ఊరుగాలి ఈల 13:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మనసంత నిండిన ప్రకృతి మధుబాల 
మనిషిని ఊపిన ఊయల పల్లేరు జోలపాట
వడ్ల కుంచం కొన్న గుల్లనిండా తీపి చింతపల్కపండ్ల  

చింతచెట్టెక్కిన వయసు కోసే వగరు ఓనగాయ 
అమ్మమ్మ ఇంటి పులుపు నారింజ   పండ్ల గద్దింపు
మేనమామల వాకిట్ల మరదళ్ళ కాలిఅందెల నవ్వు

ప్రేమ వాకిళ్ళ మమతల చెలిమెల మట్టి ఊరు
మంచి నాటిన ప్రకృతివాక ఆనంద పూలతోట 
అమ్మనే తలపించు మురిపెమ్ము ఎదసొదల కోట

ఆకు రాలిన నేల చిగురించు గుండె కొమ్మల రెల్లు
ఏడ్పునవ్వులలోన జారేటి కన్నీరు ఊరు ఊరు
మనిషి నిప్పైనా మరువని బంధాల సంతకం ఊరు

అవని దారుల సాగే ఆత్మీయ భాష మమతమ్మ సంచి 
కడుపుల ఆకలి పసిగట్టి బువ్వెట్టు అక్షయ పాత్ర
కష్టసుఖాల కడలి నీదు కమనీయ ఆత్మ
పుట్టిన ఊరే

ముంచు పల్లకిలోన ఊరేగు గొంగడి వేడి
మనసు
వాకిలి పిడికిలి ఎగిసిన స్నేహగీతం
అక్షర జీవాత్మ
బురద నవ్విన పూవు వాన తడిసిన ముగ్ధ స్నిగ్ధ 

ఇప్పుడు అప్పుడు కాదు ఎప్పుడూ తల
నిమిరే దయగల స్పర్శ 
కన్నీరు కారినా పూలు జాలువారినా రాయిలో రత్నమది 
నడిచిన ప్రతి పాద పద్యాల వెలుగుల అర్థతాత్పర్యమే పల్లెసీమ


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent, congrats