శృతి తప్పిన ఓ .. తల్లి జీవన రాగానికి తోడైన కూతురి దీన రాగం వెరసి ‘ మౌనరాగం కథ ‘:=--డా.కె.ఎల్.వి.ప్రసాద్.


 జీవితం బాల్యమునుండి వృద్దాప్యం వరకూ అనేక మార్పులను చవిచూస్తూ సమస్యలను ఎదుర్కొంటూ చివరకు ఏదోరూపంలో ముగింపు పలుకుతుంది . అయితే జీవితంలో  బాల్యం యవ్వనం ,కౌమార్యం ,దాటి వృద్దాప్యం వరకూ ఎంత మంది చేరుకుంటారు?అన్నది ప్రశ్నార్థకమే !అందుచేత వృద్దాప్యాన్ని అనుభవించిన వాళ్ళని ,వాళ్ళు కన్నపిల్లల్ని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు . అయితే వృద్దాప్యం అనుభవించిన వాళ్లంతా ఆరోగ్యంగానూ ,సంతోషంగానే ,పిల్లలకు ఇబ్బందులు సృస్టించకుండాను (కావాలని కాదుసుమండీ) వెళ్లిపోయారని చెప్పడానికి కూడాలేదు . చాలా శాతం మంది వివిధ సమస్యలతో ,అనారోగ్య కారణాలతో కాలం చేసినవారే కనిపిస్తుంటారు . కారణాలుఏమైనా వృద్దాప్యానికి చేరుకోవడం అనేదిఎంతఆనందకరమో ,కొంతమందివిషయంలోఅంతకుమించినదుఃఖమయమూ ,ఆధాకరమూ కూడాను . సంవత్సరాలతరబడి మంచాలకె అంకితమైపోయి ,సర్వం అక్కడే కానిచ్చుకుంటూ ,తాము బాధపడట
మే కాకుండా ,పిల్లలలను ,అంధువులను లేదా ఇతర సంరక్షకులను ఇబ్బంది పెట్టి(ఇబ్బంది పెట్టాలని కాదు)ఎదుటివారు విసుక్కునేలా ,
అసహ్యించుకునే స్థాయికి కూడా తీసుకుపోతారు . ఎందుకంటే వారి అనారోగ్య సమస్యలు అలాంటివి . ఇకపోతే మరికొంతమంది ఆరోగ్యంగా కొంతవరకూ బాగానే వుంటారు,తమపనులుతాముచేసుకుంటారు ,కానీజ్ఞాపకశక్తినికోల్పోతారు.చెప్పకుండాతలుపుతీసుకుని ,గమ్యం లేని చోటుకువెళ్లిపోతుంటారు . భోజనం చేసినా చేయలేదంటారు . బ్రష్ చేసుకోకపోయినా ,చేసేసుకున్నామని చెబుతారు ,సందర్భంలేని పరాకు మాటలు మాట్లాడుతుంటారు . ముందు చెప్పుకున్నవారికంటే ,ఇలాంటి వారివల్ల ప్రమాదం ఎక్కువ . సంరక్షకులు విసుక్కోవడానికి కూడా ఇలాంటి వారివల్ల అవకాశాలు ఎక్కువ . క్రమంగా మనుష్యులను గుర్తు-పట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది . వింతచేష్టలు,వింతమాటలుఎక్కువఅవుతుంటాయి . ఇలాంటి తల్లిదండ్రులను భరించడం ,ఎంత ప్రేమించే కూతుళ్ళకైనా ,కుమారులకైనా కత్తిమీద సాములాంటిది . పరిస్థితిని అర్ధం చేసుకుని ,ప్రేమించి తల్లిదండ్రులకు సేవలుచేసే పిల్లలు సమాజంలో అతి–కొద్దీ మంది మాత్రమే మనకు కనిపిస్తారు . ఇలాంటి వృద్ధాప్యపు లక్షణాలు 
‘ అల్జీమర్స్ ‘ అనే సమస్యలో కనిపిస్తుంటాయి . ఇది ఈ మధ్యకాలంలో 
బాగా ,అందరి నోటా వినిపిస్తున్న అనారోగ్య సమస్య . అదిగో అలంటి సమస్యను ఆధారంగా చేసుకుని రచయిత్రి శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ . కొప్పిశెట్టి ,చక్కని ,చిక్కని ,చిన్న కథను అల్లారు . ఇది చదివితే కథ అని పించదు ,ఎక్కడో జరిగిన హృదయ విదారక గాథ !
