న్యాయాలు-670
రోగి రోగ న్యాయము
******
రోగి అనగా అనారోగ్యం లేదా వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి.రోగ అనగా వ్యాధి,జబ్బు, అనారోగ్యం అనే అర్థాలు ఉన్నాయి.
"రోగి రోగ న్యాయము" అనగా వ్యాధి గ్రస్తుడైన వ్యక్తి యొక్క వ్యాధిని నిర్థారణ చేయుట అని అర్థము.మరి ఈ నిర్దారణ చేసేది వైద్యుడే అని మనకు తెలుసు.
అయితే రోగి అంటే ఇక్కడ అప్పుడప్పుడు వచ్చే జలుబు, జ్వరంతో ఒకటి రెండు రోజులు బాధ పడే వ్యక్తి కాదు. త్వరగా కోలుకోలేని దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని రోగి అంటుంటారు.అంటే ఆ వ్యక్తికి స్వస్థత చేకూరేందుకు చాలా సమయం పడుతుంది.
మరి రోగి ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు? అనే రోగ నిర్ధారణ వైద్యుడు చేసే వివిధ రకాల పరీక్షల ద్వారా తెలుస్తుంది.అనంతరం వైద్యుడు సూచించిన ఔషధ సేవనం ఉంటుంది.
"వైద్యో నారాయణో హరి" అన్నారు మన పెద్దలు. ఆ నమ్మకంతోనే మనం వైద్యుని వద్దకు వెళ్ళాలి. అప్పుడే అతడు చేసే వైద్యానికి మనసు ,శరీరం అనుకూలంగా స్పందిస్తాయి. మరి అలాంటి నమ్మకం కూడా వైద్యులు రోగులకు కలిగించాలి.
నేటి కొందరు వైద్యుల గురించి "వైద్యో నారాయణో హరీ" అంటే వైద్యుని వైద్యంతో రోగి హరీ అంటాడనే అర్థంతో విమర్శిస్తున్నారు. ఇలా అనడానికి చాలానే కారణాలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రులలో వైద్యుల డబ్బాశే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు వల్ల రోగులు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం.
వైద్యులను ధన్వంతరి వారసులు-ధరణిలోన దేవతలు అంటాం. సినారె గారైతే వైద్యులను, నర్సులను దృష్టిలో పెట్టుకొని వారి లాంటి సేవాభావం, సేవా గుణం మాకూ అందించమని కోరుతూ "వ్యాధులు బాధలు ముసిరే వేళ/ మృత్యువు కోరలు సాచే వేళ/ గుండెకు బదులుగా గుండెను పొదిగి/'కొన ఊపిరులకు ఊపిరులూది/ జీవనదాతలై వెలిగే మూర్తుల/ సేవా గుణం మాకందించరాదా" అనే గొప్ప పాటను రాశారు.
ఇక సుమతి శతక కర్త ఊరికి వైద్యుని అవసరం ఎంతుందో తెలిపేందుకు ఏకంగా ఓ పద్యమే రాశారు.
" అప్పిచ్చువాడు, వైద్యుడు/నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్ /జొప్పడిన యూరనుండుము/ చొప్పడునట్టి యూర జొరకుము సుమతీ!"-అనగా ఊరు అన్న తర్వాత అవసరమైనప్పుడు అప్పిచ్చువాడు ఉండాలి.అనారోగ్యం వస్తే వైద్యం చేసే వైద్యుడు ఉండాలి. తాగునీటి వసతి,మంచి చెడులు చెప్పే ద్విజుడు" ఉండాలి అంటాడు.
ఇలా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సరైన సమయంలో సరైన వైద్యం చేయాలని అర్థము.
ఇక రోగుల విషయానికి వస్తే దీర్ఘ కాలిక వ్యాధులతో లేదా గాయాలతో సతమతమయ్యే వారు, రోగులు ఏం కోరుకుంటారు.అదే విషయం మహా భారతంలో ఉంది.
ఇలా విపరీతమైన శారీరక, మానసిక బాధలు అనుభవించే రోగులు స్వచ్ఛందంగా ఏం కోరుకుంటారో మహాభారతంలో భీష్ముడి పాత్ర ద్వారా చెప్పించడం విశేషం.
"రోగి రోగ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వైద్యులు ధరణిలో దేవతల్లా ఉండాలి. రోగుల, వారి బంధు మిత్రుల మనసులో నమ్మకం కలిగించాలి.
మరి దీనని మన పెద్దలు వ్యక్తులకు అన్వయిస్తూ ప్రతి వ్యక్తి వైద్యునిలా ఉండాలి.( అందుకే "పాత రోగి - కొత్త వైద్యుడు" అన్నారు). మృదువైన మాటలతో మరణించే వారిని కూడా బతికించే వారిగా, డబ్బు కంటే మనిషి ముఖ్యం చనిపోయిన దేనినీ తిరిగి బతికించలేం అనే సత్యాన్ని గ్రహించి వైద్యం చేయాలి.రోగి రక్షణ వైద్యుని కర్తవ్యంగా భావించాలి. ఇలాగైతేనే "రోగి రోగ న్యాయాని"కి న్యాయము జరుగుతుంది. ఆర్థికంగా యిబ్బంది పడినా అంతా కోలుకున్న తర్వాత ఆనందం కలుగుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి