శరణము
కులమతాల ధూర్తులకది గుండెలోన శూలము
!! భరతమాత!!
వేదంలో పుట్టింది వేదనలో పెరిగింది
ఆక్రమణలొ నలిగింది చిరంతనగ వెలిగింది
భారతీయసోదరా జనజాగృతి చేయరా
సంఘటిత శక్తితోడ విశ్వహితము కోరగా
!! భరతమాత!!
శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెలసినట్టి భూమి
ధర్మమార్గ అనుసరణి భరతుడేలిన భూమి
వీర ధీర శాంత దాన ధర్మ మున్న భూమి
ధర్మ అర్థ కామ మోక్ష ప్రజ్ఞాన భూమి
!! భరతమాత!!
ఐకమత్య మంత్రపఠిత నవభారత భూమి
సర్వజనుల సుఖము కోరు సత్యమైన భూమి
మనదేశపు టౌన్నత్యం చాటిచెప్ప నడుంకట్టి
మనధర్మపు టౌన్నత్యం దశదిశలా మారుమోగ
!! భరతమాత!!
తాడితపీడిత జనులకు ఊతకర్రగా నిలిచి
దైన్యహైన్య జనావళికి భాసమాన హాసమీయ
మనదేహపు కణం కణం భరతమాత సమర్పణం
మననెత్తుటి చివరి బొట్టు భరతమాత సిందూరం
!! భరతమాత!!
**************************************


కామెంట్‌లు