ఎవుసం అరిగోస:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
 ఇన్నేళ్లు ఎవుసంచేసి 
నేను
ఎనకేసిందేమిలేదు
నెత్తినఆరని నిప్పుల కుంపటి అప్పులు
ఇంటి నిండా పాతుకుపోయిన 
ఇక్కట్లు

ఇత్తనం కానుంచి 
పిండి దాకా
అంతా ఉద్దెరసద్దెరేనాయే

సావు మరణమై
శాన కట్టంమీద
పంట తీసిన
ఇట్లా పంట చేతికొచ్చిందో ?
లేదో!?
ఎములోల్లవోలె
ఉద్దెరిచ్చిన షావుకార్లు
 నా ఇంటికొచ్చి
నాఅప్పుముందు కట్టమంటే?! నాఅప్పు ముందు కట్టమంటూ?!
నన్ను పదిమందిలా
పజీతలపాలు జేయబట్టిరి.

ఎదిగిన బిడ్డ పెళ్లి
ఈయేడన్న చేద్దామంటే?!
పండిన పంటను గద్దలెక్క కసాయోళ్ళుతన్నుకపోబట్టిరి

భూభకాసురులు కొందరు
నా పొలం చుట్టూ మిడలోలే తిరుగుతూ
నా ఇంటి దానికి కనికట్టు మంత్రమేదో?!
యేసిపోయిరి.

ఇంటిది!
 ఏమయ్యా?!
ఎవుసం జేసి నువ్వు
ఏం సంపాదించినవ్!
ఆడీడ అప్పులు తెచ్చి
ఆ మట్టిలో బోసుడే గని
ఎంత ఎనకేసినవ్!
ఇగో !మన పొలం అమ్మి
పోరి పెళ్లి చేద్దాం!
ఈడేరిన పోరి
ఇంటి మీద ఉంటే నలుగురు నానా తీర్లు అనుకోబట్టే?!
ధర మంచిగానే పడుతదట 
పొలం అమ్ముదాం?!

నా మీద ఒట్టే!
మాట్లాడవేంటి?
 అట్లాబెల్లం కొట్టిన రాయి లెక్క ఉంటావు?!
అని ఇంటిది
నన్ను లెక్కచేయకుండా 
మాట్లాడబట్టె?!
కన్నతల్లి లాంటి భూమిని
తెగనమ్ముకొని
వచ్చిన పైకాన్ని
ఎట్లా ?వాడాలో తెల్వక
ఇబ్బంది పడతమే  --అని అన్నా
ఇంటిది వినే స్థితిలో లేదు
తల్లి భూమాత
పైపై మెరుగులకు,
రంగుకాగితాలకు ,కాసులకు ముఖం వాచిపోయిన
నేటితరం
నేను ఊ అనక తప్పేలాలేదు 
ఏదేమైనా 
కానీ
ఉన్నదమ్ముకొని
ఓ ఫామ్ హౌస్
ముందు వాచ్మెన్ నౌకరీ అన్న చేస్తా
భూతల్లి నన్ను మన్నించు 2
నిన్ను ప్రేమించే నీ బిడ్డను
నేను నిన్ను ఓ‌  కసాయోడిచేతిలో పెడుతున్న 
తల్లి నన్ను మన్నించు2
ముందు నా బ్రతుకెట్లుంటదో?!
 ఏమో భగవంతుడా!?



కామెంట్‌లు