సునంద భాషితం :-వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు–704
శల్యక నానారస న్యాయము
****
శల్య అనగా ఎముక, బాణము, మేకు,ఏదుపంది,ఒక రాజు. నానా అనగా అనేక. రస అనగా  రుచి, భూమి, నాలుక అనే అర్థాలు ఉన్నాయి.
ఎముక లేని నాలుక ఎన్నో బాణాల వంటి  మాటలతో బాధిస్తుంది అని అర్థము.అందుకే "నాలుకకు ఎముకలు లేకున్నా అది ఎవరినైనా బాధించేంత బలంగా ఉంది " అంటుంటారు.
 నాలుకను నరం లేని నాలుక అంటారు కానీ నాలుకలో కూడా నరం వుంది.కానీ ఎముకలే లేవు.. అయితేనేం ఎముకలు విరగ్గొట్టే సుత్తి,బండరాయంత బలమైనది నాలుక.
నాలుకకు భౌతికంగా చూసేందుకు ఎముకలు లేకపోయినా అనగా శారీరకంగా  బలంగా లేకున్నా ఉపయోగించే పదాల తీవ్రత  మాత్రం అత్యంత బలంగా వుంటుంది.అనగా నోటి నుండి వెలువడే పదాలు, మాటలు తీవ్రమైన ప్రభావం చూపుతాయని భావము.
నోటి నుండి వెలువడే పదాలు శక్తివంతమైన  ఆయుధాలుగా ఉంటాయి., భౌతికంగా కంటికి కనిపించక అదృశ్య రూపములో ఉంటాయి.మంచిని పెంచటంలోనూ, మానసికంగా కృంగతీయడంలోనూ ముందుంటాయి. ఎవరినైనా బాధించాలంటే ఒక్క కుల్లు పదం చాలు. సున్నితమైన మనసున్న వారైతే జీవితాంతం ఆ మాట గాయంతో కుమిలి పోతారు.ఆ విధంగా నాలుకకు ఎముక లేకున్నా భావోద్వేగాల మీద దెబ్బ తీయగలదన్న మాట. 
అందుకే వేమన కవి వాక్కు కున్న శక్తి గురించి ఏం రాశాలో చూద్దామా..
వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు/వాక్కు వలన గలుగు వసుధ ఘనత/ వాక్కు వలన గలుగు నెక్కడైశ్వర్యముల్/ విశ్వదాభిరామ వినురవేమ!!"
అలాగే  మరో కవి రాసిన పద్యాన్ని చూద్దామా.
"వాక్కు కున్న పదును వాడి కత్తికి లేదు/ మార్చగలదు మాట మనిషి మనసు/జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త/ శబ్దములకు గొప్ప శక్తి గలదు. "
పై రెండు పద్యాలూ  నాలుక వలన కలిగే లాభాలు నష్టాల గురించి తెలుపుతూ ఎలా ఉపయోగించాలో చెప్పాయి.
ఈ విధంగా ఎముక లేని నాలుక నుండి వెలువడే అనేక రకాల మాటల సముదాయానికి కొత్తగా సృష్టించే శక్తి వుంది మరియు నాశనం చేసే శక్తి కూడా వుంది అనగా నాలుక జీవితాన్ని తేగలదు, ప్రసాదించగలదు.మరణానికి దారి తీయించ గలదు.
కాబట్టి నాలుక తనకిష్టమైన  రకరకాల రుచులను చవి చూపించడమే కాకుండా బాధించడానికి,వేధించడానికి, ఒకచో బోధించడానికి కూడా ఉపయోగ పడుతుందని మనకు తెలిసిపోయింది.
 "శల్యక నానారస న్యాయము" ద్వారా మన పెద్దలు  మనకు బోధించే నీతి ఏమిటంటే ఎముక లేని నాలుకను ఉపయోగించుటలో ఏమరుపాటు కూడదని ఎప్పుడూ? ఎవరినీ? ఎక్కడా? బాధించే విధంగా మాట్లాడ కూడదని, జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాం.

కామెంట్‌లు