శ్రీమతి ఝాన్సీ ఇలాంటి కథలు రాయడంలో దిట్ట . సమాజంపై చక్కని అవగాహన ,స్వీయ అనుభవాలు ఆవిడ కలం చేత చిందులు వేయిస్తాయి 
సరదాగానో ,ఉబుసుపోక చదువుకునే కథలుగా నో ,ఆవిడ కథలు వుండవు . ఎక్కడో ఎవరిజీవితంలోనుండో ,కథా వస్తువును తీసుకున్న భావనే .శ్రీమతి కొప్పిశెట్టి కథల్లో కనిపిస్తుంది . అది రచయిత్రిలోని గొప్పతనంగా భావించకతప్పదు . ఊహాగానాలు ,పగటికలలు ,పనికిరాని ప్రేమలు ఈ రచయిత్రి కథల్లో అసలు కనిపించవు . అతికొద్ది కాలంలోనే మంచి రచయిత్రి గా పేరుతెచ్చుకోవడానికి అనేక అవార్డులు పొందడానికి కారణం ఆమె చేసిన మంచి రచనలే . 
ఇంతకూ కథ విషయానికొస్తే - కథ మొత్తం చెప్పడం భావ్యం కాదుగానీ కథలోనే ముఖ్య సారాంశం చెప్పే ప్రయత్నం చేస్తాను . ఒక తల్లి -కూతురు 
కూతురి సంసారం . ఆ కూతురు తల్లిని అమితంగా ప్రేమిస్తుంది . తల్లి వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా సకల సేవలు చేస్తుంది . ఒక ప్రక్క ఎదుగుతున్న పిల్లలు ,మరోప్రక్క బాధ్యత గల ఉద్యోగం ,వంటి తప్పనిసరి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే తల్లికి ‘ అల్జీమర్స్ ‘ సమస్య ఉత్పన్న మవుతుంది . ఇక్కడ పూర్తి సమయం తల్లికికేటాయించలేనిపరిస్థితి ,తప్పనిసరి బాధ్యతలతో సతమతమవుతున్న నేపథ్యంలో బంధువులు,శ్రేయోభిలాషులు,స్నేహితుల సలహామేరకు ఇష్టం లేకపోయినా తల్లిని మంచి సదుపాయాలున్న ‘ వృద్దాశ్రమం ‘ లో చేరుస్తుంది . తల్లి అది స్వంత ఇల్లుగానే భావిస్తుంటుంది . లేని పెంపుడు కుక్క బయటికి వెళ్లినట్టుగా భావించి వెతకడానికి రమ్మని కేర్ టేకర్ ను ప్రాధేయపడింది . కేర్ టేకర్  మాటలతో సర్దిచెప్పి మూడ్ మార్చే ప్రయత్నం చేస్తుంటుంది . ఇక కూతురు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది . తల్లిని వృద్దాశ్రమం లో చేర్చడం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో పెట్టినందుకు కూడా బాధపడుతుంది . నిత్యం తల్లి కూర్చునే కుర్చీ చూసినా ,పెంపుడు కుక్కను చూసినా ,తల్లి మాటలూ ,తల్లిచేష్టలు ఆవిడ  పరాకు  మాటలూ గుర్తుకు వచ్చి కూతురు మనసు వికలము అయిపోతుంది . తల్లినిచూడాలనేకోరికఅధికమౌతుంది . వృద్ధాశ్రమం వాళ్ళు పిలవకపోయినా ,వెళ్లి తల్లిని చూసిరావాలని నిర్ణయించుకుంటుంది . తీరా అక్కడికి వెళ్ళాక ,తల్లిప్రవర్తనకు భంగ పడిన మానసిక పరిస్థితి 
చదువరిని కంటతడి పెట్టిస్తుంది . బహుశః ఏ కథ రాసిన రచయిత్రి కళ్ళు సైతం చెమర్చి వుంటాయనడం అతిశయోక్తి కాదేమో !అక్కడ ఏమిజరిగిందో  తెలియాలంటే కథ చదవక తప్పదు . అయినా ఎందుకు ,రచయిత్రి రాసిన కథ చివరి పంక్తి చదివితే పాఠకులకు కథ పూర్తిగా అర్ధం అయిపోతుంది . అదేమిటంటే ,’’ రాణి (కూతురు)మనసంతా దేవినట్టయి కళ్ల నీళ్లు కక్కుకుంటూ తనను గుర్తించని అమ్మ (మణమ్మ)వంక నిస్త్రాణంగా చూస్తుండి పోయింది ‘’
ఈ కథ చదువుతుంటే ,కన్నీళ్ల పర్యంతం కావడమే కాదు ,వృద్దాప్యం రాకముందే ,జీవితం చాలించడం మంచిదనిపిస్తుంది . అయినా అది మన చేతిలో లేదుగా ?
శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి ఇటీవల ప్రకటించిన ‘ చీకటివెన్నెల ‘ 
కథల సంపుటిలోని కథ ఇది . మీరూ చదివి చూడండి మరి !పుస్తకం వివరాలకు మీరు సంప్రదించవలసిన మొబైల్ నం ;9866059615. 
కామెంట్‌లు